logo

ఎన్నికల హడావుడి.. ఇసుక దోపిడీ

రెవెన్యూ, పోలీసు అధికారులు పార్లమెంట్‌ ఎన్నికల హడావుడిలో ఉండగా.. ఇదే అదునుగా జిల్లాలోని ఇసుక మాఫియా చెలరేగిపోతుంది. జిల్లాలో ప్రవహిస్తున్న పెద్దవాగు ఇసుక స్మగ్లర్లకు సిరులు కురిపిస్తుంది.

Published : 20 Apr 2024 02:37 IST

గజ్జిగూడ వాగు వద్ద ట్రాక్టరులో ఇసుక నింపుతున్న కూలీ

కాగజ్‌నగర్‌గ్రామీణం, న్యూస్‌టుడే: రెవెన్యూ, పోలీసు అధికారులు పార్లమెంట్‌ ఎన్నికల హడావుడిలో ఉండగా.. ఇదే అదునుగా జిల్లాలోని ఇసుక మాఫియా చెలరేగిపోతుంది. జిల్లాలో ప్రవహిస్తున్న పెద్దవాగు ఇసుక స్మగ్లర్లకు సిరులు కురిపిస్తుంది. ఆసిఫాబాద్‌, కాగజ్‌నగర్‌ మండలంలోని అందవెల్లి, భట్టుపల్లి, బారెగూడ పెద్దవాగు నుంచి ఇసుక విచ్చలవిడిగా రవాణా అవుతోంది. స్థానిక కాగజ్‌నగర్‌, ఆసిఫాబాద్‌ పట్టణాల్లో నిర్మిస్తున్న భవనాలకు అనుమతులు లేకుండా ఇసుక తరలించుకుని దళారులు సొమ్ము చేసుకుంటున్నారు.

బారెగూడ పెద్దవాగులో రాత్రివేళల్లో పొక్లెయిన్లతో తవ్వకాలు చేపట్టి వాగుకు సమీపంలోని రహస్య ప్రదేశాల్లో పెద్ద మొత్తంలో నిల్వ చేసుకుంటున్నారు. 50నుంచి 60ట్రాక్టర్ల ఇసుకను నిల్వచేసి కాగజ్‌నగర్‌కు చెందిన పలువురు అక్రమార్కులు రాత్రివేళ లారీల్లో ఇసుకను హైదరాబాదుకు తరలిస్తున్నట్లు సమాచారం.

భాగ్యనగర్‌లో ఒక్క లారీ ఇసుక ధర రూ.70 వేల నుంచి 80 వేలకు విక్రయించుకుని సొమ్ము చేసుకుంటున్నారు. ఫిర్యాదు చేస్తే తప్ప ఇసుక అక్రమ రవాణాపై రెవెన్యూ, పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదనేదీ బహిరంగ రహస్యమే. ఇసుక అక్రమ రవాణాలో స్థానిక నాయకుల అండదండలు ఉండటంతో అధికారులు సైతం వీరిని పట్టుకునేందుకు సాహసించడం లేదు. కొందరు ఇసుక ట్రాక్టర్ల యజమానులు అభివృద్ధి పనులపేరిట రెవెన్యూ అధికారుల నుంచి అనుమతులు పొంది ప్రైవేట్‌లో విక్రయించుకుంటున్నారు. అనుమతులు పొందిన ఇసుక ట్రాక్టర్ల యజమానులు వాస్తవంగా అభివృద్ధి పనులకు ఇసుకను తరలిస్తున్నారా? ఇది ప్రైవేటుకు వెళ్తుందా అనే విషయంలో రెవెన్యూ అధికారులు ఏ ఒక్కనాడు తనిఖీలు నిర్వహించిన దాఖలాలు లేవు.

కాగజ్‌నగర్‌ మండలంలో 10 వరకు సిమెంట్‌ ఇటుకల తయారీ కేంద్రాలున్నాయి. అందవెల్లి సమీప పెద్దవాగు, రాస్పెల్లి, సార్సాల, గజ్టిగూడ వాగుల నుంచి ఇటుకల తయారీ కేంద్రాలకు ఇసుక రవాణా అవుతుంది. ఈ కేంద్రాల నిర్వాహకులు నయా పైసా రాయల్టీ కట్టిన దాఖలాలు లేవు.

ధ్వంసం అవుతున్న రోడ్లు..

అందవెల్లి, భట్టుపల్లి సమీపంలో పెద్దవాగు ఇసుకను కాగజ్‌నగర్‌ పట్టణానికి తరలించాలంటే రైల్వేగేటు కాలనీ, కాపువాడ మీదుగా వెళ్లాలి. తరచూ ఎక్కువ లోడ్‌తో ఉన్న వాహనాలు వెళ్తుండటంతో రోడ్లు అధ్వానంగా మారుతున్నాయని స్థానికులు ఇటీవల ఇసుక ట్రాక్టర్లను సైతం అడ్డుకున్నారు. ఇసుక అక్రమ రవాణాపై ‘న్యూస్‌టుడే’ తహసీల్దార్‌ కిరణ్‌కుమార్‌ను సంప్రదించగా తనిఖీలు నిర్వహించి తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని