logo

ఆహారం నాణ్యతపైనే అనుమానాలు

బుక్కరాయసముద్రం మండల పరిధిలో రోటరీపురం గ్రామం వద్ద ఉన్న ఎస్‌ఆర్‌ఐటీ ఇంజినీరింగ్‌ కళాశాల వసతిగృహంలో ఆహారం కారణంగా 86 మంది విద్యార్థులు అస్వస్థతకు గురవడం జిల్లాలో సంచలనంగా మారింది.

Updated : 01 Jun 2023 05:18 IST

ఎస్‌ఆర్‌ఐటీ కళాశాలలో వివరాలు సేకరిస్తున్న వైద్యాధికారులు

విద్యార్థిని పరామర్శిస్తున్న తెదేపా నాయకులు

బుక్కరాయసముద్రం, న్యూస్‌టుడే: బుక్కరాయసముద్రం మండల పరిధిలో రోటరీపురం గ్రామం వద్ద ఉన్న ఎస్‌ఆర్‌ఐటీ ఇంజినీరింగ్‌ కళాశాల వసతిగృహంలో ఆహారం కారణంగా 86 మంది విద్యార్థులు అస్వస్థతకు గురవడం జిల్లాలో సంచలనంగా మారింది. వైకాపా ఎమ్మెల్యే పద్మావతి, సాంబశివారెడ్డి దంపతులకు చెందిన కళాశాలలోనే ఇలా జరగడంతో కళాశాల నిర్వహణలో లోపాలు వెలుగులోకి వచ్చాయి. నాణ్యమైన వసతులు కల్పిస్తున్నామని యాజమాన్యం చెబుతున్నా విద్యార్థులు అస్వస్థతకు గురవడంపై పలువురు ఆందోళన వ్యక్తమవుతోంది. తమ పిల్లలు అస్వస్థతకు గురయ్యారని తెలుసుకున్న తల్లిదండ్రులు హుటాహుటిన కళాశాల, ఆస్పత్రి వద్దకు వచ్చి ఆరా తీశారు. చికిత్స పొందుతున్న పిల్లలను చూసి ఆవేదన చెందారు.

వైద్యాధికారుల విచారణ

విషయాన్ని తెలుసుకున్న జిల్లా వైద్యాధికారి వీరబ్బాయి, డీఐఓ యుగంధర్‌, డీఈవో సాయిరాం, ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్ల బృందం కళాశాల వసతిగృహానికి చేరుకుని తనిఖీలు నిర్వహించారు. ఏ కారణంతో విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారనే విషయంపై విచారణ చేపట్టారు. వసతిగృహంలో వంటగదులు, పాత్రలు, తాగునీరు, ఆహార పదార్థాలు పరిశీలించారు. మంగళవారం రాత్రి వండిన ఆహారం, తాగునీటి నమూనాలు సేకరించి పరిశీలనకు పంపారు. విద్యార్థులతో మాట్లాడి మరికొన్ని వివరాలు తెలుసుకున్నారు. చాలామంది పెరుగన్నం, ఎగ్‌రైస్‌ తిన్న తర్వాతే ఇలా జరిగిందని చెప్పారని డాక్టర్లు తెలిపారు. 25 మంది ప్రభుత్వ వైద్య సిబ్బంది కళాశాలలో ఉన్న విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలు చేసి, పర్యవేక్షిస్తున్నట్లు కొర్రపాడు డాక్టర్‌ శ్రీహర్ష చెప్పారు. అస్వస్థతకు గురైన విద్యార్థుల్లో ఎవరికీ ప్రాణాపాయం లేదన్నారు.

తెదేపా నాయకుల పరామర్శ

చికిత్స పొందుతున్న విద్యార్థులను తెదేపా నియోజకవర్గ ద్విసభ్య కమిటీ సభ్యులు నరసానాయుడు, కేశవరెడ్డి, రామలింగారెడ్డి పరామర్శించారు. విద్యార్థులతో స్వయంగా మాట్లాడి వారి యోగక్షేమాలు తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లకు సూచించారు. కళాశాలలో మెరుగైన ఆహారం, వసతులు కల్పించాలని డిమాండు చేశారు.

పరీక్షకు వంట దినుసుల నమూనాలు

అరవిందనగర్‌ (అనంతపురం):  కలుషిత ఆహారం తిని అస్వస్థతకు లోనవటానికి దారితీసిన కారణాలను పరిశీలిస్తున్నామని ఆహార భద్రత, నాణ్యత అమలు శాఖ అసిస్టెంట్‌ ఫుడ్‌ కంట్రోలరు కల్యాణ చక్రవర్తి చెప్పారు. ఎగ్‌రైస్‌, టమోటారైస్‌, పెరుగన్నం తిన్న విద్యార్థులు కొందరు అస్వస్థతకు గురయ్యారన్నారు. పాలను కాచి, పెరుగుతోడు వేయడానికి వాడిన వంటపాత్ర, పెరుగన్నం తినడం విద్యార్థులు ఆసుపత్రి పాలవటానికి దారి తీసిందని భావిస్తున్నామన్నారు. కళాశాల వసతి గృహాన్ని తనిఖీ చేసి వంటకు వినియోగిస్తున్న కందిపప్పు, పెసర, మినప, శెనగ పప్పు నమూనాలను సేకరించి నాణ్యత పరీక్షకు ప్రయోగశాలకు పంపించామని చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని