logo

సామాన్యులకు సైబర్‌ పాఠాలు

తూర్పు గోదావరి జిల్లా కిర్లంపూడికి చెందిన శ్రీనివాస్‌.. 2009 బ్యాచ్‌ ఎస్‌.ఐ.గా పోలీసు శాఖలో చేరారు. గతంలో మూడేళ్ల పాటు విజయవాడ నగర సైబర్‌ క్రైమ్‌ విభాగంలో పనిచేశారు.

Published : 06 Aug 2022 05:06 IST

యూట్యూబర్‌గా మారిన ఎస్సై శ్రీనివాస్‌

విధులు నిర్వహిస్తూనే వీడియోలు అప్‌లోడ్‌

పోలీసు ఉద్యోగం చేస్తూ అందరిలా దానికే పరిమితం కాలేదు.. అంతకుమించి ఆలోచించారు ఎస్‌.ఐ శ్రీనివాస్‌. కమిషనరేట్‌లోని ఐటీ సెల్‌లో పనిచేస్తున్న ఆయన.. అటు విధి నిర్వహణలో ఊపిరిసలపకుండా ఉంటూనే సామాజిక మాధ్యమాల్లో సైబర్‌ నేరాలపై అవగాహన కల్పనకు కృషి చేస్తున్నారు. దీని కోసం యూట్యూబర్‌ అవతారమెత్తారు. ఆన్‌లైన్‌ మోసగాళ్ల బారిన పడకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తన ఛానల్‌ ద్వారా వివరిస్తున్నారు. అత్యవసర సమయాల్లో ఎలా బయటపడాలో చెబుతూ అందరితో శభాష్‌ అనిపించుకుంటున్నారు.

ఈనాడు - అమరావతి

తూర్పు గోదావరి జిల్లా కిర్లంపూడికి చెందిన శ్రీనివాస్‌.. 2009 బ్యాచ్‌ ఎస్‌.ఐ.గా పోలీసు శాఖలో చేరారు. గతంలో మూడేళ్ల పాటు విజయవాడ నగర సైబర్‌ క్రైమ్‌ విభాగంలో పనిచేశారు. ఆ సమయంలో ఎందరో అమాయకులు ఈ తరహా మోసాలకు గురవుతుండటం చూశారు. సాంకేతిక పరిజ్ఞానం విస్తరించే కొద్దీ అంతకంటే వేగంగా సైబర్‌ నేరాలు పెరుగుతున్న తీరు ఆయనను ఆందోళనకు గురిచేసింది. తర్వాత వేరే స్టేషన్‌కు బదిలీ అయినా మోసపోయిన వారు పెద్ద సంఖ్యలో తనకు ఫోన్‌ చేసి సలహాలు అడుగుతుండేవారు. ఈ మథనంలో నుంచి పుట్టిందే యూ ట్యూబ్‌ ఛానల్‌ ద్వారా అవగాహన కల్పించడం. తనకున్న అనుభవంతో ప్రజలను అప్రమత్తం చేస్తే కొంతమందికైనా మేలు జరుగుతుందని భావించారు. అందుకు యూట్యూబ్‌ను వేదికగా ఎంచుకున్నారు. తన బ్యాచ్‌మేట్‌ స్ఫూర్తితో గత ఏడాది మే నెలలో ‘సైబర్‌ అవేర్‌నెస్‌’ అనే పేరుతో యూట్యూబ్‌ ఛానెల్‌ ప్రారంభించారు. ఇప్పటి వరకు దాదాపు 35 వీడియోలు రూపొందించారు.

అందరికీ అర్థమయ్యేలా..
ఆధార్‌ కార్డు, కేవైసీ అప్‌డేట్‌, ఓటీపీ, ఓఎల్‌ఎక్స్‌ పేర్లతోనే నేరగాళ్లు వల వేస్తుంటారు. వాటినే అంశాలుగా ఎంచుకుని వీడియోలు చేసి అప్‌లోడ్‌ చేసేవారు. వాటికి మంచి ఆదరణ వస్తుండడంతో మరిన్ని వీడియోలు చేయడం మొదలుపెట్టారు. వీటినే ట్విటర్‌, ఇన్‌స్టాగ్రామ్‌, ఫేస్‌బుక్‌లోనూ షేర్‌ చేసేవారు. ఇప్పటి వరకు 20వేల మందికి పైగా వీటిని వీక్షించారు. సెల్‌ ఫోన్‌ పోతే వెంటనే ఎలా స్పందించాలి? అనే అంశంతో చేసిన వీడియోకు మంచి స్పందన వచ్చింది. దీనిని ఎక్కువ మంది చూశారు. ఆన్‌లైన్‌ మోసానికి గురైతే ఎలా ఫిర్యాదు చేయాలి? దొంగిలించిన ఫోన్‌ను తిరిగి ఎలా కనిపెట్టాలి?అనే వీడియోలను 5 వేల వీక్షణలకు పైగా వచ్చాయి. నకిలీ వెబ్‌సైట్లను గుర్తించడం, పెట్టుబడుల పేరుతో జరిగే మోసాల వంటి వాటికి మంచి స్పందన వచ్చింది. మహిళల పేరుతో వచ్చే నకిలీ వీడియో కాల్స్‌ విషయంలో ఎలా అప్రమత్తంగా ఉండాలి అనే విషయాలపైనా తన ఛానెల్‌ ద్వారా అవగాహన కల్పిస్తున్నారు. ఎవరైనా సులువుగా అర్థం చేసుకుని పాటించగలిగే కంటెంట్‌ ఇవ్వడంతో పాటు వీలైనంత తక్కువ నిడివి ఉండేలా చూసుకుంటున్నారు. అందరి మన్ననలు అందుకుంటున్నారు.

చదువుకున్నవారే మోసపోతున్నారు
మోసపోతున్న వారిలో విద్యాధికులు, యువతే అధికంగా ఉంటున్నారు. వారందరికీ వీటి గురించిన అవగాహన కల్పించడమే నా లక్ష్యం. నా వీడియోలన్నీ ఈ సమస్యల మీదనే ఎక్కువగా ఉంటాయి. భవిష్యత్తులో మరింత మందికి చేరువ కావాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నా.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని