logo

చెప్పేదొకటి.. చేసేదొకటా

మచిలీపట్నం జిల్లా ఆసుపత్రిని వైద్యకళాశాలకు అనుసంధానిస్తూ బోధనాసుపత్రిగా వర్గోన్నతి కల్పించిన నేపథ్యంలో ఇక్కడ పనిచేస్తున్న ఉద్యోగులందరినీ బదిలీ చేయాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని ఉద్యోగులు వ్యతిరేకిస్తున్నారు. దీనిపై ప్రభుత్వ పెద్దలను

Published : 10 Aug 2022 05:58 IST

ప్రశ్నిస్తున్న జిల్లా ఆసుపత్రి ఉద్యోగులు
ప్రారంభమైన బదిలీల కౌన్సెలింగ్‌


ఆసుపత్రిలో నిరసన తెలియజేస్తున్న ఉద్యోగులు

మచిలీపట్నం కార్పొరేషన్‌, న్యూస్‌టుడే: మచిలీపట్నం జిల్లా ఆసుపత్రిని వైద్యకళాశాలకు అనుసంధానిస్తూ బోధనాసుపత్రిగా వర్గోన్నతి కల్పించిన నేపథ్యంలో ఇక్కడ పనిచేస్తున్న ఉద్యోగులందరినీ బదిలీ చేయాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని ఉద్యోగులు వ్యతిరేకిస్తున్నారు. దీనిపై ప్రభుత్వ పెద్దలను కూడా కలిసి తమ సమస్యలను విన్నవించారు. అయినా  ప్రక్రియ మాత్రం ఆగడం లేదు. మంగళవారం నుంచి వైద్యుల కౌన్సెలింగ్‌ కూడా ప్రారంభం కావడంతో వారు ఆందోళన చెందుతున్నారు. మాకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చి.. వారి పని వారు చేసుకుంటున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

కసరత్తు వేగవంతం

జిల్లాఆసుపత్రికి బోధనాసుపత్రిగా వర్గోన్నతి కల్పించడంతో పాటు ఆ స్థాయి వసతులు కల్పించేందుకు అవసరమైన నిధులు కూడా కేటాయించారు. దీనిలో భాగంగానే ఇక్కడ ఉద్యోగులందరినీ ఇతర ప్రాంతాల్లోని ఆసుపత్రుల్లో సర్దుబాటు చేసే దిశగా కసరత్తు కూడా వేగవంతమైంది. ఇక్కడ పనిచేస్తున్న రెగ్యులర్‌ వైద్యులు 28 మంది బదిలీ కానున్నారు. ప్రస్తుతానికి ఆసుపత్రిలో 40మంది వైద్యులు, 100మంది వరకు స్టాఫ్‌ నర్సులు, 50మంది పారామెడికల్‌ సిబ్బంది. 15మంది నాలుగోతరగతి  ఉద్యోగులు, మరో 15 మినిస్టీరియల్‌ స్టాఫ్‌ విధులు నిర్వహిస్తున్నారు. వీరు కాకుండా నేషనల్‌ హెల్త్‌మిషన్‌ ద్వారా పలువురు వైద్యులు, సిబ్బంది పనిచేస్తున్నారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం వీరందరూ ఇతర ప్రాంతాలకు వెళ్లక తప్పదు. వైద్యుల కౌన్సెలింగ్‌లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఖాళీల జాబితా కూడా విడుదలైంది. చేసేది లేక  వైద్యులు దగ్గరలో ఏయే ఆసుపత్రుల్లో ఖాళీలు ఉన్నాయో చూసుకుని అక్కడికి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు.  


దూర ప్రాంతంలో... తక్కువ వేతనాలతో ఎలా బతకాలి?

ఆసుపత్రిలోని ఉద్యోగులందరినీ బదిలీ చేసి బోధనాసుపత్రికి కొత్తగా పోస్టులు కేటాయిస్తామని పాలకులు చెబుతున్నారు. అయితే తమను ఇక్కడే ఉంచి కొత్తగా నియమించేవారిని ఇతర ప్రాంతాలకు కేటాయించాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు. ప్రస్తుతం జిల్లా ఆసుపత్రి ఉద్యోగుల్లో చాలామంది అవుట్‌సోర్సింగ్‌ వారే. వాళ్లంతా నెలకు రూ.15 వేల వేతనంతో పనిచేస్తున్నారు. అవి కూడా సక్రమంగా అందడం లేదు. ఇప్పటికీ 5నెలలకుపైగా బకాయిలు ఉన్నాయని వారు వాపోతున్నారు. జిల్లాలో ఎక్కడా ఖాళీలు లేకపోవడంతో రాష్ట్రంలో ఎక్కడకు పంపిస్తారోనని ఆవేదన చెందుతున్నారు. తక్కువ వేతనాలతో ఎలా బతకాలో అని ఆవేదన చెందుతున్నారు. మిగిలిన ఉద్యోగులది కూడా ఇదే పరిస్థితి. దూర ప్రాంతాలకు వెళ్లి అక్కడ అద్దెలు, పిల్లల చదువులకు ఫీజులు ఎలా కట్టాలని ప్రశ్నిస్తున్నారు. దీంతో చాలామంది దూర ప్రాంతాలు వెళ్లడానికి ఇష్టపడక, అవసరమైతే ఉద్యోగానికి రాజీనామా చేయడానికి సిద్ధపడుతున్నారని సంఘ నాయకులు చెబుతున్నారు. క్షేత్రస్థాయిలో ఉన్న సమస్యలు గుర్తించి తమకు ఆసుపత్రిలోనే కొనసాగించాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఇప్పటికే కొన్ని రోజులుగా నిరసన కార్యక్రమాలు చేపట్టడంతో పాటు ఉన్నతాధికారులకు వినతిపత్రాలు అందజేశారు. ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తే ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు.


అందరికీ ఇబ్బందే
- ఉల్లి కృష్ణ, ఏపీ వైద్య విధాన పరిషత్‌ ఉద్యోగ సంఘ నాయకుడు

సంఘం తరఫున ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డితోపాటు పలువురిని కలిసి సమస్యను విన్నవించాం. న్యాయం చేస్తామని చెప్పారు. కానీ యథావిధిగా జీవోలు జారీ చేస్తున్నారు. ఇది సబబు కాదు. ప్రభుత్వ నిర్ణయంతో ఉద్యోగులందరికీ ఇబ్బందే. మళ్లీ ప్రభుత్వ పెద్దలను కలిసేందుకు ప్రయత్నిస్తున్నాం. నిర్ణయాన్ని ఉపసంహరించుకుని  న్యాయం చేయాలని డిమాండ్‌ చేస్తున్నాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని