Vijay Babu: ‘నన్ను కిస్‌ చేయబోయాడు’.. నటుడు విజయ్‌బాబుపై మరో నటి ఫిర్యాదు!

మలయాళ నటుడు, నిర్మాత విజయ్‌ బాబుపై మరోసారి లైంగిక వేధింపుల ఆరోపణలు రావడం కలకలం రేపుతోంది. ఇటీవల ఓ యువ నటిపై .....

Published : 01 May 2022 01:42 IST

తిరువనంతపురం: మలయాళ నటుడు, నిర్మాత విజయ్‌ బాబుపై మరోమారు లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చాయి. ఇటీవల ఓ యువ నటిపై అత్యాచారానికి పాల్పడినట్టు కేసు నమోదు కావడంతో పరారీలో ఉన్న అతడిపై తాజా ఆరోపణలు కలకలం రేపాయి. సినీ పరిశ్రమలో అడుగుపెట్టాలనుకున్న ఓ మహిళ.. అతడి నుంచి తనకు ఎదురైన భయానక అనుభవాన్ని ‘విమెన్‌ ఎగెనిస్ట్‌ సెక్సువల్‌ హెరాస్‌మెంట్‌’ అనే ఫేస్‌బుక్‌ పేజీలో పంచుకున్నారు. తన డ్రీమ్‌ను అతడు ఎలా చెదరగొట్టాడో వివరించారు.

‘‘గతేడాది నవంబర్‌లో నటుడు, నిర్మాత, ఫ్రైడే ఫిలిం హౌస్‌ యజమాని విజయ్‌ బాబును ఓసారి కలిశాను. ఇద్దరం ప్రొఫెషనల్‌ అంశాలపై చర్చించుకున్నాం. ఆ తర్వాత మా ఇద్దరి మధ్య వ్యక్తిగతమైన అంశాలూ చర్చకు వచ్చాయి. నా బాధలు చెప్పగా.. నాకు హెల్ప్‌ చేస్తానన్నాడు. ఆ సమయంలోనే మా ఇద్దరితో పాటు గదిలో ఉన్న వ్యక్తి బయటకు వెళ్లిపోయాడు. అప్పుడు గదిలో మేం ఇద్దరమే ఉన్నాం. విజయ్‌ బాబు మద్యం సేవిస్తున్నారు. నాకూ ఆఫర్‌ చేశారు. నేను తిరస్కరించి నా పని చూసుకుంటున్నా. అకస్మాత్తుగా నా పెదాలపై ముద్దు పెట్టేందుకు ప్రయత్నించాడు. నా పర్మిషన్‌ లేకుండానే అలా చేశారు. వెంటనే అప్రమత్తమై నేను అతడి నుంచి దూరంగా జరిగిపోయాను. అతడివైపు చూశా.. ‘జస్ట్‌ వన్‌ కిస్‌’ అన్నాడు. నేను ససేమిరా కుదరదని చెప్పడంతో నాకు సారీ చెప్పి.. ఈ విషయాన్ని ఎవరితోనూ చెప్పవద్దని బతిమిలాడాడు. నేను కూడా సరేనని ఏదో ఒక కారణం చెప్పి అక్కడి నుంచి బయటపడ్డాను. కానీ, ఆ తర్వాత అతడి చీప్ బిహేవియర్ నన్ను ఇండస్ట్రీలోకి రానివ్వకుండా చేసింది. మలయాళ ఇండస్ట్రీలో అడుగుపెట్టాలన్న నా కలకు అక్కడితోనే ఫుల్‌స్టాప్‌ పెట్టేశాను. హీరోయిన్‌ అవ్వాల్సిన నేను ఆ భయంతో ఉండిపోయాను. ఇటీవల ఓ నటి తనకు ఎదురైన చేదు అనుభవాన్ని బయటపెట్టిన వార్త చదివినప్పుడు నేనూ ఈ విషయాన్ని ప్రపంచానికి చెప్పాలనిపించింది. నా బాధను అందరితో పంచుకోవాలనిపించి ఇప్పుడు నోరు విప్పాను’’ అని పేజీలో రాసింది. ప్రస్తుతం ఈ పోస్టు వైరల్‌గా మారింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని