TS News: విషాదం.. గ్యాస్‌ లీకై దంపతులు సహా కుమార్తె సజీవదహనం

భద్రాద్రి కొత్తగూడెం పాత పాల్వంచ తూర్పు బజారులో విషాదం చోటు చేసుకుంది.

Updated : 03 Jan 2022 13:25 IST

భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం పాత పాల్వంచ తూర్పు బజారులో విషాదం చోటు చేసుకుంది. ఇంట్లో గ్యాస్ లీకేజీతో రామకృష్ణ, శ్రీలక్ష్మి దంపతులతో సహా కుమార్తె సాహిత్య(12) సజీవదహనమయ్యారు. మంటలు అంటుకొని మరో కుమార్తె సాహితికి తీవ్రగాయాలయ్యాయి. చిన్నారిని పాల్వంచ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అక్కడి నుంచి భద్రాద్రి కొత్తగూడెంలోని ఆస్పత్రికి తీసుకెళ్లారు. చిన్నారికి 80శాతం కాలిన గాయాలైనట్లు వైద్యులు తెలిపారు. తొలుత ఘటనను ప్రమాదవశాత్తూ జరిగిందని సమాచారం అందినా..తమకు అందిన ప్రాథమిక సమాచారంతో దీన్ని ఆత్మహత్యగా పోలీసుల భావిస్తున్నారు. ఘటనాస్థలికి చేరుకున్న క్లూస్‌ టీమ్‌ రామకృష్ణ కారులోని కొన్ని కీలక పత్రాలు, బిల్లులను స్వాధీనం చేసుకుంది.

పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. రామకృష్ణ గతంలో పాల్వంచలో మీసేవా కేంద్రాన్ని నడిపేవారు. రెండు నెలల క్రితం దాన్ని విక్రయించి రాజమహేంద్రవరానికి మకాం మార్చారు. రెండు రోజుల కిందటే రామకృష్ణ, శ్రీలక్ష్మి దంపతులు వారి కవల పిల్లలు సాహితి, సాహిత్యలతో కలిసి పాల్వంచలోని తమ నివాసానికి వచ్చారు. ఈ ఉదయం ఘటన జరిగిన చాలా సేపటి వరకు చుట్టు పక్కల ఇళ్లవారు గుర్తించలేదు. అనంతరం ఇంటి నుంచి గ్యాస్‌ వాసన, పొగలు వస్తుండటంతో పోలీసులకు సమాచారం అందించారు. అప్పటికే ముగ్గురు విగతజీవులుగా కనిపించారు. చిన్నారి సాహితి తీవ్రగాయాలతో పోలీసులు తలుపు తెరవగానే ఇంటి బయటికి వచ్చింది. అప్పులు పెరిగిపోవడం, ఆన్‌లైన్‌ వ్యాపారాల్లో రూ.30లక్షలకు పైగా నష్టం రావడంతో రామకృష్ణ కుటుంబం ఆత్మహత్యకు పాల్పడి ఉంటుందని పోలీసులు చెబుతున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని