logo

కూలీల చేతుల్లో పల్లెల అభివృద్ధి

జాతీయ ఉపాధిహామీ పథకంలో ఎప్పటికప్పుడు మార్పులను తీసుకు వస్తున్నారు.  కష్టపడి పనిచేసే కూలీలకే ఇక నుంచి ప్రాధాన్యం ఇవ్వనున్నారు.

Published : 17 Apr 2024 06:29 IST

పొక్కూరులో ఉపాధిహామీ నిధులతో నిర్మించిన సీసీరోడ్డు
చెన్నూరు గ్రామీణం, న్యూస్‌టుడే: జాతీయ ఉపాధిహామీ పథకంలో ఎప్పటికప్పుడు మార్పులను తీసుకు వస్తున్నారు.  కష్టపడి పనిచేసే కూలీలకే ఇక నుంచి ప్రాధాన్యం ఇవ్వనున్నారు. నామమాత్రంగా పనులు చేసి హాజరు వేయించుకుందామనుకుంటే ఇక కుదరదు. ప్రభుత్వం దినసరి కూలి పెంచడంతో మొత్తం కూలీ దక్కించుకునేలా అధికారులు కూలీలకు ప్రోత్సహిస్తున్నారు. జిల్లావ్యాప్తంగా అధికారులు క్రియాశీలక కూలీల జాబితాను ఇదివరకే సిద్ధం చేసుకున్నారు. కొంతకాలంగా అసలే పనులకు హాజరుకాని కూలీల జాబ్‌కార్డులను గతంలో రద్దు చేశారు. జాబ్‌కార్డుల్లో యాక్టివ్‌, ఇన్‌యాక్టివ్‌ కూలీల జాబితాలను వేర్వేరుగా తయారు చేశారు. ఇన్‌యాక్టివ్‌ కూలీలను యాక్టివ్‌ జాబితాలో చేర్చేలా చర్యలు తీసుకుంటున్నారు.

 ఉపాధిహామీ పథకంలో కూలీల చెల్లింపులు, మెటీరియల్‌ కాంపోనెంట్‌ నిధులను 60-40 ప్రకారం కేటాయిస్తారు. కూలీలకు చెల్లించే నిధుల ఆధారంగా మెటీరియల్‌ కాంపోనెంట్‌ నిధులు కేంద్రం నుంచి మంజూరవుతాయి. వాటితోనే పల్లెల్లో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. పంచాయతీ భవనాలు, సీసీరోడ్లు, మురుగుకాల్వల నిర్మాణాలకు ఉపాధిహామీ పథకం ద్వారానే నిధులు మంజూరవుతున్నాయి. కూలీలకు ఎంత ఎక్కువ చెల్లింపులు జరిగితే అంతే ఎక్కువ మొత్తంలో మెటీరియల్‌ కాంపోనెంట్‌ నిధులు విడుదలవుతాయి. ఉదాహరణకు ఒక కూలీ ఒక రోజు ఉపాధిహామీ పని చేసి రూ.100 సంపాదిస్తే అతడికి రావాల్సిన మిగతా రూ.200 రద్దవుతాయి. ఫలితంగా దీనికి సంబంధించిన 40 శాతం మెటీరియల్‌ కాంపోనెంట్‌ నిధులు కూడా మంజూరు కావు. ఇందుకోసమే అధికారులు క్రియాశీల కూలీల సంఖ్యను పెంచేందుకు కసరత్తు చేస్తున్నారు. కూలీలందరూ పనులకు వచ్చేలా, దినసరి కూలీ దక్కించుకునేలా చర్యలు చేపడుతున్నారు. 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఉపాధి కూలీలకు చేపట్టిన చెల్లింపులు ఆధారంగా జిల్లాకు మెటీరియల్‌ కాంపోనెంట్‌ కింద సుమారు రూ.31.79 కోట్లు మంజూరయ్యాయి. వీటిని జిల్లాలోని 16 మండలాలకు కేటాయించి పంచాయతీ భవనాలు, సీసీరహదారులను నిర్మించారు.

 సంఖ్య పెరిగే అవకాశం..

జిల్లావ్యాప్తంగా ఉన్న కార్డుల్లో గతేడాది 1,827లకుపైగా జాబ్‌కార్డులను రద్దు చేశారు. 6,950 కూలీలను కూడా జాబితా నుంచి తొలగించారు. కూలీలకు చెల్లింపులు సక్రమంగా అందేలా బ్యాంకు ఖాతాలు, ఆధార్‌ వివరాలను సేకరించి నమోదు చేశారు. యాసంగి సీజన్‌ పంటల సాగు తుదిదశకు చేరుకుంది. దీంతో కూలీల సంఖ్య పెరిగే అవకాశాలు ఉన్నాయి. ప్రతి పంచాయతీ నుంచి ఎక్కువగా కూలీలకు పనులకు వచ్చేలా క్షేత్రస్థాయిలో ఉపాధిహామీ సిబ్బంది కృషి చేస్తున్నారు. ఉదయం వేళల్లో కూలీలు పనులకు వచ్చేలా సిబ్బంది చర్యలు చేపడుతున్నారు.


కూలీల గిట్టుబాటు ధర కల్పించేలా చర్యలు
కిషన్‌, డీఆర్డీవో, మంచిర్యాల

జిల్లాలోని అన్ని మండలాల్లో గ్రామాల వారీగా కూలీల సంఖ్యను పెంచేలా చర్యలు  సిబ్బంది క్షేత్రస్థాయిలో చర్యలు తీసుకుంటున్నారు. వ్యవసాయ పనులు ముగింపు దశకు చేరడంతో ఉపాధి పనులకు వచ్చే కూలీల సంఖ్య పెరిగే అవకాశాలు ఉన్నాయి. పనులకు వచ్చే కూలీలకు గిట్టుబాటు కూలి వచ్చేలా కృషి చేస్తున్నాం. దీనిపై వారికి అవగాహన కల్పిస్తున్నాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని