logo

Electric Heater: చిన్నారిని బలిగొన్న విద్యుత్తు హీటర్‌

స్నానపు గదిలో విద్యుత్తు హీటర్‌ను తాకడంతో షాక్‌కు గురై ఒక చిన్నారి మృతిచెందగా.. తల్లీ కుమార్తె గాయపడ్డారు. ఈఘటన తాడిపత్రి పట్టణంలోని అంబేడ్కర్‌ నగర్‌ బస్టాండు సమీపంలో శుక్రవారం ఉదయం చోటు చేసుకుంది.

Updated : 06 Jan 2024 09:38 IST

తల్లి, మరో కుమార్తెకు గాయాలు

విహన్యశ్రీ (పాతచిత్రం)

తాడిపత్రి, న్యూస్‌టుడే: స్నానపు గదిలో విద్యుత్తు హీటర్‌ను తాకడంతో షాక్‌కు గురై ఒక చిన్నారి మృతిచెందగా.. తల్లీ కుమార్తె గాయపడ్డారు. ఈఘటన తాడిపత్రి పట్టణంలోని అంబేడ్కర్‌ నగర్‌ బస్టాండు సమీపంలో శుక్రవారం ఉదయం చోటు చేసుకుంది. కాలనీకి చెందిన వెంకటరాముడు భవన నిర్మాణ కార్మికుడిగా, నాగజ్యోతి వాలంటీరుగా పని చేస్తూ జీవనం సాగించేవారు. వారికి విహన్యశ్రీ(5), జేష్టశ్రీ కుమార్తెలు ఉన్నారు. పెద్ద కుమార్తె విహన్యశ్రీ ఎల్‌కేజీ చదువుతోంది. నాగజ్యోతి ఇద్దరు కుమార్తెలకు స్నానం చేయించేందుకు స్నానపు గదిలోకి వెళ్లింది. అప్పటికే నీళ్లు వేడి చేసేందుకు వాటర్‌ హీటర్‌ను బకెట్‌లో వేసి ఉంచింది. దాన్ని చిన్నారి తాకడంతో ముగ్గురు విద్యుదాఘాతానికి గురై అపస్మారక స్థితిలోకి వెళ్లారు. ఎంత సేపటికి బయటకు రాకపోవడంతో వెంకటరాముడు, స్థానికుల సాయంతో తలుపులు పగులగొట్టి ముగ్గురిని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి విహన్యశ్రీ మృతి చెందినట్లు నిర్ధారించారు. అపస్మారక స్థితిలో ఉన్న నాగజ్యోతిని మెరుగైన చికిత్స కోసం పట్టణంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. చిన్న కుమార్తె జేష్టశ్రీ స్వల్ప గాయాలతో బయటపడింది. బాధితులు ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేసి విచారణ చేస్తామని పట్టణ ఎస్సై రామకృష్ణ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని