logo

జగన్‌ వీర బాదుడు

తాను అధికారంలోకి వస్తే అన్ని పెంచుకుంటూ పోతానని ప్రతిపక్ష నాయకుడిగా వైఎస్‌ జగన్‌ అన్నారు. బస్సు, కరెంటు ఛార్జీలను ఐదేళ్లపాటు పెంచుకుంటూ పోయారు.

Updated : 27 Mar 2024 05:20 IST

ఆస్తిపన్నుపై ఏటా 15 శాతం పెంపు
మూడేళ్లలో రెట్టింపు

తాను అధికారంలోకి వస్తే అన్ని పెంచుకుంటూ పోతానని ప్రతిపక్ష నాయకుడిగా వైఎస్‌ జగన్‌ అన్నారు. బస్సు, కరెంటు ఛార్జీలను ఐదేళ్లపాటు పెంచుకుంటూ పోయారు. ఆస్తి పన్ను, భూముల విలువ పెంచేశారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా చెత్తపన్ను వసూలు చేశారు. ఆఖరికి ఖాళీ స్థలాలపైనా పన్ను వేసి జనాల నడ్డి విరగ్గొట్టారు. పెంచుకుంటూ పోతానంటూ ఏ సంక్షేమ పథకాలో.. అభివృద్ధి పనులో అని ప్రజలు భావించారు. ఆయన ప్రతిపక్షంలో ఉండగా చెప్పిన మాటల్లో ఇంత అర్థం దాగి ఉందా అని పట్టణవాసులు వాపోతున్నారు.

ఈనాడు డిజిటల్‌, అనంతపురం -న్యూస్‌టుడే, అనంత నగరపాలక

గతంలో ఎప్పుడో ఒకసారి ఆస్తి పన్ను పెంచితేనే ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చేది. అధికార పగ్గాల చేపట్టిన జగన్‌ ఆస్తి పన్ను పెంచుకుంటూ వెళ్లారు. ఏటా 15 శాతం పెంచుతూ పట్టణ వాసులపై భారం మోపారు. గతంలో పురపాలిక మొత్తానికి ఒకే విధమైన పన్ను విధించేవారు. జగన్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత రిజిస్ట్రేషన్‌ విలువ బట్టి పన్ను విధిస్తున్నారు. దీనికితోడు నిర్మాణాల విలువ అమాంతం పెంచేశారు. అటు భవనాల రిజిస్ట్రేషన్‌ పరంగా బాదుతారు. ఇటు భవనాలు విలువ పెరిగింది కాబట్టి పన్ను పెంచేసి వసూలు చేస్తున్నారు. దీంతో యజమానులు అద్దె పెంచేస్తుండటంతో సామాన్యులకు ఇల్లు అందుబాటులో ఉండటం కష్టంగా మారింది.  ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబును విమర్శిస్తూ బాదుడే బాదుడు అంటూ దీర్ఘాలు తీసిన పెద్దమనిషి.. గద్దెనెక్కిన తర్వాత ఇంతలా బాదుతాడా... అని అనుకోలేదని పట్టణవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అనంత కార్పొరేషన్‌ కార్యాలయంలో ఆస్తి పన్ను చెల్లిస్తున్న నగర వాసులు

అనంత నగరంలో..

ఉమ్మడి జిల్లాల్లో ఏకైక నగరపాలిక అనంతపురం జనాభా 3.31 లక్షలు. పన్ను చెల్లిస్తున్న ఇళ్లు 61,829 ఉన్నాయి. ఓవైపు 15శాతం పెంచాలనే ప్రతిపాదన సిద్ధం చేస్తూనే.. మరోవైపు వడ్డీమాఫీ అంటూ ఎన్నికల ముందు తాయిలాలు ప్రకటించారు. ఈ సంవత్సరం పాత బకాయిలు కలిపి రూ.59.98 కోట్లు డిమాండ్‌ ఉండగా మంగళవారం వరకు రూ.28.18 కోట్లు వసూలు అయ్యాయి. 2020-21లో రూ.24.95 కోట్లు వసూలు చేయగా.. ఈఏడాది రూ.41.58 కోట్లు లక్ష్యంగా పెట్టుకున్నారు. మూడేళ్లలో నగర వాసుల నుంచి 16.63 కోట్లు అదనంగా వసూలు చేస్తున్నారు.

  • అనంత నగరం భాగ్యనగర్‌లోని రెండున్నర సెంట్లులో ఓ ప్రైవేటు ఉద్యోగి 2010లో ఇల్లు కట్టుకున్నారు. పైఅంతస్తు లేదు. ఆస్తిపన్ను పెంచక (01.04.2021) ముందు ఆయన రూ.1100 చెల్లించేవారు.ప్రస్తుతం రూ.1880 చెల్లించాల్సి ఉంటుంది. ఏప్రిల్‌ 1 నుంచి మరో 15 శాతం పెరుగుతుండగా అప్పటి నుంచి రూ.2107 చెల్లించాల్సి వస్తోంది. మూడేళ్లలోనే రెట్టింపు భారం పడింది. ఇలాంటి నివాసాలు నగరంలో వేలల్లోనే ఉన్నాయి.
  • అనంతపురంలోని సప్తగిరి కూడలి సమీపంలో 15ఏళ్ల క్రితం నిర్మించిన దుకాణ సముదాయానికి 2021లో రూ.48,825 పన్ను చెల్లించేవారు. 2022లో రూ.53,714, 2023లో రూ.54,788, 2024లో రూ.55,884 చెల్లించాల్సి వచ్చింది. ఏప్రిల్‌ 1 నుంచి 15 శాతం పెంచాలని ప్రతిపాదించారు. ఈమేరకు రూ.64,216 చెల్లించాల్సి ఉంటుంది. మూడేళ్లలోనే ఏకంగా 15,391 పన్ను పెరిగింది.
  • హిందూపురం పట్టణ జనాభా 1.70లక్షలు. పన్ను చెల్లించే నివాసాలు 33,749 ఉన్నాయి. 2021 ముందు వరకు ఏటా రూ.5.47 కోట్ల పన్ను వసూలు చేసేవారు. ఈసారి రూ.8.55 కోట్లు వసూలు చేయడానికి సిద్ధమయ్యారు. పురవాసులపై మూడేళ్లలో రూ.3 కోట్లకు పైగా భారం మోపారు.
  • కళ్యాణదుర్గం పురపాలికలో 60 వేలు మంది జనాభా ఉన్నారు. పన్ను చెల్లించే ఇళ్లు 12,015 ఉన్నాయి. 2020లో రూ.2.11 కోట్ల మేర పన్ను వసూలు చేసేవారు. 2021లో రూ.2.21 కోట్లు, 2022లో 2.26 కోట్లు, 2023లో 2.63 కోట్లు వసూలు చేశారు. ఈ ఏడాది ఏకంగా రూ.2.88 కోట్లకు పెంచారు. పురవాసుల నుంచి రూ.77 లక్షలు అదనంగా వసూలు చేస్తున్నారు.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని