logo

రక్షణ తీగలే.. యమపాశాలు

రేయింబవళ్లు కష్టపడి సాగుచేసిన పంటలు చేతికొచ్చే సమయంలో అడవి జంతువుల కారణంగా చేజారుతున్నాయి.

Published : 24 Apr 2024 07:24 IST

 ప్రత్యామ్నాయమే మేలు..

నెన్నెల మండలంలోని మైలారం గ్రామానికి చెందిన సాండ్ర ప్రకాశ్‌ అనే కూలీ బొప్పారం గ్రామసమీపంలో మామిడితోటలో పనిచేస్తున్నాడు. వన్యప్రాణుల నుంచి పంటను కాపాడేందుకు అమర్చిన విద్యుత్తు తీగలను తొలగిస్తున్న క్రమంలో ఈనెల 20న విద్యుదాఘాతానికి గురై మృతిచెందాడు.


చెన్నూరు గ్రామీణం, న్యూస్‌టుడే: రేయింబవళ్లు కష్టపడి సాగుచేసిన పంటలు చేతికొచ్చే సమయంలో అడవి జంతువుల కారణంగా చేజారుతున్నాయి. పంటలను అడవి జంతువుల బారినుంచి రక్షించుకునేందుకు కొందరు రైతులు నిబంధనలకు విరుద్ధంగా చేన్లు, తోటల్లో విద్యుత్తు తీగలు ఏర్పాటు చేస్తూ.. తోటిరైతులు, కూలీల ప్రాణాలను హరిస్తున్నారు. చేన్లలో తీగలు అమర్చిన విషయం తెలియక అటువైపు వెళ్తూ ఎందరో రైతులు ప్రాణాలు కోల్పోయిన ఘటనలు ఎన్నో ఉన్నాయి. తాజాగా నెన్నెల మండలంలోని బొప్పారం గ్రామ సమీపంలోని మామిడి తోటలో విద్యుత్తు తీగలను కారణంగా విద్యుదాఘాతానికి గురై మృతి చెందాడు. పంటల రక్షణకు ఉన్న ప్రత్యామ్నాయ మార్గాలపై కథనం.


సౌర కంచె ఏర్పాటుతో రక్షణ..

సౌర కంచె ఏర్పాటుతో అడవి పందుల బారి నుంచి పంటలు రక్షించుకోవచ్చు. కొద్దిపాటి ఖర్చుతో పొలం చుట్టూ ఏర్పాటు చేసుకోవచ్చు. సౌర కంచెను తాకినపుడు అడవిపందులు కొద్దిపాటి విద్యుత్తు షాక్‌కు గురికావడంతో అవీ పొలాల్లోకి వచ్చే సాహసం చేయవు.  ప్రస్తుతంలో చెన్నూరు మండలంలోని సోమన్‌పల్లి, అంగ్రాజ్‌పల్లిలతో పాటు జిల్లాలోని పలు ప్రాంతాల్లో రైతులు వీటిని ఏర్పాటు చేసుకుంటున్నారు. ఇందుకోసం బ్యాటరీ, తీగ అవసరముంటుంది. ఎకరం పొలం చుట్టూ సోలార్‌ కంచె(తీగ) ఏర్పాటుకు సుమారు రూ.8వేల వరకు ఖర్చు అయ్యే అవకాశం ఉంది.


పొలం చుట్టూ చీరలు..

అడవి పందులు పంటచేన్లు, పొలాల్లోకి రాకుండా చీరలను దడిలాగా ఏర్పాటు చేసుకోవాలి. పొలంలో అక్కడక్కడ 10 అడుగుల ఎత్తున కర్రలు ఏర్పాటు చేసుకొని వాడిన మద్యం సీసాల్లో గోలీలు ఉంచి సీసాలు కదిలేలా ఏర్పాటు చేసి శబ్ధాలు చేయాలి. మనిషి ఆకారంలో బెదురులను(బొమ్మలు) ఏర్పాటు చేసుకొని అడవిపందుల బారి నుంచి పంటలను రక్షించుకోవచ్చు.


వాసనవచ్చే రసాయనాలు

 

పొలం చుట్టు రెండు అడుగుల ఎత్తులో 10 అడుగుల దూరంలో కొయ్యలు నాటి దానికి ఎకోడాన్‌ అనే రసాయనం రుద్దిన సుతిలి తాడు మూడు వరుసల్లో పొలం చుట్టూచూడితే అడవిపందుల బారి నుంచి పంటలను కాపాడుకోవచ్చు. 15 రోజుల వరకు లోనికి రావు. పొలంలోకి వచ్చేచోట తల వెంట్రుకలను వేయడం ద్వారా మట్టి వాసన చూస్తూ లోపలికి వచ్చేటపుడు ముక్కులోకి వెంట్రుకలు చొచ్చి బాధించడం ద్వారా పొలాల దగ్గరకు రావు.


చెన్నూరు మండలం లక్ష్మీపూర్‌ గ్రామ సమీపంలో తుమ్మల బుచ్చిరెడ్డి అనేవ్యక్తి రెండెకరాల్లో వరి సాగు చేస్తున్నారు. అడవి పందుల బెడద ఎక్కువగా ఉండటంతో రూ.18 వేలు వెచ్చించి చుట్టూ సౌర తీగ ఏర్పాటు చేశారు. ఈ ప్రాంతంలో మరో నలుగురు రైతులు కూడా సౌర కంచె ఏర్పాటు చేశారు.


తక్కువ ఖర్చుతో ఏర్పాటు చేసుకోవచ్చు

రాజేశం, ఇన్‌ఛార్జి ఏడీఎ చెన్నూరు

అడవి పందుల బారినుంచి పంటల కాపాడుకునేందుకు విద్యుత్తు తీగలు ఏర్పాటు చేయడం ద్వారా జంతువులతోపాటు మనుషుల ప్రాణాలకు ముప్పు వాటిల్లుతోంది. పంటల రక్షణకు ఉన్న ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకోవాలి. తక్కువ ఖర్చుతో కూడుకున్న సౌర తీగను పంట చేన్లు, పొలాల చుట్టూ రక్షణగా అమర్చుకోవాలి.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు