logo

జడ్పీ స్థలాలపై కన్ను!

‘సర్‌.. అది జిల్లా పరిషత్తు స్థలం. అక్కడ వాణిజ్య సముదాయం నిర్మించాలని నిర్ణయించాం. పక్కన ఉన్న భవనాలను తొలగించాం. సంయుక్త కలెక్టర్‌ క్యాంపు కార్యాలయం ఖాళీ చేస్తే.. దాన్ని కూల్చి వేసి భవన సముదాయం నిర్మాణం చేస్తాం.

Published : 10 Aug 2022 05:58 IST

జేసీ బంగ్లా ఖాళీ చేయించాలని ఒత్తిడి
వాణిజ్య సముదాయం నిర్మాణానికి ప్రతిపాదన


బందరు రోడ్డులో కూల్చిన భవనాలు

ఈనాడు, అమరావతి: ‘సర్‌.. అది జిల్లా పరిషత్తు స్థలం. అక్కడ వాణిజ్య సముదాయం నిర్మించాలని నిర్ణయించాం. పక్కన ఉన్న భవనాలను తొలగించాం. సంయుక్త కలెక్టర్‌ క్యాంపు కార్యాలయం ఖాళీ చేస్తే.. దాన్ని కూల్చి వేసి భవన సముదాయం నిర్మాణం చేస్తాం. ఎంత త్వరగా చేస్తే అంత మంచిది. మంత్రి కూడా ఈ విషయంలో సుముఖంగా ఉన్నారు’ ఇదీ.. ఓ వైకాపా నేత ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌పై చేస్తున్న ఒత్తిడి. గడువు తీరే వరకు ఉమ్మడి జిల్లాకు ఒకే జిల్లా పరిషత్‌ పాలకవర్గం. ఇంకా ఆస్తుల పంపకాలు జరగలేదు. ఉద్యోగుల విభజన చేయ లేదు. విభజన జరిగితే ఏ జిల్లాలోని ఆస్తులు ఆ జిల్లాకు చెందే అవకాశం ఉంటుంది. అప్పటివరకు ఆగితే.. తమకేంటి అనుకున్నారో.. ఏమో... బందరు రోడ్డులో ప్రభుత్వ కార్యాలయాలను ఖాళీ చేయించే కార్యక్రమం చేపట్టారు నాయకులు. ఓ వాణిజ్య భవన సముదాయం నిర్మాణం చేయాలనే ప్రతిపాదనపై ఒత్తిడి పెంచారు. అందులో భాగంగా ఎన్టీఆర్‌ జిల్లా సంయుక్త కలెక్టర్‌ క్యాంపు కార్యాలయం ఖాళీ చేయాలని అధికారులపై ఒత్తిడి తెస్తున్నారు. ఇప్పటికే జడ్పీ క్యాంపు కార్యాలయాన్ని జేసీబీలతో కూలగొట్టారు. పటిష్ఠంగా ఉన్న భవనాన్ని కూల్చివేయడంపై విమర్శలు వస్తున్నాయి. బందరు రోడ్డు ప్రాంతంలో పలు ప్రభుత్వ స్థలాలు ఉన్నాయి. అవన్నీ ఖాళీ చేస్తే.. వాణిజ్య సముదాయాలు నిర్మాణం చేయవచ్చు. ఇలాంటి ఆలోచన వెనుక కొంత మంది నేతల స్వలాభం ఉందన్న విమర్శలు వస్తున్నాయి.

ఖాళీ చేయండి..

బందరు రహదారిలో జిల్లా సంయుక్త కలెక్టర్‌ నివాసం, విడిది కార్యాలయం ఉంది. దీనిని గతంలో రెవెన్యూ శాఖకు అప్పగించారు. 1965 ప్రాంతంలో ఆ భవనంలో కృష్ణా కలెక్టర్‌ నివాసం ఉండేవారు. తర్వాత 1980 ప్రాంతంలో కృష్ణా కలెక్టర్‌ నివాసం, విడిది కార్యాలయం సబ్‌కలెక్టర్‌ బంగ్లాలోకి మార్చారు. సబ్‌ కలెక్టర్‌ బంగ్లా విస్తీర్ణం ఎక్కువగా ఉండేది. అంత అవసరం లేదని భావించి అక్కడి కలెక్టర్‌ నివాసానికి కేటాయించారు. కలెక్టర్‌ ఉండే బంగ్లాను సంయుక్త కలెక్టర్‌కు కేటాయించారు. అప్పటి నుంచి ఆ భవనం నిర్వహణ భారం మొత్తం రెవెన్యూ శాఖ భరిస్తోంది. పలుమార్లు ఆధునికీకరణ, మరమ్మతులు చేశారు. ఇటీవల జిల్లాల విభజన జరిగిన తర్వాత ఎన్టీఆర్‌ జిల్లా సంయుక్త కలెక్టర్‌ శ్రీవాస్‌ నుపూర్‌ అజయ్‌కుమార్‌ ఉంటున్నారు. ఆ బంగ్లా పక్కన ఒక వైపు జడ్పీ అతిథి గృహం ఉండేది. మరోవైపు జడ్పీ ఛైర్‌పర్సన్‌ క్యాంపు కార్యాలయం ఏర్పాటుకు బంగ్లా నిర్మాణం చేశారు. ప్రస్తుతం ఆ రెండింటినీ కూల్చివేశారు. పంచాయతీరాజ్‌ క్వాలిటీ కంట్రోల్‌ డిప్యూటీ ఈఈ నివాసం ఉండే పెంకుటిల్లును పడగొట్టారు. జడ్పీ ఛైర్‌పర్సన్‌ క్యాంపు కార్యాలయం కోసం నిర్మాణం చేసిన భవనం ఇంకా గట్టిగా ఉండేది. గత పాలక వర్గంలో గద్దె అనురాధ ఛైర్‌పర్సన్‌గా ఉన్న హయాంలో ఈ భవనంలోకి రాలేదు. ఆమె నివాసం విజయవాడలోనే ఉండేది. దాన్ని అతిథి గృహంగా మార్చారు. తర్వాత జిల్లాకు ముగ్గురు సంయుక్త కలెక్టర్‌లను నియమించిన నేపథ్యంలో జేసీ (అభివృద్ధి) ఎల్‌. శివశంకర్‌కు ఆ భవనం కేటాయించారు. మార్పులు, చేర్పులు చేసి ఒక వార్‌రూం నిర్మాణం చేశారు. దాదాపు రూ.10 లక్షల వరకు ఖర్చు చేశారు. జడ్పీ ఎన్నికల తర్వాత దానిని ఖాళీ చేయాలని ఆయనపై ఒత్తిడి చేయడంతో అతను తన కార్యాలయాన్ని లబ్బీపేట ప్రాంతంలోకి మార్చారు. ప్రస్తుతం ఈ భవనాన్ని కూల్చివేశారు. జడ్పీ అతిథిగృహంగా ఉన్న భవనాన్ని పడేశారు. ఇక మధ్యలో జేసీ బంగ్లా ఉంది. దీన్ని ఖాళీ చేయాలని ఒత్తిడి పెంచుతున్నారు. ఇప్పటికే ఖాళీ చేసిన స్థలం వందల గజాల విస్తీర్ణం ఉంటుంది. జేసీ బంగ్లా కూడా ఖాళీ చేస్తే.. మూడు స్థలాల్లో కలిపి భారీ వాణిజ్య సముదాయం నిర్మాణం చేసే అవకాశం ఉంది. ఏపీ టూరిజం డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ నిర్మాణం చేసిన తరహాలో నిర్మాణం చేయాలనేది ఆలోచన. దీంతో కలెక్టర్‌పై ఒత్తిడి వస్తోంది. గతంలో జేసీ మాధవీలత ఉన్న హయాంలో కూడా ఒత్తిడి చేస్తే.. సీఎం కార్యాలయం నుంచి ఆదేశాలు వచ్చాయి. ఆ స్థలం రెవెన్యూ శాఖకు, పంచాయతీ రాజ్‌ శాఖ అప్పగించిందని ప్రస్తుతం రెవెన్యూ శాఖకు చెందుతుందని వాదించారు. మాధవీలత కలెక్టర్‌గా ఉద్యోగోన్నతిపై వెళ్లిన తర్వాత మళ్లీ ఒత్తిడి పెంచినట్లు తెలిసింది. ఈ విషయంలో అధికార పార్టీకి చెందిన ఓ నేత ఆసక్తి చూపిస్తున్నట్లు సమాచారం. అధికార యంత్రాంగం కూడా కొంత మెతక వైఖరి అవలంబిస్తున్నట్లు తెలిసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని