
Crime news: శునకానికి ‘సోను’ అని పేరు.. మహిళకు నిప్పంటించిన పొరుగింటివారు
గాంధీనగర్: తాము ప్రేమగా పెంచుకుంటున్న శునకానికి ‘సోను’ అని పేరు పెట్టడమే ఆ మహిళకు శాపంగా మారింది. ఆ పేరు పెడతావా అంటూ పొరుగింటివారు ఆమెపై కిరోసిన్ పోసి నిప్పంటించారు. ఈ ఘటన గుజరాత్‌లో జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. భావ్‌నగర్ ప్రాంతంలోని ఓ గ్రామానికి చెందిన నీతాబెన్ సర్వాయియా (35) తాము పెంచుకుంటున్న శునకానికి సోను అని పేరుపెట్టారు. అయితే ఈ విషయంపై ఆగ్రహించిన పొరుగింటివారు.. మంగళవారం నీతాబెన్ ఒంటరిగా ఉండటాన్ని గమనించి వారింట్లోకి బలవంతంగా చొరబడ్డారు.
తన భార్య ముద్దుపేరు సోను అని.. ఆ పేరు కుక్కకు ఎలా పెడతారు అని సురాభాయ్ భర్వాద్ అనే పొరుగింటి వ్యక్తి నీతాబెన్‌తో వాగ్వాదానికి దిగాడు. ఆమె వంటగదిలోకి వెళ్లగా వెంబడించిన ముగ్గురు వ్యక్తులు అక్కడి కిరోసిన్ డబ్బాను తీసుకొని, ఆమెపై పోసి నిప్పంటించారు. మంటలంటుకొని బాధితురాలు కేకలు వేయడంతో వారు అక్కడినుంచి పారిపోయారు. ఆమె అరుపులతో ఇంట్లోకి వచ్చిన స్థానికులు మంటలను ఆర్పి బాధితురాలిని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె తీవ్ర గాయాలతో భావ్‌నగర్ ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతోంది.
భర్త, ఇద్దరు పిల్లలు ఇంట్లో లేనిసమయంలో ఐదుగురు వ్యక్తులు తమ ఇంట్లోకి ప్రవేశించారని, దర్భాషలాడారని సదరు బాధితురాలు పోలీసులకు తన వాంగ్మూలాన్ని ఇచ్చింది. వంటింట్లోకి వెళ్లగా అక్కడికి వచ్చిన ముగ్గురు వ్యక్తులు కిరోసిన్ పోసి నిప్పంటించినట్లు తెలిపింది. ఆమె పిర్యాదుతో ఐదుగురిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గతంలోనూ ఈ కుటుంబాలకు పలు వివాదాలు జరిగినట్లు గుర్తించారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.