logo

‘చీర అందిందా? బాగుందా? ఓటు మాకేనా?’

అంతా బాగున్నారా? చీర అందిందా? బాగున్నాయా? సంతోషమేనా.. ఓటు మాకేనా ? మర్చిపోకండి..? ఇదీ రాజమహేంద్రవరం ఎంపీ, ప్రస్తుత అర్బన్‌ నియోజకవర్గ వైకాపా అభ్యర్థి భరత్‌రామ్‌ ఇంటింటి ప్రచారం తీరు.

Published : 30 Mar 2024 05:03 IST

ఇంటింటి ప్రచారంలో ఎంపీ భరత్‌రామ్‌

వి.ఎల్‌.పురం(రాజమహేంద్రవరం), న్యూస్‌టుడే: అంతా బాగున్నారా? చీర అందిందా? బాగున్నాయా? సంతోషమేనా.. ఓటు మాకేనా ? మర్చిపోకండి..? ఇదీ రాజమహేంద్రవరం ఎంపీ, ప్రస్తుత అర్బన్‌ నియోజకవర్గ వైకాపా అభ్యర్థి భరత్‌రామ్‌ ఇంటింటి ప్రచారం తీరు. ఓటర్లను మభ్యపెట్టేలా సాగిన ఈ ప్రచారానికి సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. నగరంలో ఇప్పటికే 29, 32, 33, 40వ డివిజన్లలో ఎన్నికల ప్రచారం చేసిన వైకాపా ప్రజాప్రతినిధులు, నాయకులు ఎన్నికల కమిషన్‌ నిబంధనలు ఉల్లంఘిస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కోడ్‌ అమలులోకి రాకముందు నుంచే ఓటర్లను ప్రలోభపెట్టే ప్రయత్నాలు మొదలు పెట్టిన అధికార పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు ఇప్పటికే నగరంలోని ఆయా డివిజన్లలో చీరల పంపిణీ చేశారు. ఇంటింటి ప్రచారాలు సాగిస్తున్న ఎంపీ.. మహిళా ఓటర్లను చీరలు అందాయా? అవి బాగున్నాయా? ఓటు మాకేనా? అని అడుగుతుండడం చర్చానీయాంశంగా మారింది. కోడ్‌ అమల్లోకి వచ్చిన తర్వాత ఈనెల 19న డివిజన్‌ పర్యటన పేరిట 32వ డివిజన్‌లో స్థానిక పార్టీ నాయకులతో కలిసి ఎంపీ ఇంటింటికీ వెళ్లి ప్రచారం చేసినట్లు భోగట్టా. ఇదే డివిజన్‌లో ఒక మహిళ.. హామీ పత్రం ఇచ్చినా ఇంటి పట్టా రాలేదని అనడంతో ఆనం కళాకేంద్రం వద్ద పట్టాలు పంపిణీ చేసినప్పుడు ఎందుకు రాలేదని ఎంపీ ప్రశ్నించారు. తన పేరు లేదని, వాలంటీరును అడిగినా ఏం చెప్పడం లేదని ఆమె అనడంలో సచివాలయానికి వెళ్లి ఎన్ని పట్టాలు ఆగిపోయాయో దగ్గరుండి చేయించాలని పార్టీ డివిజన్‌ ఇన్‌ఛార్జికి ఎంపీ సూచిస్తున్నట్లు ఆ వీడియోలో ఉండడం గమనార్హం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని