logo

ఆరోగ్య శాఖ.. అక్రమాల బాట

టీఎస్‌ఎంసీ(తెలంగాణ రాష్ట్ర మెడికల్‌ కౌన్సిల్‌) నూతన కమిటీ చేపడుతున్న చర్యలు, బయటపడుతున్న నిజాలు, నమోదవుతున్న కేసులతో జిల్లా వైద్యారోగ్యశాఖపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

Updated : 17 Apr 2024 06:44 IST

అడ్డగోలుగా ఆసుపత్రులకు అనుమతి

 మంచిర్యాల సిటీ, న్యూస్‌టుడే: టీఎస్‌ఎంసీ(తెలంగాణ రాష్ట్ర మెడికల్‌ కౌన్సిల్‌) నూతన కమిటీ చేపడుతున్న చర్యలు, బయటపడుతున్న నిజాలు, నమోదవుతున్న కేసులతో జిల్లా వైద్యారోగ్యశాఖపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పదులకొద్దీ ఆసుపత్రులు నిబంధనలు పాటించకుండా కొనసాగుతున్నాయి. వీటికి అనుమతులు ఎలా వచ్చాయనే సందేహాలు వస్తున్నాయి. వైద్యులు లేకుండా ఆసుపత్రి నిర్వహించడం.. ఆర్‌ఎంపీలు, అంబులెన్స్‌ల ఆగడాలు బయట పడుతుండటం చూస్తే ఆరోగ్యశాఖ పనితీరుపై విమర్శలు వ్యక్తమవుతోంది.  ఆరోగ్య శాఖ అక్రమాల బాట పట్టి ఇష్టారీతిన అనుమతులు ఇవ్వడంతోనే జిల్లాలో వైద్యవ్యవస్థ తీరు దిగజారుతోందనే ఆరోపణలు ఉన్నాయి. ప్రైవేటు ఆసుపత్రులు దోచుకుంటుండటంతో పేద, మధ్యతరగతి కుటుంబాలు ఆర్థికంగా చితికిపోతున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

 ప్రైవేటు ఆసుపత్రుల్లో శస్త్రచికిత్సలు భారీగా పెరుగుతున్నాయనే ఆరోపణల నేపథ్యంలో తనిఖీల కోసం నెల రోజుల కిందట జిల్లా వైద్యారోగ్యశాఖ నాలుగు ప్రత్యేక బృందాలు అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇందులో వైద్యులకన్నా మిగతా సిబ్బంది ఎక్కువగా ఉన్నారు. అయినా ఉన్నవారైనా తనిఖీచేశారా అంటే అదీ లేదు. జిల్లా అధికారి పత్రాలకు పరిమితం చేసి పక్కన పెట్టేశారు.
నెల, రెండునెలలకు ఒకసారి ప్రైవేటు ప్రసూతి వైద్యులతో జిల్లా కార్యాలయంలో సమావేశాలు నిర్వహిస్తున్నారు. శస్త్రచికిత్సలు తగ్గించాలని ఆదేశాలిస్తున్నారు. కానీ ఏ ఆసుపత్రిలో సంఖ్య తగ్గలేదు. ఆరోగ్యశాఖలోని ఓ కీలక అధికారికి చెందిన ఆసుపత్రిలోనే నిత్యం ఒకటి, రెండు శస్త్రచికిత్సలు జరుగుతాయనే ఆరోపణలు ఉన్నాయి. ఇక మిగతా వాటి సంగతి చెప్పాల్సిన అవసరమే లేదు.
ఆరోగ్యశాఖ అనుమతి ఇస్తే గానీ ఏ ప్రైవేటు ఆసుపత్రి ఏర్పాటు చేయడం కుదరదు. అవసరమైన వసతులు, వైద్యులు అందుబాటులో ఉంటేనే ధ్రువీకరణపత్రాలు అందించాలి. కానీ జిల్లాలో పుట్టగొడుగుల్లా వెలుస్తున్న ఆసుపత్రుల్లో కనీస సదుపాయాలు కరవయ్యాయి. ఉన్న వాటిలో 80శాతానికి పైగా ఇదే పరిస్థితి నెలకొంది. ఇటీవల టీఎస్‌ఎంసీ నిర్వహిస్తున్న తనిఖీల్లో ఇవే వెలుగుచ్తూన్నాయి. ఇలాంటి ఆసుపత్రులకు అనుమతి ఎలా లభించింది అనేది ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారింది. ఆరోగ్యశాఖ అక్రమాల బాట పట్టడంతోనే అనుమతి ఈ పరిస్థితి ఏర్పడిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
జిల్లా ఆరోగ్యశాఖలో పనిచేస్తున్న ఓ వ్యక్తి.. తన విధులు పక్కనపెట్టి.. ఇతర వ్యవహారాల్లో ఎక్కువగా కనిపిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. ప్రైవేటు ఆసుపత్రుల నుంచి వసూలు చేయడం, కొంత ఉన్నతాధికారులకు, మరికొంత తన జేబులో వేసుకుంటున్నారని ఆ శాఖలోనే చర్చలు తీవ్రమయ్యాయి. జిల్లా కేంద్రంలోని ప్రతి ప్రైవేటు ఆసుపత్రి నిర్వాహకులపై పెత్తనం చెలాయిస్తుంటారని, అనుకూలంగా వ్యవహరించకపోతే బెదిరింపులకు గురిచేస్తారనే ఆరోపణలు వస్తున్నాయి.
ప్రైవేటు ఆసుపత్రుల్లో ఏవైనా ఘటనలు జరిగినప్పుడు.. వెంటనే సంబంధిత నిర్వాహకులతో సమావేశాలు నిర్వహిస్తారు. హెచ్చరికలు జారీ చేస్తున్నట్లు హడావుడి చేస్తుంటారు. ఇటీవల జరుగుతున్న పరిణామాలతో ఆరోగ్యశాఖ అప్రమత్తమై రెండు, మూడురోజులుగా సమావేశాలు ఏర్పాటు చేస్తోంది. నిబంధనలు పాటించాలని, నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవంటూ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. కానీ ఈ సమావేశాల ఉద్దేశం మరోలా ఉందంటూ ప్రచారం జరుగుతోంది. వసూళ్ల పర్వానికి తెరలేపడానికే ఈ తతంగమని ఆరోగ్యశాఖలోనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ శాఖలో కీలక వ్యక్తుల పదవీ విరమణలు మొదలయ్యాయి. దీంతో అందినకాడికి దండుకునేందుకు సిద్ధమయ్యారని ఆరోపణలు వినవస్తున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని