logo

ప్రభుత్వ కళాశాలల్లో.. పుస్తకాల్లేని చదువులు!

విద్యావ్యవస్థపై రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రకటనలకు.. క్షేత్రస్థాయిలో చేతలకు పొంతన కుదరడం లేదు. కార్పొరేట్‌ స్థాయికి దీటుగా ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలను తీర్చిదిద్దామని గొప్పలు చెబుతున్నారు.

Published : 27 Sep 2022 03:08 IST

మూడు నెలలవుతున్నా సరఫరా లేదు
16 వేల మంది ఇంటర్‌ విద్యార్థులపై ప్రభావం
ఈనాడు డిజిటల్‌, అనంతపురం, న్యూస్‌టుడే, అనంత విద్య, పుట్టపర్తి గ్రామీణం, ఉరవకొండ


ఇంటర్‌ విద్యార్థులకు పాఠాలు బోధిస్తున్న అధ్యాపకుడు

విద్యావ్యవస్థపై రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రకటనలకు.. క్షేత్రస్థాయిలో చేతలకు పొంతన కుదరడం లేదు. కార్పొరేట్‌ స్థాయికి దీటుగా ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలను తీర్చిదిద్దామని గొప్పలు చెబుతున్నారు. ఆ స్థాయిలో సౌకర్యాల మాట దెవుడెరుగు కనీసం పాఠ్యపుస్తకాలు పంపిణీ చేయలేని దుస్థితి నెలకొంది. తరగతులు మొదలై మూడు నెలలు కావస్తున్నా ఇంటర్‌ మొదటి, ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు పుస్తకాలు అందించలేదు. అధ్యాపకులు పాఠాలు బోధిస్తున్నా.. ఇంటివద్ద చదవడానికి వీలులేకుండా పోతోంది.

పెరిగిన రుసుం
గతంలో ఎంపీసీ, బైపీసీ విద్యార్థులకు ప్రత్యేక (స్పెషల్‌) ఫీజు రూ.1,634 ఉండగా.. ఈ ఏడాది దాన్ని రూ.2,007కు పెంచారు. ఆర్ట్స్‌ విద్యార్థులకు రూ.800లోపు ఉన్న ఫీజు రూ.11,190కు చేరింది. దీనికి అదనంగా కళాశాలలో ప్రతి విద్యార్థికి దరఖాస్తు, ఇంటర్‌ బోర్డు రిజిస్ట్రేషన్‌ ఫీజులు తదితరాలకు మరో రూ.230 అదనంగా చెల్లించాలి. ఒకవేళ మాధ్యమం మారితే అదనంగా రుసుం వసూలు చేస్తున్నారు.

ముద్రణ ఆలస్యం కారణంగానే
గతంలో తరగతులు ప్రారంభమయ్యే నాటికి పుస్తకాల పంపిణీ పూర్తిచేసేవారు. ఏదైనా కొరత ఏర్పడితే ప్రత్యేకంగా ముద్రించి ఇచ్చేవారు. 2018-19 వరకు ప్రక్రియ బాగానే కొనసాగింది. కరోనా కారణంగా పుస్తకాల పంపిణీ తగ్గిపోయింది. ప్రస్తుతం ముద్రణ ఆలస్యమే ప్రధాన కారణంగా తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రణాళిక లోపం కారణంగానే ఆలస్యమైందనే విమర్శలు వినిపిస్తున్నాయి. గతేడాది కూడా ఇంటర్మీడియట్‌ విద్యార్థుల్లో సగం మందికే పాఠ్యపుస్తకాలు పంపిణీ చేశారు.

బయట కొనలేక..
సాధారణంగా ప్రభుత్వ కళాశాలల్లో పేద కుటుంబాలకు చెందిన విద్యార్థులే చేరుతారు. ప్రభుత్వం పాఠ్యపుస్తకాలు ఇవ్వకపోవడంతో ప్రైవేటుగా కొనాల్సి వస్తోంది. పేద కుటుంబాలపై ఆర్థిక భారం పడుతోంది. బయట ఇంటర్‌ సైన్సు పుస్తకాలకు ఒక్కో విద్యార్థి రూ.1200, ఆర్ట్స్‌ గ్రూప్‌ వారు రూ.1000 వరకు ఖర్చు చేస్తున్నారు. రికార్డులు, ల్యాబ్‌ ప్రాక్టిల్స్‌కి అదనంగా ఏటా రూ.1700 ఖర్చవుతోంది. పుస్తకాల సరఫరా ఆలస్యంతో పబ్లిక్‌ పరీక్షలతోపాటు నీట్‌, జేఈఈ, ఏపీఈసెట్‌కు సన్నద్ధం కాలేని పరిస్థితి. పాలకులు స్పందించి సకాలంలో పంపిణీ చేసి విద్యార్థుల భవితకు బాటలు వేయాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.

సమీపిస్తున్న పరీక్షలు
ఏటా జూన్‌లో ఇంటర్‌ తరగతులు ప్రారంభమయ్యేవి. రెండేళ్లుగా కరోనాతో కారణంగా ఆలస్యమవుతూ వస్తున్నాయి. ఈఏడాది జులై 1 నుంచి మొదటి సంవత్సరం తరగతులు మొదలయ్యాయి. అక్టోబరులో యూనిట్‌ పరీక్షలు నిర్వహించే ఆలోచనలో ఉన్నారు. పాఠ్యాంశాలపై పట్టు సాధించని విద్యార్థులు పరీక్షల్లో ఎలా నెగ్గుకొస్తారనేది ప్రశ్నగా మారింది.

ప్రైవేటు వైపు చూపు
ఉమ్మడి అనంత జిల్లాలో 48 ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలు, 62 కేజీబీవీలు, 25 ఆదర్శ పాఠశాలలు, కొత్తగా రెండు ఉన్నత పాఠశాలల్లో ఇంటర్‌ విద్య అమలవుతోంది. పదిలో రెండు విడతల కింద 38,176 మంది ఉత్తీర్ణత పొందారు. వీరిలో ఎక్కువమంది ఇంటర్‌లో చేరారు. మొదటి సంవత్సరంలో 13,878 మంది ఉత్తీర్ణత పొందారు. వీరంతా ఇంటర్‌ రెండో ఏడాది చదువుతున్నారు. కేజీబీవీలు, ఆదర్శ పాఠశాలల్లో 11,480 సీట్లు ఉండగా.. 60 శాతం మంది చేరారు. ప్రవేశ ప్రకటన, అడ్మిషన్లు ఆలస్యంగా చేపట్టడం.. కొత్తగా ఇంటర్‌ అమలయ్యే పాఠశాలలకు అధ్యాపకుల నియామకం ఇప్పటికీ పూర్తి చేయకపోవడం, రెండు నెలలుగా పుస్తకాలు చేతికి అందక విద్యార్థులు చాలామంది ప్రైవేటు వైపు వెళ్లారు. ఉమ్మడి జిల్లాలో ప్రభుత్వ  కళాశాలల్లో 19,200 మందికి గాను ఇప్పటివరకు 16,566 మంది ప్రవేశం పొందారు.

సర్దుబాటు చేస్తున్నాం
ప్రభుత్వం నుంచి ఇంటర్‌ పాఠ్యపుస్తకాలు సరఫరా కాలేదు. జిల్లాకు అవసరమైన ఇండెంట్‌ ఇప్పటికే పంపించాం. రెండో సంవత్సరం విద్యార్థులకు పాత పుస్తకాలను సర్దుబాటు చేస్తున్నాం. మొదటి సంవత్సరం విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా చూస్తున్నాం. పుస్తకాలు రాగానే పంపిణీ చేస్తాం.

- వెంకటరమణనాయక్‌, డీవీఈవో

Read latest Anantapur News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని