icon icon icon
icon icon icon

నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవ్‌: సీఈవో ముకేశ్‌కుమార్‌ మీనా

ఎన్నికల విధుల్లో ఉన్న ప్రతి ఒక్కరికీ ఓటు వేసే అవకాశం కల్పిస్తామని ఏపీ ఎన్నికల ప్రధానాధికారి (సీఈవో) ముకేశ్‌కుమార్‌ మీనా స్పష్టం చేశారు.

Updated : 07 May 2024 15:30 IST

విజయవాడ: ప్రభుత్వం ఇచ్చే పథకాలేవీ ఆపాలని ఎన్నికల సంఘం ఆదేశాలివ్వలేదని, కొంతకాలం తర్వాత ఇవ్వాలని చెప్పిందని ఏపీ ఎన్నికల ప్రధానాధికారి (సీఈవో) ముకేశ్‌కుమార్‌ మీనా స్పష్టం చేశారు. ఎన్నికల విధుల్లో ఉన్న ప్రతి ఒక్కరికీ ఓటు వేసే అవకాశం కల్పిస్తామని స్పష్టం చేశారు. ఉద్యోగులు జాగ్రత్తగా ఉండాలని.. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. 

పోస్టల్‌ బ్యాలెట్‌ పోలింగ్‌ సుమారు 70 శాతం పూర్తయిందని సీఈవో చెప్పారు. అవసరమైతే 9వ తేదీ వరకు అవకాశం కల్పిస్తామన్నారు. సొంత నియోజకవర్గాల పరిధిలోనే ఉద్యోగులు ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచించారు. పోస్టల్‌ బ్యాలెట్‌ కోసం మొత్తం 4.30లక్షల మంది దరఖాస్తు చేసుకోగా. 3.30లక్షల మంది వినియోగించుకున్నారని తెలిపారు. కొన్నిచోట్ల 12-డి ఫారాలు అందడంలో జాప్యం జరిగిందన్నారు. ఇప్పటి వరకు పోస్టల్‌ బ్యాలెట్‌ వినియోగించుకోని వారు మంగళవారం, బుధవారం ఓటు వేయవచ్చన్నారు. సెక్యూరిటీ డ్యూటీకి వెళ్లిన వారికి ఈనెల 9న కూడా అవకాశం కల్పించినట్టు చెప్పారు. 

ఇప్పటికే 20 రోజుల సమయం ఇచ్చామని, జూన్‌ 3 వరకు పోస్టల్‌ బ్యాలెట్‌ గడువు పొడిగించడం కష్టమన్నారు. కొన్ని ఫెసిలిటేషన్ సెంటర్ల వద్ద ఓటర్లకు డిజిటల్‌ పేమెంట్‌ చేస్తూ.. ప్రలోభ పెడుతున్నట్టు తమ దృష్టికి వచ్చిందన్నారు. దీనిపై విచారణ చేపడుతున్నామని, తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. పోలింగ్‌ సందర్భంగా అక్రమాలకు పాల్పడిన కానిస్టేబుల్‌ను సస్పెండ్‌ చేసినట్టు తెలిపారు. నేతలకు సెక్యూరిటీగా ఉన్న సిబ్బంది, ప్రధాని బందోబస్తులో ఉన్న వాళ్లకు పోస్టల్‌ బ్యాలెట్‌ వినియోగించుకునేలా వెసులుబాటు కల్పిస్తున్నామన్నారు. పల్నాడులో హోలో గ్రామ్‌ ద్వారా ఓటర్లను ప్రలోభ పెడుతున్నారని, పల్నాడు ఎపిసోడ్‌పై విచారణ జరుపుతున్నట్టు ముకేశ్‌ కుమార్‌ మీనా తెలిపారు. కొన్ని పథకాలకు నిధుల విడుదలపై కేంద్ర ఎన్నికల సంఘం వివరాలు కోరిందన్నారు. వాటిపై ఆయా శాఖలను వివరణ అడిగినట్లు చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img