logo

బాధలు చెప్పుకొనేదెలా?

జిల్లాలో 2015లో ప్రత్యేక మహిళా పోలీస్‌స్టేషన్‌ను ప్రారంభించారు. నిత్యం పదుల సంఖ్యలో ఫిర్యాదులు వస్తున్న ఈ స్టేషన్‌లో ప్రస్తుతం అధికారులెవరూ లేరు.

Published : 18 Apr 2024 04:04 IST

మంచిర్యాల మహిళా ఠాణాకు అధికారి కరవు..

మంచిర్యాలనేరవిభాగం, న్యూస్‌టుడే: జిల్లాలో 2015లో ప్రత్యేక మహిళా పోలీస్‌స్టేషన్‌ను ప్రారంభించారు. నిత్యం పదుల సంఖ్యలో ఫిర్యాదులు వస్తున్న ఈ స్టేషన్‌లో ప్రస్తుతం అధికారులెవరూ లేరు. ఫిబ్రవరి 29న ఇక్కడ సీఐగా విధులు నిర్వర్తిస్తున్న ప్రవీణ్‌కుమార్‌ వేరే ప్రాంతానికి బదిలీ అయ్యారు. తర్వాత ఎస్సై స్థాయి అధికారి విజయ్‌ సైతం గతనెల 9న బదిలీ అయ్యారు. వీరి స్థానంలో ఇప్పటికీ సీఐ, ఎస్సై స్థాయి అధికారులెవరూ నియామకం కాలేదు. ఏఎస్సై స్థాయి అధికారి ఇన్‌ఛార్జిగా ఉండడంతో ఫిర్యాదులు పరిష్కారం కావడం లేదు. కేసుల నిర్ణయాధికారం తమ చేతుల్లో లేకపోవడంతో సిబ్బంది ఫిర్యాదులు తీసుకోవడానికే పరిమితం అవుతున్నారు.

పురుషులదే పెత్తనం..

సమాజంలో రోజురోజుకూ మహిళలకు రక్షణ కరవవుతోంది. తమకు జరిగిన అన్యాయాన్ని పోలీసు స్టేషన్‌కు వెళ్లి చెప్పుకోవాలని అనుకునే వారు చాలా అరుదు. అక్కడి దాకా వెళ్లినా మహిళా సిబ్బంది లేకపోవడం.. ఉన్నవారు పురుషులే కావటం వారి ముందు తమ బాధలు చెప్పుకోలేకపోతున్నారు. తమ సమస్య పరిష్కారం అవుతుందని నమ్మి వెళ్లిన మహిళలను అధికారులే వేధింపులకు గురిచేసిన ఘటనలు లేకపోలేదు. మహిళా పోలీస్‌స్టేషన్‌లో ఇప్పటి వరకు పదిమంది అధికారులు పురుషులు విధులు చేపట్టగా ఇద్దరు ఏఎస్సై స్థాయి మహిళా అధికారులు ఎస్‌హెచ్‌వోగా బాధ్యతలు చేపట్టారు. ఎస్సై స్థాయి మహిళా అధికారులను నియమిస్తే మహిళలు నిర్భయంగా తమ సమస్యలను చెప్పుకునే వీలు ఉంటుంది. ఉన్నతస్థాయి అధికారులు మహిళలకు సంబంధించిన పోలీస్‌స్టేషన్‌లో మహిళా సిబ్బంది అధికంగా ఉండేలా చూడాలని పలువురు అభిప్రాయపడుతున్నారు.

సిబ్బంది ఇలా..

మహిళా ఠాణాలో మొత్తం 30 మంది విధులు నిర్వర్తించాల్సి ఉండగా ప్రస్తుతం 20 మందితో సరిపెడుతున్నారు. ఒక ఎస్సై, మరో ఏఎస్సై మహిళలు ఇక్కడ పోస్టింగ్‌ఉన్నా ఇతర ప్రాంతాల్లో అటాచ్డ్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. కేవలం నలుగురు మహిళా కానిస్టేబుళ్లు స్టేషన్‌లో అందుబాటులో ఉన్నారు. సీఐ పోస్టుతోపాటు ఇద్దరు ఎస్సై పోస్టులు కూడా ఖాళీగానే ఉన్నాయి. మూడు ఏఎస్సై పోస్టులు ఉండగా ఇద్దరు(పురుషులు), హెడ్‌కానిస్టేబుళ్లు ఆరుగురు, కానిస్టేబుళ్లు అయిదుగురు పురుషులే ఉన్నారు.

నియామకంలో నిర్లక్ష్యం..

సామాన్యంగా పోలీస్‌ష్టేషన్‌లలో ఓ అధికారి బదిలీ అయితే మరుసటి రెండు మూడు రోజుల్లోనే మరో అధికారిని నియమిస్తారు.  మహిళల సంరక్షణకు  ప్రత్యేక చర్యలు తీసుకుంటామని చెబుతున్న అధికారులు చేతల్లో మాత్రం వారిపట్ల తీవ్ర నిర్లక్ష్యం చూపుతున్నారు. అధికారులు లేక యభైరోజులు చేరువవుతున్నా..కొత్తవారు ఎవరు రాకపోవడంతో ఆ శాఖ తీరుపై ఫిర్యాదుదారులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.


ఉన్నతాధికారులకు నివేదించాం
శ్రీనివాస్‌, రామగుండం పోలీసు కమిషనర్‌

మంచిర్యాల మహిళా పోలీస్‌స్టేషన్‌కు అధికారులను నియమించాలని ఇప్పటికే ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపించాం. త్వరలోనే నియామకం ఉంటుంది. ఫిర్యాదుదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూస్తాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని