logo

చంద్రబాబుపై పూర్తి విశ్వాసం: దొన్నుదొర

తెదేపా- భాజపా- జనసేన కూటమి అభ్యర్థిగా అరకులోయ అసెంబ్లీ నియోజకవర్గంలో తాను పోటీచేసి విజయం సాధిస్తానని తెదేపా నియోజకవర్గ ఇన్‌ఛార్జి సియ్యారి దొన్నుదొర అన్నారు

Published : 29 Mar 2024 02:45 IST

మాట్లాడుతున్న దొన్నుదొర తదితరులు
అరకులోయ, న్యూస్‌టుడే: తెదేపా- భాజపా- జనసేన కూటమి అభ్యర్థిగా అరకులోయ అసెంబ్లీ నియోజకవర్గంలో తాను పోటీచేసి విజయం సాధిస్తానని తెదేపా నియోజకవర్గ ఇన్‌ఛార్జి సియ్యారి దొన్నుదొర అన్నారు. గురువారం అరకులోయలో ఆరు మండలాల నాయకులు, కార్యకర్తలతో సమావేశమయ్యారు. అనంతరం స్థానిక విలేకరులతో ఆయన మాట్లాడారు. అరకులోయ అసెంబ్లీ అభ్యర్థిగా పాంగి రాజారావును భాజపా అధిష్ఠానం ఏకపక్షంగా ప్రకటించిందన్నారు. ఈ నిర్ణయంపై తెదేపా రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు, ఉత్తరాంధ్ర పార్టీ పరిశీలకులు దామెచర్ల సత్యతో తాను మాట్లాడానని చెప్పారు. తెదేపా అభ్యర్థికే టికెట్‌ కేటాయించేలా చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారన్నారు. తమ ప్రమేయం లేకుండా భాజపా ఏకపక్షంగా అభ్యర్థుల జాబితా ప్రకటించిందని తెలిపారు. అరకులో జరిగిన రా కదలిరా బహిరంగ సభలో వేలాది మంది ప్రజల సమక్షంలో తనను అభ్యర్థిగా అధినేత చంద్రబాబునాయుడు ప్రకటించారని తెలిపారు. అభ్యర్థుల చేర్పులు, మార్పులు జరిగితే అధిష్ఠానం తనను సంప్రదించి ఉండేదన్నారు. ఇప్పటి వరకు అధినేత చంద్రబాబునాయుడు, యువ నాయకులు నారా లోకేశ్‌ నుంచి సైతం తనకు ఎటువంటి కబురు రాలేదని పేర్కొన్నారు. భాజపాకు అరకు అసెంబ్లీ పరిధిలో బలమే లేదని చెప్పారు. తెదేపా మద్దతు ఇచ్చినా.. భాజపా ఇక్కడ గెలిచే పరిస్థితి లేదన్నారు. ప్రస్తుత పరిస్థితిలో ప్రతి సీటూ తెదేపాకు కీలకమని చెప్పారు. ఇటువంటి పరిస్థితుల్లో గెలిచే అవకాశాలున్న సీటును వదులుకునేందుకు చంద్రబాబునాయుడు ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించరన్నారు. ఆయనపై తనకు పూర్తి విశ్వాసం ఉందన్నారు. నాయకులు నిర్మల, నీరజ, తులసీరావు, బుజ్జిబాబు, బలరాం తదితరులు పాల్గొన్నారు.

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని