logo

121 గ్రామాల్లో రీ సర్వే పూర్తి

జిల్లాలో 121 గ్రామాల్లో భూముల రీసర్వే పూర్తయ్యిందని కలెక్టరు కృతికా శుక్లా పేర్కొన్నారు. పిఠాపురంలోని రెడ్డి రాజా కల్యాణ మండపంలో జగనన్న శాశ్వత భూహక్కు, భూ రక్ష పథకంలో భాగంగా రీ సర్వే పూర్తయిన గ్రామాల్లో రైతులకు భూ హక్కు పత్రాలను మంగళవారం పంపిణీ చేశారు.

Published : 07 Dec 2022 02:51 IST

పిఠాపురం: జిల్లాలో 121 గ్రామాల్లో భూముల రీసర్వే పూర్తయ్యిందని కలెక్టరు కృతికా శుక్లా పేర్కొన్నారు. పిఠాపురంలోని రెడ్డి రాజా కల్యాణ మండపంలో జగనన్న శాశ్వత భూహక్కు, భూ రక్ష పథకంలో భాగంగా రీ సర్వే పూర్తయిన గ్రామాల్లో రైతులకు భూ హక్కు పత్రాలను మంగళవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వందేళ్ల తరువాత రీ సర్వే జరిగిందన్నారు. డ్రోన్లు, రోవర్లు వినియోగించే సాంకేతిక పరిజ్ఞానంతో భూముల విస్తీర్ణం లెక్కించామన్నారు. జిల్లాలో 80 వేల మంది రైతులకు ఈ హక్కు పత్రాలు మంజూరయ్యాయని చెప్పారు. జిల్లాలో పిఠాపురంలోని నవఖండ్రవాడలో పైలెట్‌ ప్రాజెక్టుగా ఈ సర్వే ప్రారంభించి, 55 రెవెన్యూ గ్రామాలకు 48 గ్రామాల్లో సర్వే పూర్తి చేయడంతో 36 వేల మంది రైతులకు హక్కుపత్రాలు వచ్చాయన్నారు. వీటి పంపిణీకి ఈ రోజు నుంచే శ్రీకారం చుట్టామన్నారు. జేసీ ఇలక్కియా మాట్లాడుతూ వీటిలో లోపాలు గుర్తిస్తే ఆందోళన చెందవద్దన్నారు. తహసీల్దారు, ఆర్డీవో, డీఆర్వోల దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. ఎంపీ వంగా గీత, ఎమ్మెల్యే పెండెం దొరబాబు మాట్లాడుతూ సమగ్ర సర్వేతో రైతులకు భూ హక్కు పత్రాలు ప్రభుత్వం అందజేస్తోందన్నారు. భూముల కచ్చితత్వం తెలిపేందుకు ఈ ప్రాజెక్టును ముఖ్యమంత్రి అమల్లోకి తెచ్చారన్నారు. మిగిలిన గ్రామాల్లో సర్వే పూర్తి చేసి రైతులందరికీ ఈ పత్రాలు ఇస్తారన్నారు. ఈ కార్యక్రమంలో కాకినాడ ఆర్డీవో బీవీ రమణ, జిల్లా సర్వే, ల్యాండ్‌ రికార్డ్సు ఏడీ లక్ష్మీనారాయణ, తహసీల్దారు వరహాలయ్య, మున్సిపల్‌ కమిషనర్‌ రామ్మోహన్‌, ఎంపీపీలు కన్నాబత్తుల కామేశ్వరరావు, కారే సుధ, జడ్పీ వైస్‌ ఛైర్మన్‌ బుర్రా అనుబాబు, తదితరులు పాల్గొన్నారు.


చిరస్మరణీయుడు అంబేడ్కర్‌

అంబేడ్కర్‌ చిత్రపటానికి పూలమాల వేస్తున్న కలెక్టర్‌ కృతికాశుక్లా

కాకినాడ కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: భారత దేశానికి రాజ్యాంగాన్ని అందించిన అంబేడ్కర్‌ చిరస్మరణీయుడని కలెక్టర్‌ కృతికాశుక్లా కొనియాడారు. మంగళవారం కలెక్టరేట్‌లో బీఆర్‌ అంబేడ్కర్‌ 66వ వర్ధంతిని నిర్వహించారు. కలెక్టర్‌, సంయుక్త కలెక్టర్‌ ఇలక్కియ అంబేడ్కర్‌ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఆయన దేశానికి అందించిన సేవలను స్మరించుకున్నారు. బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి విశేష కృషి చేశారని అన్నారు. అంబేడ్కర్‌ ఆశయాలకు అనుగుణంగా దేశ ప్రగతికి మనవంతు కర్తవ్యాన్ని నిర్వర్తించాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. కార్యక్రమంలో కలెక్టరేట్‌ పరిపాలనాధికారి జీఎస్‌ఎస్‌ శ్రీనివాస్‌, వివిధ విభాగాధిపతులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని