logo

బటన్‌ నొక్కి జగన్‌ ఎంత డబ్బు వెనకేశారు?

ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి అయిదేళ్ల పాటు బటన్‌ నొక్కి పేదలకు డబ్బులు పంపిణీ చేశానని చెబుతున్నారని, అదే బటన్‌ నొక్కి ఆయన ఇంకెంత వెనకేసుకున్నారని వంగవీటి రాధా ప్రశ్నించారు. రాజమహేంద్రవరంలో మంగళవారం సాయంత్రం ఆయన పర్యటించారు

Published : 24 Apr 2024 06:28 IST

సీఎంకి వంగవీటి రాధా ప్రశ్న

 మాట్లాడుతున్న వంగవీటి రాధా, చిత్రంలో భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి, ఆదిరెడ్డి శ్రీనివాస్‌

 రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ, న్యూస్‌టుడే: ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి అయిదేళ్ల పాటు బటన్‌ నొక్కి పేదలకు డబ్బులు పంపిణీ చేశానని చెబుతున్నారని, అదే బటన్‌ నొక్కి ఆయన ఇంకెంత వెనకేసుకున్నారని వంగవీటి రాధా ప్రశ్నించారు. రాజమహేంద్రవరంలో మంగళవారం సాయంత్రం ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా తెదేపా, జనసేన, భాజపా కూటమి ఆధ్వర్యంలో సాయికృష్ణా థియేటర్‌ వద్ద ఏర్పాటు చేసిన వేదికపై మాట్లాడారు. పేదల పేరుతో రాష్ట్రాన్ని దోచేశారన్నారు. అన్యాయాలను ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు బనాయించి వేధించారన్నారు. ప్రజల మద్దతు కోరుకున్న వారే ఎప్పుడూ అధికారంలో ఉండగలరన్నారు. భయపెట్టి పాలన చేస్తే ఎన్నికల్లో ఓటమి తప్పదన్నారు. ప్రజాసంక్షేమం చూసే వారికే ఎన్నికల్లో ఓటువేసి గెలిపించాలన్నారు. ఎంతోమంది నాయకులు పవన్‌కల్యాణ్‌ కేవలం 21 సీˆట్లు మాత్రమే తీసుకొన్నారని విమర్శిస్తున్నారని, రాజకీయాల్లో ఎన్ని సీట్లు తీసుకొన్నారని ముఖ్యం కాదని, ఆయన పిలుపు ఇస్తే ఎంతమంది కదిలి వస్తున్నారనేదే ముఖ్యమన్నారు. జగన్‌ ముఖ్యమా, జనం ముఖ్యమా అని ఆలోచించారు కాబట్టే పవన్‌కల్యాణ్‌ కూటమికి మద్దతిచ్చి ఎన్నికల్లో పోటీకి దిగుతున్నారన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో సామాజిక మాధ్యమాల్లో పోస్టింగ్‌లు పెడితే కేసులు పెడుతున్నారని, వాళ్లకు నచ్చకపోతే వ్యాపారాలు చేయనివ్వని పరిస్థితి ఉందన్నారు. భాజపా నాయకులను గెలిపిస్తే కేంద్రంతో మాట్లాడి నిధులు ఇప్పించే బాధ్యతలు తీసుకొంటారన్నారు. రానున్న మూడు వారాలు కూటమి అభ్యర్థుల కోసం కార్యకర్తలు పనిచేయాలన్నారు. వంగవీటి రంగా చెప్పినట్లు చేయిచేయి కలుపు.. చేయి జారదు గెలుపు అనే నినాదంతో ముందుకెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. రాజమహేంద్రవరం ఎంపీˆ  అభ్యర్థి దగ్గుబాటి పురందేశ్వరి మాట్లాడుతూ రాష్ట్రంలో అణగారిన వర్గాల అభ్యున్నతికి తెదేపా, జనసేన, భాజపా కూటమిగా ఏర్పడ్డాయన్నారు. ఎన్నికల్లో గెలిపించాలని కోరారు. బలానవర్గాల అభ్యున్నతికి వంగవీటి రంగా పాటుపడ్డారన్నారు. తండ్రి చూపిన బాటలో రాధా నడుస్తున్నారన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రంలో మార్పు రావాలన్నారు. తనను స్థానికురాలు కాదని ప్రచారం చేస్తున్నారని, ఇందులో ఏమాత్రం అర్థం లేదన్నారు. స్థానికంగా ఎన్నికైన నేతలు ఏం అభివృద్ధి చేశారని ప్రశ్నించారు. గోదావరి ప్రక్షాళనకు ఏ చర్యలు తీసుకొన్నారన్నారు. కేంద్రం గోదావరి పరిశుభ్రతకు నిధులు ఇస్తే రాష్ట్రం స్పందించడం లేదన్నారు. కేవలం రంగులు వేసి గొప్పలు చెప్పుకోవడం తగదన్నారు. కనీసం స్వచ్ఛమైన తాగునీరు కూడా ఇవ్వలేని పరిస్థితి ఉందన్నారు. సర్వేల్లో మళ్లీ మోదీ వస్తారని తేలిందన్నారు. ఇక్కడ కూడా ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఎన్నిక కావాల్సి ఉందన్నారు. పలువురు కూటమి నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని