logo

నవ చరితకు వంద‘నమో’

‘కాషాయం.. పసుపు.. తెలుపు... జెెండాలు ఒక్కటయ్యాయి. విజయవాడ రహదారులు జనసంద్రంగా మారాయి. వీధులన్నీ జనంతో పోటెత్తాయి. జై మోదీ.. జైజై చంద్రబాబు.. జై పవన్‌ కల్యాణ్‌... నినాదాలు మార్మోగాయి. కోలాటాలు, భాంగ్రా, సంప్రదాయ నృత్యాలతో తమనేతలకు ఘనస్వాగతం పలికారు.

Published : 09 May 2024 06:30 IST

ప్రధాని రోడ్‌షోకు పోటెత్తిన జనవాహిని
మోదీ, బాబు, పవన్‌ నినాదాలతో మార్మోగిన నగరం

ప్రచార రథంపై మోదీ అభివాదం.. పక్కనే తెదేపా అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్‌ కల్యాణ్‌

‘కాషాయం.. పసుపు.. తెలుపు... జెెండాలు ఒక్కటయ్యాయి. విజయవాడ రహదారులు జనసంద్రంగా మారాయి. వీధులన్నీ జనంతో పోటెత్తాయి. జై మోదీ.. జైజై చంద్రబాబు.. జై పవన్‌ కల్యాణ్‌... నినాదాలు మార్మోగాయి. కోలాటాలు, భాంగ్రా, సంప్రదాయ నృత్యాలతో తమనేతలకు ఘనస్వాగతం పలికారు.

ముగ్గురు అగ్రనేతలను ఒకే వేదికపై చూసేందుకు మూడు పార్టీల కార్యకర్తలు తరలిరావడంతో కృష్ణా తీరాన జనకెరటం ఉవ్వెత్తున ఎగసింది. ప్రధాని మోదీ రోడ్‌షో కూటమి కార్యకర్తల్లో నూతన ఉత్సాహం నింపింది. అడుగడుగునా విజయభేరి మోగించారు.

మార్వాడీల ఆనంద హేళ...

ఆకర్షణీయంగా అలంకరించిన వాహనంపై మధ్యలో ప్రధాని మోదీ.. కుడివైపు తెదేపా అధినేత చంద్రబాబు, ఎడమవైపు జనసేనాని పవన్‌కల్యాణ్‌లు నిలబడ్డారు.

ముగ్గురు నేతలూ అభివాదం చేస్తుంటే.. కార్యకర్తలు ఉత్సాహంతో కేరింతలు కొట్టారు.  వీరిని అదుపు చేసేందుకు పోలీసులు తంటాలు పడాల్సి వచ్చింది.పలు నియోజకవర్గాల నుంచి జనం తరలివచ్చారు. ప్రధాన రహదారికి ఇరువైపులా భారీగా జనం గుమిగూడి మోదీకి అభివాదం చేశారు.

అభిమాన నీరాజనం

అడుగడుగునా పూల జల్లులతో స్వాగతం పలికారు. మహిళలు హారతులు పట్టారు.

దాదాపు గంటసేపు ఆకర్షణీయంగా సాగిన రోడ్‌షోలో అగ్రనేతలు చిరునవ్వుతో.. ముకుళిత హస్తాలతో అభివాదం చేస్తూ.. ఉత్సాహపరిచారు.

సకల జనుల నీరాజనాలతో నేతలు మంత్రముగ్ధులయ్యారు.

ప్రధాని మోదీకి నమస్కరిస్తున్న కూటమి అభ్యర్థులు చిన్ని, బాలశౌరి, పెమ్మసాని. పక్కనే గద్దె రామ్మోహన్‌,  సుజనా, సౌమ్య

రాజధాని రైతుల జేజేలు..!

ప్రధాని మోదీకి రాజధాని ప్రాంత రైతులు ఘనస్వాగతం పలికారు. భారీగా తరలివచ్చిన రైతులు రోడ్‌షోలో పాల్గొన్నారు. బెంజి సర్కిల్‌ ప్రాంతంలో వారు వేచి చూశారు. రాజధాని గురించి చంద్రబాబు ప్రధాని మోదీకి వాహనంపైనే వివరించడం కనిపించింది. పలు విషయాలను ఆయన అడుగుతూ సందేహాలు తీర్చుకున్నట్లు చెబుతున్నారు. అనంతరం బెంజి సర్కిల్‌ వద్ద కొద్దిసేపు తాత్కాలిక శిబిరంలో సమావేశమైన ప్రధాని రోడ్‌షో విజయవంతం కావడంపై సంతృప్తి వ్యక్తం చేశారు. అక్కడే నగర నాయకులను పరిచయం చేసుకున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని