logo

పట్టింపు లేక.. గుర్తింపు రాక

రాజమహేంద్రవరంలోని ఆచార్య ఎన్‌.జి.రంగా వ్యవసాయ కళాశాలకు అక్రిడిటేషన్‌(గుర్తింపు) విషయంలో ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ అగ్రికల్చర్‌ రిసెర్చ్‌(ఐసీఏఆర్‌) అభ్యంతరం తెలపడంపై ఇక్కడి విద్యార్థుల్లో ఆందోళన నెలకొంది.

Updated : 27 Jan 2023 06:20 IST

న్యూస్‌టుడే, వి.ఎల్‌.పురం (రాజమహేంద్రవరం)

ఎస్‌కేవీటీ డిగ్రీ కళాశాలలో వ్యవసాయ కళాశాల తరగతి నిర్వహణ

రాజమహేంద్రవరంలోని ఆచార్య ఎన్‌.జి.రంగా వ్యవసాయ కళాశాలకు అక్రిడిటేషన్‌(గుర్తింపు) విషయంలో ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ అగ్రికల్చర్‌ రిసెర్చ్‌(ఐసీఏఆర్‌) అభ్యంతరం తెలపడంపై ఇక్కడి విద్యార్థుల్లో ఆందోళన నెలకొంది. ఆచార్య ఎన్‌.జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయ పరిధిలోని ఆయా వ్యవసాయ కళాశాలల్లో ప్రమాణాల మేరకు ఐసీఏఆర్‌(ఐకార్‌) అక్రిడిటేషన్‌ ఇస్తుంది. ఇక్కడి వ్యవసాయ కళాశాలకు సొంత భవనాలు అందుబాటులోకి రాకపోవడం.. విద్యార్థులకు సరైన వసతి, సౌకర్యాలు లేవనే కారణాలతో ఐకార్‌ అక్రిడిటేషన్‌కు నిరాకరించినట్లు తెలుస్తోంది.

రాజమహేంద్రవరంలో ఎన్జీరంగా వ్యవసాయ కళాశాల 2008 నవంబరులో మంజూరైంది. అప్పటి నుంచి పరాయి పంచనే కొనసాగుతోంది. తొలుత 24 మంది విద్యార్థులతో నగరంలోని ప్రభుత్వ ఆర్ట్స్‌ కళాశాలలో తరగతులు ప్రారంభించారు. తర్వాత 2009 జూన్‌లో నగరంలోని ఎస్‌కేవీటీ డిగ్రీ కళాశాలకు తరలించి ఇక్కడి భవనంలోని పై అంతస్తులో 11 గదుల్లో వ్యవసాయ కళాశాల పరిపాలన విభాగం కార్యాలయాలు, ల్యాబ్‌, తరగతులు నిర్వహిస్తూ వస్తున్నారు. ప్రస్తుతం ఇక్కడ 350 మంది విద్యార్థులు నాలుగేళ్ల బీఎస్సీ ఆనర్స్‌ అగ్రికల్చర్‌ కోర్సు చదువుతున్నారు. హాస్టల్‌ సౌకర్యం లేకపోవడంతో బయట ప్రైవేటు వసతిగృహంలో విద్యార్థులు ఉండాల్సివస్తోంది.

2017లో శంకుస్థాపన చేసినా...

వ్యవసాయ కళాశాలకు నగర శివారు కాతేరు పరిధిలో 21 ఎకరాల వరకు  వ్యవసాయ క్షేత్రం ఉంది. అందులోనే సొంత భవనాల నిర్మాణానికి స్థలం కేటాయించారు. కళాశాల భవనం, విద్యార్థులకు రెండు హాస్టల్‌ భవనాల నిర్మాణానికి 2017లో శంకుస్థాపన చేశారు. రూ.24 కోట్ల అంచనా వ్యయంతో వీటిని నిర్మిస్తున్నారు. ఇందులో రూ.8 కోట్లు రాష్ట్ర ప్రభుత్వ నిధులు కాగా... మిగతా రూ.16 కోట్లు నాబార్డు కేటాయించింది. నిధుల మంజూరులో జాప్యం.. ప్రభుత్వం మారడం.. కొవిడ్‌ వ్యాప్తి.. బిల్లుల పెండింగ్‌ తదితర కారణాల వల్ల పనుల్లో తీవ్ర జాప్యం జరుగుతూ వస్తోంది. ఆరేళ్ల కిందటే శంకుస్థాపన జరిగినా నేటికీ పూర్తికాలేదు. పూర్తయిన నిర్మాణాలకు ఇంకా రూ.1.40 కోట్ల వరకు బిల్లులు పెండింగ్‌ ఉండిపోవడంతో పనులు ముందుకు సాగలేదు. ఏళ్లుగడుస్తున్నా సొంత భవనాలు లేకపోవడమే వల్లే కళాశాలకు అక్రిడిటేషన్‌ ఇచ్చేందుకు ఐసీఏఆర్‌ అభ్యంతరం తెలపడానికి ప్రధాన కారణంగా తెలుస్తోంది.

గుర్తింపు లేకుంటే ఇదీ ఇబ్బంది

కళాశాలకు ఐకార్‌ అక్రిడిటేషన్‌ లేకుంటే ఇతర రాష్ట్రాల్లోని విశ్వవిద్యాలయాల్లో పీజీ సీటు పొందే విషయంలో ఇబ్బందులు తప్పవు. గుర్తింపు ఇవ్వాలంటే సొంత భవనాలు, అన్ని సౌకర్యాలు ఉండి.. 75 ఎకరాల వ్యవసాయక్షేత్రం ఉండాలి. ఈ కళాశాలకు 21 ఎకరాల వరకే సొంత క్షేత్రం ఉండగా, విమానాశ్రయం సమీపంలో 58 ఎకరాల ఆలయ భూములను దీర్ఘకాలిక లీజుకు తీసుకున్నారు. ఇప్పటివరకు ఈ కళాశాలకు విశ్వవిద్యాలయం పేరుమీదనే ఐకార్‌ అక్రిడిటేషన్‌ పొందుతూ వచ్చారు. ఏళ్ల తరబడి సొంత భవనాలు సమకూరకపోవడంతో ఈసారి ఐసీఏఆర్‌ అభ్యంతరం తెలిపినట్లు సమాచారం.

రెండు నెలల్లో సొంత గూటికి..

విషయాన్ని కళాశాల అసోసియేట్‌ డీన్‌ శ్యామ్‌రాజ్‌నాయక్‌ వద్ద ప్రస్తావించగా... నిర్మాణాల పెండింగ్‌ బిల్లులన్నీ మంజూరు కావడంతో పనులు వేగవంతం చేశామన్నారు. రెండు నెలల వ్యవధిలోనే సొంత భవనాల్లోకి కళాశాల వెళ్లిపోతుందనీ.. నివేదికను కూడా ఐసీఏఆర్‌కు పంపిస్తున్నామన్నారు. అక్రిడిటేషన్‌ విషయంలో విశ్వవిద్యాలయం స్థాయిలోనూ చర్చిస్తున్నారనీ.. సమస్యఏమి లేదని, పీజీలో సీట్లు పొందే విషయంలో విద్యార్థులకు ఇబ్బంది ఉండదని, ఆందోళన చెందాల్సిన పనిలేదన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు