logo

‘కారు’ దిగి.. చేయందుకొని..!

విపక్ష భారాసకు ఉమ్మడి జిల్లాలో మరో షాక్‌ తగిలింది. పార్టీ సీనియర్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి సముద్రాల వేణుగోపాలాచారి ఆ పార్టీని వీడారు.

Published : 17 Apr 2024 06:25 IST

భారాసను వీడిన వేణుగోపాలాచారి

నిర్మల్‌ పట్టణం, న్యూస్‌టుడే: విపక్ష భారాసకు ఉమ్మడి జిల్లాలో మరో షాక్‌ తగిలింది. పార్టీ సీనియర్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి సముద్రాల వేణుగోపాలాచారి ఆ పార్టీని వీడారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సమక్షంలో మంగళవారం కారు దిగి కాంగ్రెస్‌ చేయందుకున్నారు. ఆయన వెంట ఖానాపూర్‌ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్‌, జీవన్‌రెడ్డి ఉన్నారు. నిర్మల్‌ పట్టణానికి చెందిన వేణుగోపాలచారి 1983లో తెదేపాలో చేరారు. ఆ తర్వాత పార్టీ ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా కన్వీనర్‌గా పనిచేశారు. ఈ క్రమంలో ఆయన వరుసగా మూడుసార్లు నిర్మల్‌ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొంది హ్యాట్రిక్‌ విజయం నమోదుచేశారు. ఎంపీగానూ ఆయన హ్యాట్రిక్‌ విజేతగా నిలవడం విశేషం. ఆ తర్వాత కేంద్ర మంత్రిగా పనిచేశారు. 2009లో అనూహ్యంగా ముథోల్‌ నుంచి పోటీచేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. తదనంతరం తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం జరగడంతో పార్టీని వీడి భారాస (అప్పటి తెరాస)లో చేరారు. తెలంగాణ ప్రభుత్వంలో దిల్లీ అధికార ప్రతినిధిగా బాధ్యతలు నిర్వహించారు. నీటి పారుదల అభివృద్ధి సంస్థ రాష్ట్ర ఛైర్మన్‌గానూ కొనసాగారు. గత ఎన్నికల్లో భారాస అధికారానికి దూరం కావడంతో పార్టీలోని సీనియర్‌ నాయకులు ఒక్కొక్కరుగా పార్టీని వీడటం మొదలుపెట్టారు. ఈ క్రమంలో సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న వేణుగోపాలచారి సైతం కొంతకాలంగా స్తబ్దుగా మారిపోయారు. తాజాగా ఊహించనిరీతిలో కాంగ్రెస్‌ కండువా కప్పుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని