logo

ఏఈవో కార్యాలయాలుగా రైతువేదికలు

రైతులకు సకాలంలో అవసరమైన సలహాలు, సూచనలు అందించేందుకు ఒక వేదిక ఉండాలనే లక్ష్యంతో గ్రామాల్లో నిర్మించిన రైతు వేదికలను ప్రభుత్వం ఇక నుంచి వ్యవసాయ విస్తరణాధికారి ( ఏఈవో)

Published : 23 May 2022 03:12 IST

అమలునకు సర్కారు సన్నాహాలు

మంచిర్యాల గ్రామీణం, న్యూస్‌టుడే: రైతులకు సకాలంలో అవసరమైన సలహాలు, సూచనలు అందించేందుకు ఒక వేదిక ఉండాలనే లక్ష్యంతో గ్రామాల్లో నిర్మించిన రైతు వేదికలను ప్రభుత్వం ఇక నుంచి వ్యవసాయ విస్తరణాధికారి ( ఏఈవో) కార్యాలయాలుగా మార్చేందుకు రంగం సిద్ధం చేస్తోంది.  రైతు వేదికలను నిర్మించి రెండేళ్లు పూర్తవుతున్నప్పటికీ వాటిని సక్రమంగా వినియోగించడం లేదనే ఆరోపణలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో సర్కారు రైతులకు ఉపయోగపడేలా నిర్ణయం తీసుకోవడంపై హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. వానాకాలం, యాసంగి సాగు సమయాల్లో సరైన సూచనలు అందేందుకు ఈ నిర్ణయం ఎంతగానో తోడ్పడుతుందనే ఆశతో రైతులు ఎదురుచూస్తున్నారు. 

నిత్యం అందుబాటులో ఉండేలా ఆదేశాలు..

ఉమ్మడి జిల్లాలోని క్లస్టర్ల స్థాయిలో నిర్మించిన రైతువేదికలను ఉపయోగంలోకి తెచ్చేందుకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని పక్కాగా అమలు చేసేందుకు జిల్లా స్థాయి అధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి. ఏఈవోలు ప్రతిరోజు ఉదయం 9 గంటలకు గ్రామాల్లోని రైతు వేదికలకు చేరుకోవాలి. అనంతరం క్షేత్రస్థాయిలో పంట పొలాలకు వెళ్లాలి. మధ్యాహ్నం 3 గం.ల నుంచి సాయంత్రం 5 గం.ల వరకు రైతువేదికల్లో రైతులకు అందుబాటులో ఉండేలా ఆదేశాలు జారీ అయ్యాయి. సాగు సమస్యలపై రైతులకు ఎప్పటికప్పుడు సూచనలు, సలహాలు అందించాలి. ఒక్కో రైతు వేదిక పరిధిలో 1500 నుంచి 5 వేల ఎకరాల వరకు విస్తీర్ణం ఉంటుంది. దీనిపై సంబంధిత  ఏఈవోలు పర్యవేక్షణ చేస్తూ రైతులకు అందుబాటులో ఉండాలి. దీనికోసం ప్రభుత్వం ప్రతి నెలా నిర్వహణ ఖర్చుల కింద 9 వేలు చెల్లించనుంది. గతంలోనే కార్యాలయానికి అవసరమైన ఫర్నీచర్‌ అందజేసింది. కనీస వసతులు కల్పించినందున కార్యాలయానికి అనుకూలంగా మార్చుకుని రైతులకు అవసరమైన రీతిలో సేవలందించేందుకు చర్యలు చేపట్టింది. పలు ప్రాంతాల్లో గ్రామాలకు దూరంగా నిర్మించిన రైతువేదికలకు భద్రత కరవైంది. సరైన రక్షణ చర్యలు తీసుకోకపోవడంతో రాత్రివేళ మందుబాబులకు అడ్డాగా మారాయి. అలాంటి ప్రాంతాల్లో దినమంతా మహిళా అధికారులు విధులు నిర్వహించేందుకు జంకుతున్నారు. ఇలాంటి రైతువేదికలకు సరైన రక్షణ ఏర్పాట్లు చేస్తే మరింత ఉపయోగకరంగా ఉంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

తాజా సమాచారం అందుతుంది: కృష్ణ, మండల వ్యవసాయాధికారి, మంచిర్యాల 

ఏఈవోలకు క్షేత్రస్థాయిలో రైతువేదికలను కార్యాలయాలుగా మార్చితే రైతులకు తాజా సమాచారం అందుతుంది. రైతులు సుదూర ప్రాంతాలకు వెళ్లకుండా గ్రామంలోనే సూచనలు, సలహాలు పొందుతారు. ఇప్పటికే ప్రతి వారంలో రెండు రోజులు రైతులకు ఏఈవోలు సాగులో మెలకువలు, ఎరువులు, విత్తనాలపై అవగాహన కల్పిస్తున్నారు. నిత్యం పర్యవేక్షణ చేస్తే రైతులను చైతన్యవంతం చేసి నకిలీ విత్తనాలు, ఎరువుల భారి నుంచి కాపాడుకోవచ్చు. పంటలకు తెగులు సోకితే సత్వరమే ఏఈవోలు స్పందించి పంటలను కాపాడుకోవచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని