logo

నిధులు దూరం.. నిర్వహణ భారం

‘అమలాపురం నియోజకవర్గంలోని ఓ పాఠశాలకు విద్యార్థుల సంఖ్య ఆధారంగా రూ.75 వేల గ్రాంటు రావాలి. ఇప్పటివరకు 20 శాతం(రూ.15)వేలు) మాత్రమే విడుదలయ్యాయి. అవి పాఠశాల నిర్వహణకు ఏ మూలకూ సరిపోకపోవడంతో ప్రధానోపాధ్యాయుడు సొంత డబ్బు వెచ్చిస్తున్నారు.

Published : 20 Mar 2023 05:33 IST

- న్యూస్‌టుడే, అమలాపురం కలెక్టరేట్‌

అల్లవరం మండలం ఓడలరేవులోని జడ్పీ ఉన్నత పాఠశాల

‘అమలాపురం నియోజకవర్గంలోని ఓ పాఠశాలకు విద్యార్థుల సంఖ్య ఆధారంగా రూ.75 వేల గ్రాంటు రావాలి. ఇప్పటివరకు 20 శాతం(రూ.15)వేలు) మాత్రమే విడుదలయ్యాయి. అవి పాఠశాల నిర్వహణకు ఏ మూలకూ సరిపోకపోవడంతో ప్రధానోపాధ్యాయుడు సొంత డబ్బు వెచ్చిస్తున్నారు. నాడు-నేడు పథకంలో భాగంగా అదనపు తరగతి గదులు, విద్యుత్తు పంకాలు, ఆర్వో ప్లాంట్లు ఏర్పాటు చేయడంతో విద్యుత్తు బిల్లు అధికంగా వస్తోందని, చెల్లింపులకు ఇబ్బందికరంగా ఉంటోందని వాపోతున్నారు’.

అల్లవరం మండలంలోని ఓ జడ్పీ ఉన్నత పాఠశాలకు గత విద్యాసంవత్సరానికి సంబంధించి నిర్వహణ నిధులు ఒక్క రూపాయి కూడా రాలేదు. 2021-22 విద్యా సంవత్సరానికి ప్రధానోపాధ్యాయుడు ఖర్చుచేసి బిల్లులు సమర్చిస్తే.. అవి వెనక్కి తిరిగి వచ్చేశాయి. విద్యా సంవత్సరం ముగియడంతో నిధులు వెనక్కి మళ్లిపోవడమే అందుకు కారణం.

ఈ విద్యాసంవత్సరం మరో 40 రోజుల్లో ముగియవస్తున్నా.. పాఠశాలలకు కాంపోజిట్‌(నిర్వహణ) నిధులు పూర్తిస్థాయిలో విడుదల కాలేదు. పాఠశాలల ప్రారంభంలో నిర్వహణ నిధులను అయిదు విడతల్లో విడుదల చేస్తామని అధికారులు చెప్పినా ఇప్పటివరకు కేవలం ఒక విడత మాత్రమే ఇచ్చారు. దీంతో పాఠశాలల నిర్వహణ ప్రధానోపాధ్యాయులకు భారంగా మారింది. ఆఖరుకు సుద్దముక్కల కొనుగోలుకు కూడా గగనమవుతోందని వాపోతున్నారు. దీనికితోడు పాఠశాలల్లో నాబార్డు, నాడు-నేడు పథకంలో భాగంగా విద్యుత్తు సదుపాయం, ఇతర వసతులు సమకూర్చడంతో నిర్వహణ వ్యయం పెరిగింది.

జిల్లాలో ఇలా..

జిల్లావ్యాప్తంగా ఉన్నత, ప్రాథమికోన్నత, ప్రాథమిక పాఠశాలలు కలిపి మొత్తం 3,513 ప్రభుత్వ బడులున్నాయి. వీటిలో సుమారు 1,18,206 మంది చదువులు సాగిస్తున్నారు. ఈ సంవత్సరం పాఠశాల నిర్వహణ పద్దు కింద జిల్లాకు రూ.4.45 కోట్లు రావాల్సిఉండగా ఇప్పటివరకు కేవలం రూ.89 లక్షలు మాత్రమే విడుదల చేశారు. వీటితో బోధనకు అవసరమైన సామగ్రి, గ్రంథాలయం, స్టేషనరీ, ప్రయోగశాల నిర్వహణ, విద్యుత్తు బిల్లులు, పరీక్షలు తదితర అవసరాల నిమిత్తం ఖర్చు చేయాల్సిఉంది. గతంలో ఈ నిధులు పాఠశాలలు ప్రారంభమైన తొలినాళ్లలోనే రెండు విడతల్లో పూర్తిస్థాయిలో ఇచ్చేవారు. కొంత ఆలస్యమైనా ఉపాధ్యాయులు ఖర్చుచేసి బిల్లు వచ్చాక తీసుకునేవారు. ప్రస్తుతం ఎనిమిది నెలల కాలంలో కేవలం 20 శాతం మాత్రమే ఇచ్చి నెలన్నర వ్యవధిలో మిగిలిన 80 శాతం మంజూరు చేయడం అనుమానమేనని ఉపాధ్యాయులు పేర్కొంటున్నారు.

కేటాయింపు ఇలా..

ప్రభుత్వ పాఠశాలల్లో రోజువారీ నిర్వహణ ఖర్చుల కింద ప్రభుత్వం నుంచి ఏటా పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల సంఖ్యనుబట్టి నిధులు మంజూరవుతాయి. 1 నుంచి 30 లోపు విద్యార్థులుంటే రూ.10 వేలు, 30 నుంచి 100 మందికి రూ.25 వేలు, 100 నుంచి 250 ఉంటే రూ.50 వేలు, 250 నుంచి 1000 మందికి రూ.75 వేలు, అంతకన్నా ఎక్కువ సంఖ్యలో విద్యార్థులుంటే రూ.లక్ష ఇవ్వాలి. పాఠశాల సముదాయాలకు రూ.25 వేలు, మండల విద్యాశాఖాధికారి కార్యాలయానికి రూ.75 వేల నుంచి రూ.1.25 లక్షల వరకు విడుదల చేస్తారు.

విద్యార్థుల సంఖ్య ఆధారంగా..

రాష్ట్రంలో ఆర్థిక లోటుతో కాసుల కష్టం వెంటాడుతున్న నేపథ్యంలో పూర్తిస్థాయిలో నిధులు ఒకేసారి విడుదల చేయలేదు. ఆయా పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల సంఖ్యనుబట్టి జనవరిలో నిధులు విడుదలచేసినట్లు అధికారులు చెబుతున్నారు. ఒక్కో పాఠశాలకు రూ.2 వేలు, రూ.5 వేలు, రూ.10 వేలు, రూ.25 వేలు ఇలా కేటాయించారు. ఇటీవల సమగ్ర శిక్ష నుంచి వచ్చిన నిధులను 20 శాతంలోపే సీఎఫ్‌ఎంఎస్‌ ఖాతాలో జమ చేశారు.

సర్దుబాటు ఎలాగని ప్రశ్న..

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా సామగ్రి కొనుగోలు, పారిశుద్ధ్యం, విద్యుత్తు బిల్లుల చెల్లింపు వంటివాటికి ఇప్పటికే ఆయా పాఠశాలల్లో బోధన చేస్తున్న ఉపాధ్యాయులు తమ సొంత డబ్బులు ఖర్చు చేశారు. సకాలంలో బిల్లులు అందకపోవడంతో దిక్కులు చూడాల్సిన పరిస్థితి. పూర్తిస్థాయిలో విడుదలైతే తాము ఖర్చుచేసిన డబ్బులు తీసుకోవచ్చనుకున్నవారికి నిరాశే ఎదురైంది. విద్యా సంవత్సరం ముగిసేలోపు నిర్వహణ నిధులు విడుదలకాకపోతే తరువాతి ఏడాది విడుదలయ్యే అవకాశం లేదు. దీంతో ఇప్పటివరకు ఖర్చుచేసిన ప్రధానోపాధ్యాయుల్లో కలవరం మొదలైంది. తాము పెట్టిన డబ్బులు వస్తాయా, రావా అన్న అనుమానం వెంటాడుతోంది.


ఒక విడత మాత్రమే విడుదలయ్యాయి

జిల్లావ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలకు నిర్వహణ నిధులు ఇప్పటివరకు ఒక విడత మ్రాతమే విడుదలయ్యాయి. త్వరలోే విడుదల చేసే అవకాశం ఉంది. ప్రస్తుత విద్యాసంవత్సరం ముగుస్తున్న నేపథ్యంలో ఉన్నతాధికారులకు నివేదిస్తాం. నిర్వహణ నిధులు విడుదలయ్యేలా కృషి చేస్తాం.

కమలకుమారి, జిల్లా విద్యాశాఖాధికారి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని