logo

గుట్టచప్పుడు కాకుండా..

అధికార యంత్రాంగం మొత్తం ఎన్నికల విధుల్లో నిమగ్నం కావడంతో వైకాపా నేతలు అక్రమాలకు తెగబడుతున్నారు. తమ కనుచూపు మేరలో కనిపించిన ప్రభుత్వ భూములను కబ్జా చేయడంతోపాటు గుట్టలను చదును చేసి ఆక్రమిస్తున్నారు.

Published : 18 Apr 2024 02:15 IST

డీకేటీ పట్టాల పేరుతో చదును పనులు
ఎమ్మెల్యే చెవిరెడ్డి ఇలాకాలో వైకాపా నేతల ఆక్రమణ పర్వం

ఇప్పటికే చదును చేసిన గుట్ట ప్రాంతం

ఈనాడు-తిరుపతి: అధికార యంత్రాంగం మొత్తం ఎన్నికల విధుల్లో నిమగ్నం కావడంతో వైకాపా నేతలు అక్రమాలకు తెగబడుతున్నారు. తమ కనుచూపు మేరలో కనిపించిన ప్రభుత్వ భూములను కబ్జా చేయడంతోపాటు గుట్టలను చదును చేసి ఆక్రమిస్తున్నారు. ఇప్పటికే చంద్రగిరి నియోజకవర్గంలోని రామచంద్రాపురం మండలంలోని అనేక ప్రాంతాల్లోని గుట్టలను కొల్లగొట్టిన వైకాపా నేతలు ఇప్పుడు తాజాగా ఇదే మండలంలోని అనుపల్లి పంచాయతీ పరిధిలోని బొప్పరాజుపల్లెలో గుట్టలను జేసీబీ ద్వారా చదును చేస్తున్నారు. ఇక్కడ కొందరు రైతులకు 1982లో డీకేటీ పట్టాలిచ్చారు. అప్పటి నుంచి ఆభూముల్లోకి వారెవరూ వెళ్లడం లేదు. జాతీయ రహదారికి సమీపంలో ఉండటంతో చంద్రగిరి ప్రాంతానికి చెందిన ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి అనుచరులు ఇద్దరు వైకాపా ముఖ్య నేతల కన్ను ఈ భూములపై పడింది. బొప్పరాజుపల్లెలో డీకేటీ భూములతో పాటు పక్కనున్న గుట్టలను సైతం ఆక్రమిస్తున్నారు. కొన్ని రోజులుగా జేసీబీలతో చదును చేస్తున్నారు.

డీకేటీ కొంత.. ఆక్రమణ మరింత

ఇక్కడ 16 ఎకరాలకు మాత్రమే డీకేటీ పట్టాలు ఇచ్చారని తెలుస్తోంది. కానీ 30 ఎకరాల మేరకు చదును చేస్తున్నారు. ఈ స్థలాల ఆక్రమణకు ముందు నుంచే వైకాపా నేతలు పావులు కదిపారు. 2023లో కొన్ని భూములను అసైన్‌మెంట్‌ జాబితా నుంచి తొలగించారు. రైతుల నుంచి కొంత భూమిని కొని వారి అధీనంలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. మిగిలిన భూములకు కొంత ముట్టజెప్పి, ఇక్కడి గుట్టలను ఆక్రమించుకునేందుకు జేసీబీలకు పనిచెప్పారు.

కి.మీ. మేరకు రహదారి

బొప్పరాజుపల్లెకు వెళ్లే ప్రధాన రహదారిని ఆనుకుని గుట్ట ప్రాంతం వెనుక భాగాన్ని జేసీబీలతో చదును చేస్తున్నారు. ఈ ప్రాంతానికి వెళ్లేందుకు దారి లేకపోవడంతో జేసీబీలతో కి.మీ. మేరకు రహదారి ఏర్పాటు చేసుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని