logo

Vijayawada: పోలీసులంటే భయం లేదు.. విజయవాడలో రౌడీషీటర్ల ఆగడాలు

విజయవాడ నగరంలో రౌడీషీటర్ల ఆగడాలకు అడ్డే లేకపోతోంది. బెజవాడలో రౌడీయిజాన్ని రూపుమాపడంలో పోలీసులు విఫలమవుతున్నారు.

Updated : 17 Feb 2024 08:19 IST

నగరంలో పేట్రేగుతున్న రౌడీషీటర్లు
కొరవడిన పోలీసుల పర్యవేక్షణ...

ఈనాడు - అమరావతి: విజయవాడ నగరంలో రౌడీషీటర్ల ఆగడాలకు అడ్డే లేకపోతోంది. బెజవాడలో రౌడీయిజాన్ని రూపుమాపడంలో పోలీసులు విఫలమవుతున్నారు. కఠిన చర్యల లేకపోవడమే కారణం.  గతంలో రౌడీల కార్యకలాపాలు అధికంగా ఉండేవి. ఇప్పుడు పరిస్థితి మారినా.. సమస్యను పూర్తిగా తుద ముట్టించని వేళ అసాంఘిక శక్తులు పేట్రేగిపోతున్నాయి. పోలీసులంటే భయం లేకుండా రెచ్చిపోతున్నారు. హత్యలు, దోపిడీలతో భయాందోళనలకు గురిచేస్తున్నారు. ఇంత జరుగుతున్నా ఖాకీలు మొక్కుబడి కౌన్సిలింగ్‌తో మమ అనిపిస్తున్నారు. కరుడుగట్టిన వారికి నగర బహిష్కరణ విధిస్తున్నా.. అరాచకాలు ఆగడం లేదు.

గంజాయి అక్రమ రవాణా

నగరంలో 470 మంది రౌడీషీటర్లు, 350 మంది సస్పెక్ట్‌ షీటర్లు ఉన్నారు. రౌడీషీటర్లలో 130 మంది మేర క్రియాశీలకంగా ఉన్నారు. ఇప్పటికి సుమారు 50 మందిని పోలీసులు నగర బహిష్కరణ విధించారు. పలువురు గంజాయి, దందాలను ఆదాయ వనరుగా మార్చుకున్నారు. గంజాయి తెప్పించి నగరంలో అమ్మి.. ఆ ఆదాయంతో కార్యకలాపాలు విస్తరిస్తున్నారు. దందాలతోనూ ఆర్జిస్తూ గ్యాంగులను పోషిస్తున్నారు. రౌడీషీటర్లు, వారి అనుచరుల్లో చాలా మంది ఖరీదైన బైకులపై తిరుగుతున్నారు. వీటిలో అధిక భాగం ఇతరులను బెదిరించి లాక్కున్నవే. మిగిలినవి చోరీ చేసినవి. వీటిని ఏజెన్సీ నుంచి గంజాయి రవాణాకు వాడుతున్నారు. చదువు మధ్యలో మానేసిన మైనర్లనూ రౌడీలు అసాంఘిక కార్యకలాపాలకు ఉపయోగిస్తున్నారు.

మొక్కుబడి కౌన్సెలింగ్‌..

చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న వారిపై రౌడీషీట్‌ తెరుస్తున్నా.. వారిపై పూర్తి నిఘా లేదు. ఏదైనా ఘటన జరిగాక హడావుడి చేయడమే తప్ప.. నిఘా నిరంతరం ఉండడం లేదు. ప్రతి వారం నిర్వహించే రౌడీషీటర్ల కౌన్సిలింగ్‌ మొక్కుబడి. కొందరు దీనిని ఎగ్గొడుతున్నారు. వీరిపై సరైన నిఘా లేక రికార్డులకు ఎక్కని ఎందరో అసాంఘిక శక్తులుగా చలామణి అవుతున్నారు. వీరు శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నారు. నగర బహిష్కరణ విధిస్తున్న వారి కార్యకలాపాలపై నిఘా కొరవడుతోంది.

సరిహద్దు ప్రాంతాల్లోనే తిష్ఠ

నగర బహిష్కరణకు గురైన రౌడీషీటర్లు పోలీసులకు దొరక్కుండా శివారు ప్రాంతాల్లో తిష్ఠ వేసి, రాత్రుళ్లు తెగిస్తున్నారు. కొత్త జిల్లాల ఏర్పాటయ్యాక పెనమలూరు మండలం కృష్ణా జిల్లాలో చేరింది. దీంతో నగరానికి ఆనుకుని ఉన్న యనమలకుదురు, కానూరు, పోరంకి తదితర ప్రాంతాల్లో నివాసం ఉంటున్నారు. గతంలో తాడేపల్లిలో ఉండేవారు. వీరు నగర పరిధిలో లేరని పోలీసులు పట్టించుకోవడం లేదు. ఈ ఉదాసీనతనే వారు అనుకూలంగా మార్చుకొని నిఘా కళ్లుగప్పి యథావిధిగా కార్యకలాపాలు సాగిస్తున్నారు. పెనమలూరు ఠాణాలో రౌడీషీట్‌ ఉన్న గ్యాంగ్‌ వార్‌ ఘటనలో ప్రధాన నిందితుడైన పండు సనత్‌నగర్‌లో ఉంటూ.. నగరంలో దందా చేస్తూ అరాచకం సృష్టిస్తున్నాడు.

ఆ ప్రణాళికలు ఏమయ్యాయి ?

టాస్క్‌ఫోర్స్‌ ఆధ్వర్యంలో స్టేషన్ల వారీగా రౌడీషీటర్ల వివరాలను కంప్యూటరీకరించారు. వారి సామాజిక మాధ్యమ ఖాతాలు, ఈ-మెయిల్స్‌, సన్నిహితుల వివరాలను క్రోడీకరించామని చెప్పినా, దీనిని పూర్తిగా అమలు చేయలేదు. రౌడీషీటర్ల సామాజిక మాధ్యమ ఖాతాలపై నిఘా ఉంచి, వారి కార్యకలాపాలకు అడ్డుకట్ట వేస్తామని గతంలో పోలీసులు ప్రణాళిక రచించారు. ఇవన్నీ కాగితాలకే పరిమితం. పర్యవేక్షణ విషయంలో పోలీసుల వైఫల్యం కనిపిస్తోంది. రౌడీషీటర్ల ఫొటోలు, వేలిముద్రలు అనుసంధానం చేసి యాప్‌లో నిక్షిప్తం చేస్తామన్నా.. ఆచరణ ఊసే లేదు.


దాడులు.. దందాలు

  • పటమట స్టేషన్‌లో రౌడీషీట్‌ ఉండి నగర బహిష్కరణకు గురైన ప్రభుదాస్‌.. పోరంకిలో ఉంటున్నాడు. కానీ యథావిధిగా తన కార్యకలాపాలను నగరంలో చేపడుతున్నాడు. నగర పరిధిలోకి వచ్చి.. గత వారం సతీష్‌ అనే ఆటోడ్రైవర్‌పై కత్తితో దాడి చేశాడు.
  • ఆది అనే సస్పెక్ట్‌ షీటరు రెండు వారాల కిందట మరో ఇద్దరితో కలసి పటమట హైస్కూలు రోడ్డులో వేకువన ముఠా కార్మికుడిపై దాడి చేసి, డబ్బులు లాక్కున్నారు. ఇతను రామలింగేశ్వర్‌నగర్‌లో నివసిస్తూ దందాలకు తెగించాడు. కొందరు మైనర్లను చేరదీసి గంజాయి అలవాటు చేసి దందాలు చేస్తున్నాడు. గ్యాంగ్‌ వార్‌ ఘటన తర్వాత ఆదిపై పటమట పోలీసులు సస్పెక్ట్‌ షీట్‌ తెరిచారు. ద్విచక్ర వాహనాలను చోరీ చేసి, వాటిపై గంజాయిని రవాణా చేస్తున్నాడు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని