logo

పురాలకు ప్రభుత్వ షాక్‌

నగరపాలక సంస్థలు, పురపాలికలకు ప్రభుత్వం షాకిచ్చింది. విద్యుత్తు ఛార్జీల బకాయిలకు 15వ ఆర్థిక సంఘం కింద మంజూరైన అన్‌టైడ్‌ నిధులు మళ్లించింది.

Published : 21 Mar 2023 03:02 IST

విద్యుత్తు బకాయిలకు నిధుల మళ్లింపు

సూళ్లూరుపేట పురపాలక సంఘ కార్యాలయం

సూళ్లూరుపేట, న్యూస్‌టుడే : నగరపాలక సంస్థలు, పురపాలికలకు ప్రభుత్వం షాకిచ్చింది. విద్యుత్తు ఛార్జీల బకాయిలకు 15వ ఆర్థిక సంఘం కింద మంజూరైన అన్‌టైడ్‌ నిధులు మళ్లించింది. దరిమిలా పారిశుద్ధ్యం, కాలువలు, రహదారుల నిర్వహణ పనులు ప్రశ్నార్థకం కానున్నాయి. ఇప్పటికే పంచాయతీల ఆర్థిక సంఘం నిధులు మళ్లించడంపై సర్పంచుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నా ప్రభుత్వ తీరు మారలేదు. ఇప్పుడు పురపాలక, నగరపాలక సంస్థల వంతు వచ్చింది.
* ఈఈఎస్‌ఎల్‌ కంపెనీకి ఎల్‌ఈడీ దీపాల ఏర్పాటు, నిర్వహణ తదితర ఖర్చుల కింద మరికొంత మొత్తాన్ని మినహాయించుకుంది. పలుచోట్ల ఎల్‌ఈడీ దీపాలు వెలగకపోయినా, నిర్వహణ లేకపోయినా చెల్లింపులు జరిగినట్లు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. వెంకటగిరిలో రూ.67,50,284, నగరిలో రూ.75,63,567, పలమనేరులో రూ.64,65,528 చెల్లించారు.
* స్థానికసంస్థల విద్యుత్తు బకాయిలను 15వ ఆర్థిక సంఘం నిధుల నుంచి నేరుగా సర్దుబాటు చేసుకునేలా ఆర్థికశాఖ ఉత్తర్వులు ఇవ్వడంతో ఆమేరకు డిస్కంకు బకాయిలు చెల్లిస్తున్నారు. జిల్లాలోని కొన్ని పురపాలక, నగరపాలక సంస్థలు ఎలాంటి పెండింగ్‌ లేకుండా క్రమం తప్పకుండా ప్రతినెలా విద్యుత్తు ఛార్జీలు చెల్లిస్తుండటంతో వాటి ఖాతాల నుంచి నిధులను మళ్లించలేదు.
* నగరపాలక సంస్థలు, పురపాలక సంఘాల అధికారులు ముందుచూపుతో వ్యవహరించి, పక్కా ప్రణాళికతో అడుగులు వేస్తే విద్యుత్తు ఛార్జీల చెల్లింపులు సమస్యేమీ కాదు. ప్రతినెలా చెల్లింపులు లేకపోవడంతో రూ.కోట్లలో బకాయిలు పేరుకుపోతున్నాయి. అటు ఆస్తిపన్ను వసూళ్లు సక్రమంగా లేక సిబ్బంది జీతాలు, విద్యుత్తు ఛార్జీల చెల్లింపుల్లో తీవ్రజాప్యం ఏర్పడుతోంది.  సాధారణ నిధులను పొదుపుగా వినియోగిస్తే ఎలాంటి ఇబ్బందులు ఏర్పడవు. నెలనెలా విద్యుత్‌ ఛార్జీలు, సిబ్బంది జీతాలను ఠంఛనుగా చెల్లించే వీలుంది. కొన్ని పురపాలక సంఘాల్లో సాధారణ నిధులను హారతి కర్పూరంలా చేయడంతో నిధుల సమస్య నెలకొంటోందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.


విద్యుత్తు ఛార్జీలు, ఈఈఎస్‌ఎల్‌ బకాయిలకు ఆర్థిక సంఘం నిధులను మళ్లించినట్లు పలువురు పురపాలక సంఘాల కమిషనర్లు ధ్రువీకరించారు. అన్‌టైడ్‌ నిధులను విద్యుత్తు ఛార్జీల చెల్లింపులకు వినియోగించుకోవచ్చని ఉత్తర్వులు ఉన్నాయన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని