logo

పెరిగిన గౌరవం.. వేతన ఆనందం

పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు లేక.. బిల్లులు రాక అవస్థలు పడుతున్న తరుణంలో మధ్యాహ్న భోజన కార్మికులకు నెలకు రూ. మూడు వేలు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసింది.

Published : 06 Feb 2023 05:17 IST

వంట చేస్తున్న మధ్యాహ్న భోజన కార్మికులు

దండేపల్లి, మంచిర్యాల విద్యావిభాగం; న్యూస్‌టుడే: పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు లేక.. బిల్లులు రాక అవస్థలు పడుతున్న తరుణంలో మధ్యాహ్న భోజన కార్మికులకు నెలకు రూ. మూడు వేలు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసింది. అన్ని ప్రభుత్వ యాజమాన్యాల కింద ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం అమలు అవుతోంది. ఎంపిక చేసిన ఏజన్సీలు పిల్లలకు వండి వడ్డిస్తున్నారు. విద్యార్థులకు సరిపడా బియ్యం ప్రభుత్వం ఇస్తుండగా వంట చెరకుతో పాటు కూరగాయలు, ఇతర నిత్యావసర సరకులన్నీ ఏజన్సీలే సమకూర్చుకోవాలి. ఇందుకోసం ప్రాథమిక స్థాయిలో ప్రతీ విద్యార్థికి రోజుకు రూ. 5.45, ఆరు నుంచి ఎనిమిదో తరగతి విద్యార్థులకు రూ. 8.17 కాగా 9, 10 విద్యార్థులకు రూ. 10.67 చొప్పున చెల్లిస్తున్నారు. బిల్లులతో పాటు వీరికి గౌరవ వేతనం నెలకు రూ. ఒక వెయ్యి చెల్లిస్తున్నారు. ఇందులో కేంద్ర ప్రభుత్వ వాటా రూ. 600 కాగా, రాష్ట్ర ప్రభుత్వ వాటా రూ. 400 ఉంది. గత కొంతకాలంగా పెరుగుతున్న ధరలకు అనుగుణంగా బిల్లులు, వేతనాలు పెంచాలని ఏజన్సీ సభ్యులు ఆందోళన బాట పట్టారు. గతేడాది కొన్ని జిల్లాలతో పాటు మంచిర్యాలలో పలు చోట్ల రోజుల తరబడి తమ విధులు బహిష్కరించి ఆందోళన చేశారు.. దీనికి స్పందించిన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ గతేడాది శాసనసభలో నెలకు రూ. 3వేలకు పెంచుతున్నట్లు ప్రకటించారు. అయితే ఇప్పటివరకు ఇందుకు సంబంధించిన ప్రభుత్వ ఉత్తర్వులు రాలేదు. దీంతో భోజన కార్మికులు పలుసార్లు ప్రభుత్వానికి విన్నవించడంతో రెండ్రోజుల కిందట వేతనం పెంచుతూ ఉత్తర్వులు విడుదల చేసింది. కార్మికులకు ఆర్థికంగా ప్రయోజనం చేకూరనుంది.


వెంటనే అమలు చేయాలి
- నాలం శ్రీదేవి, మధ్యాహ్న భోజన కార్మికుల సంఘం జిల్లా అధ్యక్షురాలు

ఏళ్లుగా సర్కారు పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం వండి వడ్డిస్తున్నాం. గత కొన్నేళ్లుగా గౌరవ వేతనం నెలకు రూ. ఒక వెయ్యి మాత్రమే ఇచ్చారు. ప్రస్తుతం నెలకు రూ. 3 వేల వేతనం పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వడం సంతోషకరం. ఇవి వెంటనే అమలు చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. గతంలో ముఖ్యమంత్రి ప్రకటించిన నాటి నుంచి రావాల్సిన బకాయిలు అందజేయాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని