logo

‘జనసేన సర్పంచిపై వేధింపులు ఆపకుంటే తీవ్ర పరిణామాలు తప్పవు’

ఏలూరు జిల్లా కోరుకొల్లు సర్పంచి భట్టు లీలాకనకదుర్గను కైకలూరు నియోజకవర్గ ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని జనసేన కృష్ణా జిల్లా అధ్యక్షుడు బండ్రెడ్డి రామకృష్ణ ఆరోపించారు.

Published : 08 Dec 2022 05:07 IST

సమావేశంలో నినాదాలు చేస్తున్న బండ్రెడ్డి రామకృష్ణ, లీలా ప్రసాద్‌,

బాలాజీ, సర్పంచి లీలా కనకదుర్గ తదితరులు

మచిలీపట్నం కార్పొరేషన్‌, న్యూస్‌టుడే: ఏలూరు జిల్లా కోరుకొల్లు సర్పంచి భట్టు లీలాకనకదుర్గను కైకలూరు నియోజకవర్గ ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని జనసేన కృష్ణా జిల్లా అధ్యక్షుడు బండ్రెడ్డి రామకృష్ణ ఆరోపించారు. కేవలం జనసేన సర్పంచి కావడంతో తన విధులు కూడా నిర్వహించనీకుండా అడ్డుకుంటున్నారని విమర్శించారు. మచిలీపట్నంలోని పార్టీ కార్యాలయంలో బుధవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైకాపా నాయకుల తీరు మార్చుకోకుంటే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించారు. ఆ పార్టీ లీగల్‌సెల్‌ రాష్ట్ర నాయకులు శింగలూరి శాంతిప్రసాదు మాట్లాడుతూ ఎన్నికల్లో నామినేషన్‌ వేసిన దగ్గర నుంచి మహిళ అని కూడా చూడకుండా స్థానిక ఎమ్మెల్యేతో పాటు ఇతర ప్రజాప్రతినిధులు కూడా ఇబ్బందులు పెడుతున్నారని పేర్కొన్నారు. ఇటీవల ఆమె చెక్‌పవర్‌ రద్దు చేయడంతో పాటు మూడు నెలల పాటు సర్పంచి పదవి నుంచి తప్పించగా, ఈ రెండు విషయాల్లో కోర్టును ఆశ్రయించగా సర్పంచికి అనుకూలంగా తీర్పు ఇచ్చిందని తెలిపారు. దీంతో పాటు ప్రజాస్యామ్యబద్ధంగా ఎన్నికైన వారి పట్ల వ్యవహరించిన తీరుపై కోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసిందన్నారు. ఎస్సీ మహిళ అయినా ఆమె పైనే ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టారని, ఇలాంటి కక్షపూరిత వైఖరి సరికాదని చెప్పారు. కోరుకొల్లు సర్పంచి లీలాకనకదుర్గ మాట్లాడుతూ గ్రామసభలో తనపై దాడికి పాల్పడితే ఎస్సైకు ఫిర్యాదు చేసినా ఇంతవరకు పట్టించుకోలేదని ఆరోపించారు. వైకాపాలో చేరాలని ఒత్తిడి తెచ్చినా వినకపోవడంతో వివిధ రకాలుగా వేధింపులకు గురిచేస్తున్నారని చెప్పారు. తనకు జరిగిన అన్యాయంపై కోర్టుకు వెళ్లగా తమ అధినేత పవన్‌కల్యాణ్‌ అండగా నిలిచారని, న్యాయస్థానాలను నమ్ముకునే తాను పాలన చేయగలుతున్నారని తెలిపారు. పార్టీ జిల్లా ప్రధానకార్యదర్శి లంకిశెట్టి బాలాజీ మాట్లాడుతూ జనసేన సర్పంచిని మళ్లీ వేధింపులకు గురిచేస్తే పవన్‌కల్యాణ్‌ కారు కోరుకొల్లు వచ్చి ఆగుతుందని హెచ్చరించారు. నిబంధనలు పట్టించుకోకుండా చెక్‌పవర్‌ రద్దు చేసిన ఏలూరు జిల్లా డీపీవోని సస్పెండ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. సమావేశంలో జనసేన నాయకులు బండి రామకృష్ణ , వంపుగడల చౌదరి, గడ్డం రాజు, ఉరిమి సర్పంచి పంచకర్ల సురేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని