logo

వైకాపాకు మరో అవకాశం ఇస్తే.. అరాచక పాలనే

ఒక్క ఛాన్స్‌ పేరుతో ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన వైకాపాకు మరో ఛాన్స్‌ ఇస్తే రాష్ట్రంలో అరాచక పాలన సాగుతుందని మాజీ మంత్రి పరిటాల సునీత పేర్కొన్నారు.

Published : 28 Apr 2024 03:43 IST

మాజీ మంత్రి పరిటాల సునీత, శ్రీరామ్‌

బసినేపల్లిలో మాట్లాడుతున్న పరిటాల సునీత

చెన్నేకొత్తపల్లి, అనంతపురం (కళ్యాణదుర్గంరోడ్డు), న్యూస్‌టుడే: ఒక్క ఛాన్స్‌ పేరుతో ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన వైకాపాకు మరో ఛాన్స్‌ ఇస్తే రాష్ట్రంలో అరాచక పాలన సాగుతుందని మాజీ మంత్రి పరిటాల సునీత పేర్కొన్నారు. చెన్నేకొత్తపల్లి మండలం ఉప్పరవాండ్ల కొట్టాల, బసినేపల్లి, నాగసముద్రం గ్రామాల్లో శనివారం ఎన్నికల ప్రచార కార్యక్రమం నిర్వహించారు. ఆయా గ్రామాల్లో స్థానికులు, పార్టీ శ్రేణులు మాజీ మంత్రికి ఘనస్వాగతం పలికారు. తోపుదుర్తి సోదరుల నిరంకుశ ధోరణితో విసుగెత్తి ఆ పార్టీలోని అనేక మంది తెదేపాలో చేరుతున్నారన్నారు. దాన్ని జీర్ణించుకోలేని సోదరులు బెదిరింపులు, దౌర్జన్యాలు, దాడులకు పాల్పడుతున్నారని విమర్శించారు. తెదేపాకు వస్తున్న ఆదరణను ఓర్వలేక చెన్నేకొత్తపల్లి మండలం మేడాపురంలో తెదేపా సానుభూతిపరురాలు పసల రత్నమ్మ చీనీతోటకు నిప్పు పెట్టారని, నాగసముద్రంలో ఇటీవల తెదేపాలో చేరిన రైతు చంద్ర అరటి తోటకు నిప్పుపెట్టారని ధ్వజమెత్తారు. అదే గ్రామంలో పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు ఓబిలేశుపై కనగానపల్లి మండలం నుంచి వైకాపా గూండాలు వచ్చి దాడి చేశారని, ఎర్రోనిపల్లిలో దళితుడు గణేష్‌పై దాడికి యత్నించారన్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా తోపు సోదరులు, వారి అనుచరులు దాడులకు తెగబడ్డారని దుయ్యబట్టారు. వాటన్నింటికీ సమాధానం చెప్పే రోజు దగ్గరలోనే ఉందని నిప్పులు చెరిగారు. నియోజకవర్గంలో ఏ గ్రామానికి ప్రజలకు కనీసం తాగు నీళ్లిచ్చిన పాపాన పోలేదన్నారు.  

తెదేపాలోకి భారీగా చేరికలు

కనగానపల్లి మండలం కోనాపురం, చెన్నేకొత్తపల్లి మండలం కనుముక్కల, ముష్టికోవెల, ఆత్మకూరు, రాప్తాడు, అనంతపురం గ్రామీణం ఆకుతోటపల్లి, గ్రామాలకు చెందిన పలువురు వైకాపా నాయకులు శనివారం అనంతపురంలోని క్యాంప్‌ కార్యాలయంలో తెదేపాలో చేరారు. వారందరికీ సునీత, శ్రీరామ్‌, సీనియర్‌ నాయకుడు ఎల్‌ నారాయణచౌదరి పార్టీ కండువాలు వేసి ఆహ్వానించారు. అనంతరం సునీత, శ్రీరామ్‌ మాట్లాడుతూ.. 2019 ఎన్నికల్లో ప్రకాశ్‌రెడ్డిని ఎవరైతే గెలిపించారో వారే ఇప్పుడు ఆయన ఓటమి కోసం పనిచేస్తున్నారని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని