హార్డ్‌డిస్కులను అడవిలో పడేసిన ప్రణీత్‌రావు!

స్పెషల్‌ ఇంటెలిజెన్స్‌ బ్రాంచి (ఎస్సైబీ)లోని హార్డ్‌డిస్కులను కట్టర్లతో కత్తిరించి, వికారాబాద్‌ అడవిలో పడేసినట్లు రెండోరోజు విచారణలో డీఎస్పీ ప్రణీత్‌రావు ఒప్పుకొన్నట్లు తెలుస్తోంది.

Updated : 19 Mar 2024 10:31 IST

రెండో రోజు విచారణలో వెల్లడించినట్లు సమాచారం

ఈనాడు, హైదరాబాద్‌: స్పెషల్‌ ఇంటెలిజెన్స్‌ బ్రాంచి (ఎస్సైబీ)లోని హార్డ్‌డిస్కులను కట్టర్లతో కత్తిరించి, వికారాబాద్‌ అడవిలో పడేసినట్లు రెండోరోజు విచారణలో డీఎస్పీ ప్రణీత్‌రావు ఒప్పుకొన్నట్లు తెలుస్తోంది. దీంతో మంగళ, బుధవారాల్లో నిందితుడ్ని వికారాబాద్‌ తీసుకెళ్లి హార్డ్‌డిస్కుల శకలాలు వెతికి స్వాధీనం చేసుకునేందుకు పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు. కోర్టు అనుమతితో ప్రణీత్‌రావును కస్టడీలోకి తీసుకున్న పోలీసులు.. ఆదివారం రహస్య ప్రాంతానికి తరలించి విచారించారు. రెండో రోజైన సోమవారం బంజారాహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌లోనే ప్రశ్నించారు.

పంజాగుట్ట పోలీసులు ఈ కేసు నమోదు చేసినప్పటికీ.. నిఘా విభాగంలో అనుభవం ఉండి, ప్రస్తుతం పశ్చిమ మండలంలో పనిచేస్తున్న ఓ ఏసీపీ స్థాయి అధికారితోపాటు మరో ఇద్దరితో కూడిన ప్రత్యేక బృందం ఆధ్వర్యంలో విచారణ జరుగుతోంది. ఈ కేసు సంచలనం సృష్టిస్తున్న నేపథ్యంలో ముందు జాగ్రత్తగా బంజారాహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌ వద్ద కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేశారు. గేట్లు మూసివేసి ఫిర్యాదుదారులను మినహా ఇతరులను లోనికి అనుమతించలేదు. మధ్యాహ్న భోజన విరామం మినహా ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 వరకూ విచారణ కొనసాగింది. నిఘా సమాచారం ధ్వంసంపై విచారణాధికారులు ఎక్కువ ప్రశ్నలు అడిగినట్లు తెలుస్తోంది. అసలు సమాచారాన్ని తుడిపి వేయాల్సిన అవసరం ఏమొచ్చింది, ప్రత్యేకంగా కొన్ని హార్డ్‌డిస్కులనే ఎందుకు ధ్వంసం చేశారని అడిగినట్లు సమాచారం.

ప్రణీత్‌తో కలిసి ఎస్సైబీలో పనిచేసి, ప్రస్తుతం నల్గొండ జిల్లాలో సీఐగా ఉన్న మరో అధికారిని  పోలీసులు సోమవారం పిలిపించారు. శాసనసభ ఎన్నికలకు ముందు ప్రణీత్‌తో కలిసి ఈ సీఐ పనిచేసినట్లు గుర్తించారు. ఆయనను విచారించి పంపించేశారు. ప్రణీత్‌తో కలిసి ఎస్సైబీలో పనిచేసిన మరికొందర్ని కూడా పిలిపించి విచారించే అవకాశం ఉందని తెలిసింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని