logo

Vijayawada: చికిత్స కోసం చేరి.. పైనుంచి దూకేసి!

విజయవాడ కొత్త ప్రభుత్వాసుపత్రిలో చికిత్స కోసం చేరిన కంచికచర్లకు చెందిన ఓ యువకుడు ఆదివారం రాత్రి.. రెండో అంతస్తు నుంచి కిందకు దూకి చనిపోయాడని తెలిసింది.

Updated : 14 Feb 2024 09:40 IST

యువకుడు ప్రాణాలొదిలినా స్పందించని యంత్రాంగం
కొత్తాసుపత్రిలో ఘటన.. గోప్యంగా ఉంచి పోస్టుమార్టం

ఈనాడు, అమరావతి - విజయవాడ వైద్యం, న్యూస్‌టుడే: విజయవాడ కొత్త ప్రభుత్వాసుపత్రిలో చికిత్స కోసం చేరిన కంచికచర్లకు చెందిన ఓ యువకుడు ఆదివారం రాత్రి.. రెండో అంతస్తు నుంచి కిందకు దూకి చనిపోయాడని తెలిసింది. ఈ ఘటన గోప్యంగా ఉంచి పోస్టుమార్టం చేసి అతడి బంధువులకు మృతదేహాన్ని అప్పగించినట్టు సమాచారం. ఆసుపత్రిలో వైఫల్యాలు బయటపడతాయనే.. ఎవరికీ చెప్పకూడదని సిబ్బంది, బాధితుడి బంధువులనూ బెదిరించినట్లు తెలిసింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. కంచికచర్లకు చెందిన సురేష్‌(30) వారం కిందట మెడ కోసుకుని ఆత్మహత్యాయత్నం చేయగా, అతని బంధువులు కాపాడి విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తెచ్చారు. ఆసుపత్రి బి బ్లాక్‌ రెండో అంతస్తులో జనరల్‌ మెడిసిన్‌కు చెందిన ఎంఎం2 వార్డులో చికిత్స పొందుతూ కోలుకుంటున్నాడు. ఆదివారం అర్ధరాత్రి బాధితుడికి తోడుగా ఉన్న అతని బంధువు టీ తాగడానికి కిందకు వెళ్లాడు. అప్పుడు వార్డులో సిబ్బంది ఒక్కరు కూడా లేకపోవడంతో సురేష్‌ బయటకు వచ్చి.. బిబ్లాక్‌ నుంచి సీబ్లాక్‌కు వెళ్లేందుకు మధ్యలో ఉన్న ఇనుప ఫుట్‌ఓవర్‌ బ్రిడ్జి పైనుంచి కిందకు దూకి ప్రాణాలు వదిలాడు. ఘటన జరిగిన గంట వరకు కూడా విధుల్లో ఉండాల్సిన వైద్యులు పత్తా లేరని తెలిసింది. ఆసుపత్రి సిబ్బంది పట్టించుకోకనే ఘటన జరిగిందని బాధితుడి సహాయకుడు నిలదీయగా.. నువ్వే దగ్గరుండి చూసుకోవాలి, మేమేమైనా మీ పనిమనుషులమా.? కాపలా ఉండడానికి.. అని ఒకరిద్దరు వైద్య సిబ్బంది.. తిరిగి అతడిపైనే మండిపడినట్టు తెలుస్తోంది.

రాత్రివేళ ఒక్కరూ ఉండరు...

వార్డుల్లో రాత్రివేళ రోగులను పర్యవేక్షించేందుకు ఒక్క సిబ్బంది కూడా ఉండడం లేదనే ఫిర్యాదులు చాన్నాళ్లుగా వెల్లువెత్తుతున్నాయి. కనీసం రోగులు మంచం పైనుంచి కిందకు పడిపోయినా.. పట్టించుకునే దిక్కులేదని బంధువులు మొత్తుకుంటున్నా.. పట్టించుకునే దిక్కేలేదు. వార్డుల నుంచి రోగులు ఎవరూ బయటకు రాకుండా 24గంటలూ పర్యవేక్షించేలా సిబ్బందిని షిఫ్టుల వారీగా నియమించాలి. కచ్చితంగా డ్యూటీ వైద్యుడు, ఒక స్టాఫ్‌నర్సు, వార్డు సిబ్బంది నిత్యం పర్యవేక్షించాలి. కానీ.. ఒక్క వైద్య సిబ్బంది కూడా వార్డుల్లో ఉండకపోవడం వల్లే తాజా ఘటన జరిగింది. రోగుల బంధువులే ప్రతిక్షణం పక్కనుండి చూసుకోవాలి. వాళ్లు ఏమాత్రం అడుగు బయట పెట్టినా.. ఇదే పరిస్థితి. రాత్రివేళ ఏదైనా అత్యవసర వైద్య సహాయం అవసరమైనా.. ఒక్కరు కూడా ఉండడం లేదని తరచూ రోగులు, బంధువులు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. వార్డుల్లో వైద్య సిబ్బంది ఉండటం లేదని.. ఇటీవల ఒక రోగి బంధువు జూనియర్‌ వైద్యుడిని నిలదీశాడు. ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగి.. తోపులాట వరకూ వెళ్లడంతో.. జూనియర్‌ వైద్యులంతా కలిసి రాత్రుళ్లు ఆందోళనకు దిగారు.

కనీసం 200మంది సిబ్బంది కావాలి..

రాష్ట్రంలోనే అత్యంత కీలకమైన ప్రభుత్వ వైద్య కేంద్రాల్లో విజయవాడ కొత్తాసుపత్రి ఒకటి. అలాంటి ఆసుపత్రిలోనే.. అడుగడుగునా.. తీవ్ర నిర్లక్ష్యం, సౌకర్యాల కొరత తాండవిస్తోంది. మందులు, మంచాలు, స్ట్రెచర్లు, వీల్‌ఛైర్లు అన్నింటికీ కొరతే. ఆసుపత్రిలో పెరిగిన రోగులకు తగ్గట్టుగా కనీస స్థాయిలోనూ సిబ్బంది సంఖ్యను పెంచడం లేదు. అన్ని విభాగాల్లో కలిపి కనీసం 200 మంది ఎఫ్‌ఎన్‌వో, ఎంఎన్‌వో, వార్డుబోయ్‌, టెక్నీషియన్లు.. సహా వైద్య సిబ్బంది అవసరమని రెండేళ్ల కిందటే లెక్కలు కట్టి అప్పటి సూపరింటెండెంట్‌ ప్రభుత్వానికి నివేదించారు. వెంటనే సిబ్బందిని నియమిస్తామని వైద్యశాఖ మంత్రి, ఉన్నతాధికారులు, కలెక్టర్లు చెప్పడమే తప్ప.. ఒక్కరూ మాట నిలబెట్టుకున్నది లేదు. అందుకే వార్డుల్లో సిబ్బంది కనిపించరు. చివరికి వీల్‌ఛైర్లు, స్ట్రెచర్లపై రోగులను బంధువులే ఆసుపత్రిలోకి తీసుకెళ్లాల్సిన దయనీయ పరిస్థితులున్నాయి. తాజాగా ఘటనపై ఆసుపత్రి అధికారులకు బాధితుడి బంధువులు ఫిర్యాదు చేసినా గోప్యంగా ఉంచేసి.. మరుసటి రోజు పోస్టుమార్టం నిర్వహించి, వెంటనే ఊరికి తీసుకెళ్లిపోమని మృతదేహాన్ని అప్పగించినట్లు సమాచారం. ఘటనపై సూపరింటెండెంట్‌, అధికారులను వివరణ కోరేందుకు ‘ఈనాడు’ ప్రయత్నించినా.. వారు స్పందించేందుకు నిరాకరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని