logo

ఇక బెదిరేది లేదంటూ..

ఆస్తులు, భూములు లాక్కుంటారని, కుటుంబ సభ్యులపై దాడులకు తెగబడతారని, ఇతరత్రా బెదిరింపులకు గురి చేస్తారని ఇన్నాళ్లు భయపడుతూ వైకాపాలో నలిగిన నేతలు ఇప్పుడు నిర్భయంగా పార్టీ నుంచి బయటకు వస్తున్నారు.

Published : 18 Apr 2024 02:21 IST

వైకాపాను వీడి తెదేపా బాట
అధికార పార్టీకి పలు నియోజకవర్గాల్లో కోలుకోలేని దెబ్బ

ఆనం సమక్షంలో తెదేపాలో చేరిన వెంకటగిరి ఏఎంసీ ఛైర్మన్‌ భాస్కర్‌రావు

ఈనాడు - తిరుపతి: ఆస్తులు, భూములు లాక్కుంటారని, కుటుంబ సభ్యులపై దాడులకు తెగబడతారని, ఇతరత్రా బెదిరింపులకు గురి చేస్తారని ఇన్నాళ్లు భయపడుతూ వైకాపాలో నలిగిన నేతలు ఇప్పుడు నిర్భయంగా పార్టీ నుంచి బయటకు వస్తున్నారు. ఇప్పటికే శ్రీకాళహస్తి, వెంకటగిరి, సూళ్లూరుపేట నియోజకవర్గాల్లో  పలువురు తెదేపా కూటమిలో చేరారు. తాజాగా మరికొందరు ఇదే బాట పట్టడం వైకాపాకు శరాఘాతంగా మారుతోంది. నామినేషన్ల పర్వం పూర్తయ్యేనాటికి వైకాపాకు చెందిన మరికొందరు ముఖ్య నేతలు పార్టీ మారేందుకు సిద్ధమవుతున్నారు. సూళ్లూరుపేట నియోజకవర్గంలో ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్యపై మొదటి నుంచి పార్టీ నేతలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. వీరంతా చంద్రబాబు సమక్షంలో నెల్లూరులో నిర్వహించిన సభలో తెదేపాలో చేరారు. తాజాగా దామానెల్లూరు పంచాయతీ డేగవారికండ్రిగలో వైకాపా నేత పుట్టు రమణమూర్తి, మతకమూడిలో మునిరామిరెడ్డి ఆధ్వర్యంలో అనేకమంది తెదేపా కండువా కప్పుకొన్నారు. దొరవారిసత్రం మండలం నెల్లూరుపల్లి, ముచ్చలగుంట ఎస్సీ కాలనీకి చెందిన వైకాపా నేతలు, కార్యకర్తలు తెదేపాలో చేరారు. ఇలా ఒక్కొక్కరుగా పార్టీని వీడుతూ వస్తున్నారు. -వెంకటగిరి నియోజకవర్గంలో వెంకటగిరి, రాపూరు వ్యవసాయ మార్కెట్‌ కమిటీల ఛైర్మన్లు సింగంశెట్టి భాస్కరరావు, నోటి రమణారెడ్డి, పెంచలకోన ఆలయ ట్రస్టు బోర్డు తాజా మాజీ అధ్యక్షుడు చెన్ను తిరుపాల్‌రెడ్డి తెదేపా గూటికి చేరారు. రాపూరు, సైదాపురం జడ్పీటీసీ సభ్యులు చిగురుపాటి ప్రసన్న, పోలయ్య, బాలాయపల్లి, వెంకటగిరి మండల పరిషత్‌ ఉపాధ్యక్షులు మురళీరెడ్డి, సుధాకర్‌, వెంకటగిరి పుర కౌన్సిలర్లు కోటంరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి, నారి శేఖర్‌ తదితరులు తెదేపా కండువా కప్పుకొన్నారు. ఇన్నాళ్లూ వైకాపాలో ఉన్నప్పటికీ ఇప్పుడు తెదేపా తీర్థం పుచ్చుకున్నారు. వాస్తవానికి వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి రామ్‌కుమార్‌రెడ్డిని వ్యతిరేకిస్తూ నగరంలో పెద్ద ఎత్తున ద్విచక్ర వాహన ప్రదర్శన నిర్వహించారు. పార్టీ సీనియర్‌ నేత విజయసాయిరెడ్డిని కలిసి సైతం ఆయన్ను మార్చకుంటే సహకరించేది లేదని స్పష్టం చేశారు. పార్టీ మారేందుకు సిద్ధమైన వీరిలో అనేకమందికి వైకాపా ముఖ్య నేతల నుంచి బెదిరింపులు కూడా వచ్చాయి. భయపెట్టినా, తాయిలాలు ఇస్తామని చెప్పినా పార్టీలో కొనసాగేందుకు ఇష్టపడట్లేదు. మరోవైపు గ్రామగ్రామాన తెదేపాకు సానుకూలతలు ఉండటంతోపాటు ఎక్కడ చూసినా పార్టీ అధికారంలోకి వస్తుందన్న ధీమా ప్రజల్లో ఏర్పడటంతో వైకాపా నుంచి బయటకు వస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని