logo

Vijayawada: చెత్త పన్ను రద్దు చేయం: మేయర్‌ భాగ్యలక్ష్మి

చెత్త పన్ను(యూజర్‌ ఛార్జీలు) రద్దు చేసేది లేదని నగర మేయర్‌ రాయన భాగ్యలక్ష్మి స్పష్టం చేశారు. విజయవాడ నగరపాలక సంస్థ బడ్జెట్‌ సమావేశం తీవ్ర ఆరోపణలు, వాగ్వాదాల నడుమ వాడివేడిగా సాగింది.

Updated : 18 Feb 2024 08:51 IST

వాడీవేడిగా నగరపాలక సంస్థ బడ్జెట్‌ సమావేశం

భవానీపురం, న్యూస్‌టుడే :  చెత్త పన్ను(యూజర్‌ ఛార్జీలు) రద్దు చేసేది లేదని నగర మేయర్‌ రాయన భాగ్యలక్ష్మి స్పష్టం చేశారు. విజయవాడ నగరపాలక సంస్థ బడ్జెట్‌ సమావేశం తీవ్ర ఆరోపణలు, వాగ్వాదాల నడుమ వాడివేడిగా సాగింది. శనివారం కౌన్సిల్‌ హాలులో నగరపాలక సంస్థ బడ్జెట్‌ 2024-25 సమావేశం నిర్వహించారు. నగర ప్రజలపై ఆర్థిక భారం మోపే విధంగా, అంకెల గారడీతో బడ్జెట్‌ ప్రవేశపెట్టారని ప్రతిపక్ష పార్టీల కార్పొరేటర్లు విమర్శించగా, ప్రజలపై ఎటువంటి భారం మోపేది లేదంటూ అధికార పార్టీ వారు తెలిపారు. ఆద్యంతం ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి నామస్మరణతో అధికార పార్టీ సభ్యుల ప్రసంగాలు సాగాయి. మొత్తం బడ్జెట్‌ రూ.1460.82 కోట్లుగా చూపారు. ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాసరావు పాల్గొన్నారు.

సభ్యుల మధ్య వాదోపవాదాలు..

బడ్జెట్‌లో పలు అంశాలపై సభ్యుల మధ్య వాదోపవాదాలు జరిగాయి. కాపుల సంక్షేమం, నిధుల కేటాయింపుపై సభ్యుల మధ్య చర్చ జరిగింది. తెదేపా ప్రభుత్వ హయాంలో కాపులకు రూ. వేలాది కోట్లు కేటాయించారని, ప్రస్తుతం వారికి ఏవిధమైన కేటాయింపులు లేవని పేర్కొన్నారు. గత ప్రభుత్వం, ప్రస్తుత ప్రభుత్వంలో ఎంత మేర కేటాయింపులు జరిగాయో అనే విషయంపై చర్చ పెట్టాలన్నారు. మేయర్‌ భాగ్యలక్ష్మి జోక్యం చేసుకుని కాపు కార్పొరేటర్లు లేచి సమాధానం చెప్పాలంటూ పేర్కొన్నారు. మధ్య నియోజకవర్గ శాసనసభ్యుడు మల్లాది విష్ణు మాట్లాడుతూ వైకాపా హయాంలో కాపులకు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చి నిధులు కేటాయించినట్లు తెలిపారు. సభను తప్పుదోవ పట్టించేలా మాట్లాడటం సరికాదన్నారు.

చెత్తపన్ను తొలగించాలని కోరుతూ కౌన్సిల్‌ బయట తెదేపా కార్పొరేటర్ల నినాదాలు

ప్రజలపై భారం

సభలో చెత్త పన్ను అంశంపై చర్చ జరిగింది. చెత్త పన్ను భారంగా మారిందని, గతంలో ఎన్నడూ లేని విధంగా పన్ను వేస్తున్నారని విపక్ష పార్టీ సభ్యులు పేర్కొన్నారు. దీనిపై మేయర్‌ భాగ్యలక్ష్మి స్పందిస్తూ చెత్త కాదని, యూజర్‌ ఛార్జీలని పేర్కొన్నారు. వాటిని రద్దు చేసే ప్రసక్తే లేదని, కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు, నిబంధనలకు అనుగుణంగా వాటిని విధించినట్లు చెప్పారు. అప్పుడే నిధులు వచ్చే అవకాశం ఉందన్నారు. ప్రజలపై ఏవిధమైన భారాలు వేయడం లేదన్నారు. దీనిపై విపక్ష సభ్యులు స్పందిస్తూ కేంద్ర ప్రభుత్వ ఆదేశాలను నగర ప్రజలపై రుద్దుతున్నారని, ప్రజలపై భారం వేస్తున్నారని తెలిపారు. బడ్జెట్‌ను వ్యతిరేకిస్తున్నామని తెదేపా, సీపీఎం సభ్యులు ప్రకటించారు.

జగన్‌ భజన

అధికార పార్టీకి చెందిన కార్పొరేటర్లు, మేయర్‌ ఆద్యంతం ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి నామస్మరణ చేశారు. అనేక అంశాల్లో వైకాపా ప్రభుత్వ హయాంలో అభివృద్ధి జరిగిందని, ముఖ్యమంత్రి నగరంపై శ్రద్ధ చూపుతున్నారంటూ పేర్కొన్నారు.

రూపాయి రాక ఇలా.. (కోట్లలో)

  • నగరపాలక సంస్థకు మొత్తం 1370.49 ఆదాయం వస్తున్నట్లు చూపారు.
  • రెవెన్యూ ఆదాయం: 820.90
  • క్యాపిటల్‌ ఆదాయం: 501.42
  • డిపాజిట్లు, అడ్వాన్సుల రూపేణా: 48.17
  • సభ చివర్లో అధికార పార్టీ సభ్యులు చేతులను పైకి ఎత్తి బడ్జెట్‌కు ఆమోదం తెలిపారు.

రూపాయి పోక ఇలా..

  • రెవెన్యూ ఖర్చు: 614.60
  • క్యాపిటల్‌ ఖర్చు: 779.93
  • రుణాల చెల్లింపులు: 18.12
  • డిపాజిట్లు, అడ్వాన్సులు: 48.17

గ్రాంట్‌లు తెచ్చుకోవడంలో విఫలం..

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి గ్రాంట్లు రాబట్టడంలో అధికార పార్టీ సభ్యులు విఫలమయ్యారని ప్రతిపక్ష సభ్యులు ఆరోపించారు. ఫ్లోర్‌లీడర్‌ బాలస్వామి, సీపీఎం కార్పొరేటర్‌ బోయి సత్యబాబు, ఇతర సభ్యులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నుంచి రూ.150కోట్లు వస్తాయంటూ పేర్కొన్నారని, రూ.9కోట్లు మాత్రమే వచ్చాయని, మిగిలిన నిధులపై మాట్లాడటం లేదన్నారు. దీనిపై మేయర్‌ స్పందిస్తూ రూ.30కోట్లు నిధులు వచ్చాయని తెలిపారు.

  • ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ నిధులు విడుదల విడుదల చేయించుకోలేకపోయారని వెల్లడించారు.
  • డివిజన్‌లో అభివృద్ధి పనులను చేపట్టేందుకు ఒక్కో కార్పొరేటర్‌కు రూ.30 లక్షల గ్రాంటు ఉందని, వాటిని రూ.50లక్షలకు పెంచాలని కోరారు. రూ.40లక్షలు చేస్తామని మేయర్‌ పేర్కొన్నారు. నగరంలో కుక్కల బెడద ఎక్కువగా ఉందని, చర్యలు తీసుకోవాలన్నారు.
  • ప్రతిపక్ష పార్టీల డివిజన్లలో పనులు జరగడం లేదని, అధికారులను అడిగితే గుత్తేదారులు రావడం లేదంటూ సాకులు చెబుతున్నారని తెలిపారు. మేయర్‌ స్పందిస్తూ అధికారుల వెంటపడి పనులు చేయించుకోవాలని సూచించారు.
  • దోమల నివారణకు రూ.15 లక్షలు మాత్రమే కేటాయించారని, ఆ నిధులు సరిపోవని, పెంచాలన్నారు.
  •  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వంలోని వివిధ శాఖల నుంచి బకాయిలు వసూలు చేయడంపై శ్రద్ధ చూపడం లేదని తెలిపారు. ప్రజలపై మాత్రం ఆస్తి, నీటి, భూగర్భ డ్రెయినేజీ పన్నులు వేసేందుకు సిద్ధంగా ఉన్నారని వెల్లడించారు.
  •  నగరంలో ప్రకటనల ఆదాయం భారీగా తగ్గిందని, ‘సిద్ధం’అంటూ నగర వ్యాప్తంగా బోర్డులు ఏర్పాటు చేయడం వలన తగ్గిందా అని విపక్ష సభ్యులు ప్రశ్నించారు. అధికారులు పరిశీలించాలన్నారు.  
  • ప్రజలపై పన్నుల భారాన్ని తగ్గించాలంటూ విపక్ష సభ్యులు కౌన్సిల్‌కు వచ్చేటప్పుడు, వెళ్లేప్పుడు నిరసన తెలిపారు.
  • నగరపాలక సంస్థ కమిషనర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ మాట్లాడుతూ మిగిలిన నగరపాలక సంస్థలతో పోల్చితే కార్పొరేషన్‌ ఆర్థిక పరిస్థితి బాగుందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి వివిధ రకాల నిధులు వస్తున్నాయని తెలిపారు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని