పుల్వామా తరహాలో భారీ ఉగ్ర కుట్ర!

పుల్వామా దాడి జరిగి రెండేళ్లు పూర్తైన వేళ..ఉగ్రవాదులు మరోసారి భారీ కుట్రకు ప్రయత్నించినట్లు బయటపడింది.

Published : 15 Feb 2021 01:13 IST

భగ్నం చేసిన భద్రతా దళాలు.. నలుగురి అరెస్ట్‌

జమ్మూ: పుల్వామా దాడి జరిగి రెండేళ్లు పూర్తైన వేళ ఉగ్రవాదులు మరోసారి భారీ కుట్రకు యత్నించినట్లు బయటపడింది. అయితే, దీన్ని ముందుగానే పసిగట్టిన భద్రతా దళాలు ఆ కుట్రను భగ్నం చేశాయి. ఇందులో భాగంగా నలుగురు అనుమానితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. వారి నుంచి భారీ స్థాయిలో పేలుడు పదార్థాలు, తుపాకులు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.

రెండేళ్ల క్రితం జమ్మూలోని పుల్వామా దాడి ఘటన జరిగి ఆదివారానికి రెండేళ్లు పూర్తయ్యింది. ఈ నేపథ్యంలో ఇదే రోజున జమ్మూలో మరోసారి భారీ ఉగ్రదాడికి యత్నించేందుకు ముష్కరులు ప్రయత్నిస్తున్నట్లు నిఘా విభాగం పసిగట్టింది. దీంతో గడిచిన నాలుగు రోజులుగా పోలీసులు గస్తీని ముమ్మరం చేయడంతోపాటు అన్ని ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు. దీనిలో భాగంగా సాంబా జిల్లాలోని రఘునాథ్‌ మందిర్‌ ప్రాంతంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న ఓ నర్సింగ్‌ విద్యార్థిని అదుపులోకి తీసుకొని విచారించారు. దీంతో ఈ భారీ ఉగ్రకుట్ర భగ్నమయ్యింది. అతడి నుంచి అత్యంత తీవ్రత కలిగిన 7 కిలోల మందుగుండు సామగ్రి (15 ఐఈడీ)లతో పాటు ఆరు పిస్టల్‌లను స్వాధీనం చేసుకున్నట్లు జమ్మూ రేంజ్‌ ఐజీపీ ముఖేష్‌ సింగ్‌ వెల్లడించారు.

రద్దీ ప్రదేశాలే లక్ష్యంగా..!
అదుపులోకి తీసుకున్న నర్సింగ్‌ విద్యార్థిని విచారించగా, నాలుగు చోట్ల దాడి చేసేందుకు పథకం రచించినట్లు బయటపడింది. ముఖ్యంగా రద్దీ ప్రదేశాలైన రఘునాథ్‌ మందిర్‌, బస్‌స్టాండ్‌, రైల్వే స్టేషన్, లఖ్‌దాతా బజార్‌ చోట్ల దాడులు జరిపి శ్రీనగర్‌కు పారిపోయేందుకు ప్రణాళిక రచించినట్లు పోలీసులు విచారణలో వెల్లడించాడు. వీరి నుంచి స్వాధీనం చేసుకున్న ఐఈడీలను బాంబ్‌ స్క్వాడ్‌ బృందాలు నిర్వీర్యం చేశాయి. 
జమ్మూకశ్మీర్‌లోని పుల్వామాలో 2019 ఫిబ్రవరి 14న సీఆర్పీఎఫ్‌ జవాన్లు ప్రయాణిస్తున్న వాహనంపై జైషే ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. ఈ దుర్ఘటనలో 40 మంది భారత జవాన్లు వీర మరణం పొందారు.

ఇవీ చదవండి..
పుల్వామా దాడి..ఎన్‌ఐఏ ఛార్జ్‌షీట్‌ దాఖలు
పుల్వామా దాడి మా పనే..పాక్‌ మంత్రి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని