logo

పనులు అస్తవ్యస్తం.. సమస్యలతో సహవాసం

ఇంటింటికీ తాగునీటిని సరఫరా చేయాలన్న సదుద్దేశ్యంతో ప్రభుత్వం మిషన్‌ భగీరథ పథకం అమలుచేస్తోంది.

Published : 02 Jun 2023 04:05 IST

మిషన్‌ భగీరథ పనితీరిది

పింజారిగుట్టలో పైప్‌లైన్‌ కోసం తవ్వడంతో రహదారి దుస్థితి

నిర్మల్‌ పట్టణం, న్యూస్‌టుడే: ఇంటింటికీ తాగునీటిని సరఫరా చేయాలన్న సదుద్దేశ్యంతో ప్రభుత్వం మిషన్‌ భగీరథ పథకం అమలుచేస్తోంది. ఆశయం బాగానే ఉన్నా.. ఆచరణలో అలసత్వం కారణంగా సమస్యలు తప్పటం లేదు. చేపట్టిన పనులన్నీ అస్తవ్యసంగా సాగుతుండటంతో స్థానికులు ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. పరిష్కారానికి ఆర్తిగా ఎదురుచూస్తున్నారు.


అంతర్గత రహదారులు ఛిద్రం..

గతంలోనే ప్రధాన పైప్‌లైన్‌ ఏర్పాటు కోసం కాలనీల్లో తవ్వకాలు చేపట్టారు. రోజులు గడిచాయి. వాటిని పూడ్చడం మర్చిపోయారు. ఆ తర్వాత ఇంటింటి కనెక్షన్ల కోసం మళ్లీ తవ్వకాలు చేపట్టారు. ఫలితంగా చాలాచోట్ల అంతర్గత రహదారులు దెబ్బతిన్నాయి. కొత్తగా ఏర్పడిన కాలనీల్లో సీసీ రహదారులు లేకపోవడంతో పెద్దగా ఇబ్బందుల్లేవు. కానీ, పాత కాలనీల్లో, ఇప్పటికే రహదారుల నిర్మాణం పూర్తయిన చోట్ల చేపట్టిన తవ్వకాలు మాత్రం స్థానికులకు నరకప్రాయంగా మారుతున్నాయి. తవ్విన వాటిని సకాలంలో పూడ్చడం విస్మరించారు. వాస్తవానికి పనులు కాగానే హుటాహుటిన వాటికి ప్యాచ్‌వర్క్‌లు చేపట్టాలి. కానీ.. ఇది చాలావరకు అమలుకావడం లేదు. ఫలితంగా తవ్వకాలు చేపట్టిన మార్గంలో రాకపోకలు సాగించేవారికి, ముఖ్యంగా ద్విచక్రవాహనదారులకు అవస్థలు నిత్యకృత్యంగా మారాయి. వాహనాలు దెబ్బతినడంతో పాటు ఆరోగ్య సమస్యలూ ఉత్పన్నమవుతున్నాయి వాపోతున్నారు.


నీటి సరఫరాలోనూ ఆటంకమే..

పట్టణంలో దాదాపుగా మిషన్‌ భగీరథ పథకం కింద కొత్త పైప్‌లైన్లు వేశారు. వాటికి తోడు గతంలో ఉన్న పాత పైప్‌లైన్లు, అంతర్గత కనెక్షన్లు ఇంకా అలాగే కొనసాగుతున్నాయి. కొత్త కనెక్షన్లకు కొన్నిచోట్ల నీటి సరఫరా కొనసాగడం లేదు. పాత తరహాలోనే నీళ్లొస్తున్నాయి. పింజారిగుట్ట లాంటి కాస్త ఎత్తయిన ప్రదేశాల్లో నీటి పరిమాణం తక్కువగా ఉండటంతో స్థానికుల తాగునీటి అవసరాలను పూర్తిస్థాయిలో తీర్చలేకపోతోంది. కొత్త పైప్‌లైన్‌లో నీటి సరఫరా జరిగితే ఈ సమస్య తీరుతుంది. కానీ, కనెక్షన్‌ ప్రక్రియ పూర్తయినా నీటి సరఫరా మాత్రం ప్రారంభం కాకపోవడంతో స్థానికులను అసహనానికి గురిచేస్తోంది. కొన్నిచోట్ల మురుగుకాలువల్లోంచి వేసిన పైప్‌లైన్‌లను చూసి విస్తుపోతున్నారు. లీకేజీ ఏర్పడితే తాగునీరు కలుషితమయ్యే ప్రమాదముంటుందని, అధికారులు ప్రత్యామ్నాయ చర్యలు తీసుకుంటే బాగుండేదని పేర్కొంటున్నారు.


రాంనగర్‌ ప్రాంతంలో అలా..

61వ జాతీయరహదారి సమీపంలో ఉన్న రాంనగర్‌ ప్రాంతంలో నీటి ఇబ్బందులు నిత్యకృత్యమవుతున్నాయి. వేసవి వచ్చిందంటే పరిస్థితి మరింత దయనీయమవుతోందని పలువురు కాలనీవాసులు వాపోతున్నారు. గుట్టప్రాంతం కావడంతో నీళ్లు రావని, మిషన్‌ భగీరథ పథకం కింద పైప్‌లైన్‌ వేయాలని అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా ఫలితముండటం లేదని ఆవేదన చెందుతున్నారు. ప్రధాన రహదారిపక్కనే ఉన్నా, కొన్ని నివాసాలే ఉండటంతో అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారనే విమర్శలూ లేకపోలేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని