logo

నేటి నుంచి ఉపాధ్యాయ బదిలీ ప్రక్రియ

దీర్ఘకాలంగా ఉపాధ్యాయులు ఎదురుచూస్తున్న బదిలీ, పదోన్నతి ప్రక్రియ ఎట్టకేలకు కార్యరూపం దాల్చింది. జిల్లాలో శుక్రవారం నుంచి మొదలుకానుంది.

Updated : 27 Jan 2023 05:59 IST

37 రోజుల పాటు కొనసాగింపు
నిర్మల్‌ పట్టణం, న్యూస్‌టుడే

దీర్ఘకాలంగా ఉపాధ్యాయులు ఎదురుచూస్తున్న బదిలీ, పదోన్నతి ప్రక్రియ ఎట్టకేలకు కార్యరూపం దాల్చింది. జిల్లాలో శుక్రవారం నుంచి మొదలుకానుంది. ఖాళీల వివరాలు, సీనియార్టీ జాబితా ప్రకటన, కౌన్సెలింగ్‌, ఉద్యోగాల కేటాయింపు తదితర అంశాలను కట్టుదిట్టంగా అమలుచేసేందుకు ఏర్పాట్లుచేశారు. మొత్తంగా ఇదంతా మార్చి 4 వరకు అంటే 37 రోజుల పాటు కొనసాగనుంది.

పూర్తయిన ఎస్‌బీ పరిశీలన..

జిల్లా ఆవిర్భావం అనంతరం తొలిసారిగా జరుగుతున్న పదోన్నతులు కావడంతో అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. జిల్లాలోని ఉపాధ్యాయులందరి వివరాలతో ఇప్పటికే విద్యాశాఖ జాబితా రూపొందించింది. తదనుగుణంగా పీజీ ప్రధానోపాధ్యాయులు, స్కూల్‌ అసిస్టెంట్‌ ఉద్యోగాలకు అర్హులైన ఉపాధ్యాయుల సర్వీసు పుస్తకాలు (ఎస్‌బీ), విద్యార్హత నిజ ధ్రువపత్రాల పరిశీలన పూర్తిచేశారు. ఇందుకోసం ఆయా కేటగిరీల వారీగా కటాఫ్‌ తేదీలను ప్రకటించారు. చిన్నాచితకా అభ్యంతరాలుంటే వాటిని పరిష్కరించుకోవాలని సూచించారు.

అందుబాటులోకి ఖాళీలు..

జిల్లా పరిధిలో ఖాళీల వివరాలను గుర్తించారు. వీటిని జిల్లా విద్యాశాఖ వెబ్‌సైట్‌తో పాటు రాష్ట్ర విద్యాశాఖ కార్యాలయ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. శుక్రవారం నుంచి ఈ వివరాలను పరిశీలించుకోవచ్చు. గెజిటెడ్‌ ప్రధానోపాధ్యాయులు, స్కూల్‌ అసిస్టెంట్‌ పదోన్నతులకు సంబంధించిన సీనియార్టీ జాబితా సైతం అందుబాటులో ఉంచారు. అన్ని కేటగిరీల ఉపాధ్యాయులు వీటిని సరిచూసుకోవచ్చు.

రేపటి నుంచి దరఖాస్తులు..

ఆయా కేటగిరీల వారీగా ఉన్న ఉపాధ్యాయులు బదిలీల కోసం శనివారం నుంచి తమ దరఖాస్తులను సమర్పించాలి. ఇందుకోసం మూడు రోజులు అవకాశం కల్పించారు. www.schooledu.telangana.gov.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలి. స్థానిక సంస్థలు, ప్రభుత్వ పరిధిలోని పాఠశాలలు, వచ్చిన దరఖాస్తులు, ఖాళీలు, మీడియం, కేటగిరీ ఆధారంగా కౌన్సెలింగ్‌ నిర్వహించి పోస్టులను కేటాయించనున్నారు.


సమాచారం ఎప్పటికప్పుడు గమనించాలి

డా.ఎ.రవీందర్‌రెడ్డి, జిల్లా విద్యాధికారి

బదిలీ, పదోన్నతి ప్రక్రియ మొదలవుతున్నందున జిల్లాలోని ఉపాధ్యాయులంతా అప్రమత్తంగా ఉండాలి. విద్యాశాఖ జారీచేసే సూచనలు, జారీచేసే ప్రకటనలను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలి. సమాచారం తెలుసుకోవాలి. షెడ్యూల్‌ ప్రకారం ప్రక్రియ మొత్తం పకడ్బందీగా, పారదర్శకంగా పూర్తిచేసేందుకు ఏర్పాట్లు చేశాం. సిబ్బందితో అవసరమైన కమిటీలు ఏర్పాటుచేశాం. అందరూ సహకరించాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని