logo

రిమ్స్‌ నిర్వహణపై పాలనాధికారి అసంతృప్తి

ఆదిలాబాద్‌ రిమ్స్‌ ఆసుపత్రిని కలెక్టర్‌ రాజర్షిషా సోమవారం సాయంత్రం ఆకస్మికంగా తనిఖీ చేశారు.

Published : 16 Apr 2024 02:50 IST

మరుగుదొడ్లు, పారిశుద్ధ్యంపై ఫిర్యాదు చేసిన రోగుల సహాయకులు

రిమ్స్‌లో ప్రసవ విభాగంలో వివరాలు తెలుసుకుంటున్న కలెక్టర్‌ రాజర్షి షా

ఆదిలాబాద్‌ వైద్య విభాగం, న్యూస్‌టుడే : ఆదిలాబాద్‌ రిమ్స్‌ ఆసుపత్రిని కలెక్టర్‌ రాజర్షిషా సోమవారం సాయంత్రం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆయన జిల్లా పాలనాధికారిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం మొదటి సారి రిమ్స్‌ను సందర్శించారు. ఆసుపత్రి నిర్వహణ తీరుపై, ఆసుపత్రిలోని రోగుల పడకలపై దుప్పట్లను మార్చకపోవటం పట్ల ప్రశ్నిస్తూ అసంతృప్తి వ్యక్తం చేశారు. అత్యవసర విభాగంతో పాటు ప్రసవ విభాగాన్ని తనిఖీ చేసి రిమ్స్‌ సంచాలకుడు రాఠోడ్‌ జైసింగ్‌, సంబంధిత హెచ్‌ఓడీని వివరాలు అడిగి తెలుసుకున్నారు. గిరిజనులకు మెరుగైన వైద్యం కోసం ఆదిలాబాద్‌కు కేటాయించిన అంబులెన్స్‌ అందుబాటులో లేదని బేలకు చెందిన సామ రూపేష్‌రెడ్డి పాలనాధికారి దృష్టికి తీసుకెళ్లారు. ఈ విషయమై లైజన్‌ అధికారి సత్యనారాయణను ఆయన ప్రశ్నిస్తూ అంబులెన్స్‌కు మరమ్మతులు ఎన్ని రోజులు చేయిస్తారని ప్రశ్నించారు. రోగుల సహాయకులకు మరుగుదొడ్లు అందుబాటులో లేవని కొందరు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. రోగుల సహాయకుల కోసం ఉన్న మరుగుదొడ్లకు తాళాలు వేసి ఉండటం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. పారిశుద్ధ్య కార్మికులు, భద్రత సిబ్బందిని పిలిపించి మాట్లాడగా ఉండాల్సిన సిబ్బంది కంటే తక్కువ ఉండటం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. పారిశుద్ధ్యం, పేషెంట్‌ కేర్‌ విధులు నిర్వహించాల్సిన సిబ్బందిని కార్యాలయంలో ఇతర పనులు చేయించుకోవటం పట్ల పారిశుద్ధ్యం సమస్య ఏర్పడుతోందని కొందరు పారిశుద్ధ్య కార్మికులు ఫిర్యాదు చేశారు. డైరెక్టర్‌ కార్యాలయంలో ప్రత్యేకంగా వారితో సమావేశమై పలు సూచనలు చేసినట్లు సమాచారం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని