logo

మొర వినరా.. మము దయగనరా.

ఒక్కొక్కరిదీ ఒక్కో సమస్య... స్థానికంగా పరిష్కారం దొరక్క రోజుల తరబడి స్థానిక అధికారుల చుట్టూ తిరిగినా ఫలితంలేక.. వ్యయప్రయాసలకోర్చి జిల్లా నలుమూలల నుంచి అనేకమంది కలెక్టరేట్‌కు తరలివచ్చారు.

Published : 28 Mar 2023 05:35 IST

కలెక్టరేట్‌లో ప్రజల నుంచి అర్జీలు స్వీకరిస్తున్న అధికారులు

వి.ఎల్‌.పురం(రాజమహేంద్రవరం): ఒక్కొక్కరిదీ ఒక్కో సమస్య... స్థానికంగా పరిష్కారం దొరక్క రోజుల తరబడి స్థానిక అధికారుల చుట్టూ తిరిగినా ఫలితంలేక.. వ్యయప్రయాసలకోర్చి జిల్లా నలుమూలల నుంచి అనేకమంది కలెక్టరేట్‌కు తరలివచ్చారు. తమ గోడు నేరుగా ఉన్నతాధికారులకు చెప్పుకొంటే న్యాయం జరుగుతుందనే ఆశతో అర్జీలు అందించారు. తన భూమిని వేరొకరి పేరున రెవెన్యూ దస్త్రాల్లో నమోదు చేశారని ఒకరు.. జగనన్న కాలనీ కోసమని ఏడాది కిందట ప్రభుత్వం తీసుకున్న తన భూమికి ఇప్పటివరకు పరిహారం అందలేదంటూ ఇంకొకరు... భూఆక్రమణలపై మరికొందరు.. పింఛన్లు, ఇతర ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందటం లేదంటూ ఇంకొందరు.. ఉన్నతాధికారుల ఎదుట మొర పెట్టుకున్నారు. సోమవారం కలెక్టరేట్‌లో జరిగిన స్పందన కార్యక్రమంలో మొత్తం 113 మంది అర్జీలు అందించారు. జిల్లా సంయుక్త కలెక్టర్‌ తేజ్‌భరత్‌, డీఆర్వో నరసింహులు, పర్యాటక ప్రాంతీయ మేనేజర్‌ స్వామినాయుడు ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ స్పందనలో వచ్చిన ప్రతి అర్జీ నిర్ణీత కాలవ్యవధిలో పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు. అర్జీదారుడు సంతృప్తిపడేలా వారి సమస్యలకు పరిష్కారం చూపాలంటూ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. ఇప్పటివరకు జిల్లాలో 400 అర్జీలు పెండింగ్‌లో ఉన్నాయని, వీటిలో 31  మళ్లీ వచ్చాయన్నారు. స్పందన అర్జీల పరిష్కారం విషయంలో ఏ ఒక్కరూ నిర్లక్ష్య ధోరణి ప్రదర్శించకుండా జవాబుదారీతనంతో వ్యవహరించాలని అధికారులకు జేసీ స్పష్టం చేశారు.


పరిహారం ఇవ్వలేదు

నా పేరు టి.రాంబాబు. మాది రాజానగరం మండలం భూపాలపట్నం. జగనన్న కాలనీ కోసం గ్రామంలో సుమారు 4 ఎకరాలు రైతుల నుంచి ప్రభుత్వం భూమి తీసుకుంది. దానిలో నా భూమి 16 కుంచాలు ఉంది. ఆయిల్‌పామ్‌ సాగు చేస్తూ దానిపైనే ఆధారపడి జీవనం సాగిస్తుండగా ఎకరానికి రూ.55 లక్షల చొప్పున ఇస్తామని చెప్పారు. అధికారులు భూదస్త్రాలు కూడా తీసుకెళ్లారు. ఏడాది అవుతున్నా పరిహారం మాత్రం రాలేదు. గతంలో చేసిన అప్పులు తీర్చడానికి బయట మళ్లీ రూ.10 లక్షలు అప్పు తెచ్చి వడ్డీలు కట్టలేక అవస్థలు పడుతున్నాను. భూపరిహారం డబ్బుల కోసం స్థానిక అధికారులను అడుగుతుంటే అదిగో.. ఇదిగో.. అంటున్నారే తప్ప డబ్బులు మాత్రం ఇప్పటివరకు పడలేదు. ప్రభుత్వం పరిహారం సొమ్ము ఇవ్వకపోతే నా భూమిని తిరిగి ఇచ్చేయాలని కోరుతూ ఉన్నతాధికారులకు అర్జీ ఇచ్చాను. ఇకనైనా ప్రభుత్వం మాకు న్యాయం చేయాలని కోరుతున్నా.


నా భూమిని వేరొకరి పేరున మార్చేశారు

మాది (గంగుల దుర్గారావు) దేవరపల్లి మండలం రామన్నపాలెం. 31 సెంట్ల నా భూమిని వేరొకరి పేరిట రెవెన్యూ అధికారులు మార్చేశారు. ఆ భూమికి సంబంధించి నా పేరున పాస్‌ పుస్తకం జారీ అయి ఆన్‌లైన్‌లో కూడా నమోదై ఉంది. నాకు తెలియకుండా, ఎలాంటి నోటీసు ఇవ్వకుండా ఇటీవల రెవెన్యూ దస్త్రాల్లో నా భూమిని వేరొకరి పేరుతో నమోదుచేశారు. దీనిపై అక్కడి రెవెన్యూ అధికారులను అడుగుతుంటే సరైన సమాధానం చెప్పడంలేదు. వేరొకరితో లాలూచీ పడి రెవెన్యూ అధికారులు నాకు అన్యాయం చేస్తుండటంపై ఈ నెల 6నే కలెక్టరేట్లోని జిల్లాస్థాయి స్పందనలో అర్జీ ఇచ్చినప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి స్పందన లేదు. దీనిపై విచారణ జరిపించి నాకు న్యాయం చేయాలని ఉన్నతాధికారులను కోరేందుకు మళ్లీ ఇక్కడికి వచ్చాను. అధికారులు విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని