logo

వైకాపా పాలన అంతమొందిద్దాం

జగన్‌ పరిపాలనను అంతమొందిద్దాం.. పిడికిలి బిగించి మరీ కూటమిని గెలిపించుకుందామని జనసేన అధినేత పిలుపునిచ్చారు. పిఠాపురం నియోజకవర్గం యు.కొత్తపల్లి మండలం ఉప్పాడలో మంగళవారం రాత్రి జరిగిన సభలో ప్రసంగించారు.

Published : 24 Apr 2024 07:05 IST

తీరంలో కోత నివారించలేరు.. హార్బర్‌, జెట్టీలు కట్టలేరు.
అయిదేళ్లలో ఈ ప్రభుత్వం ఏం చేసింది?
ఉప్పాడ బహిరంగ సభలో జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌
ఈనాడు, కాకినాడ- న్యూస్‌టుడే, కొత్తపల్లి, పిఠాపురం

జాతీయ జెండాతో జనసేనాని

  • ఉప్పాడ కొత్తపల్లి మండలంలోని అమీనాబాద్‌ తీరం.. 20వేల మంది మత్స్యకారులున్న ఈ ప్రాంతంలో ఫిషింగ్‌ హార్బర్‌ కావాలి.. రూ.422 కోట్ల బడ్జెట్‌.. మంత్రి సీదిరి అప్పలరాజు పనులు ప్రారంభించారు.. 30 శాతం పూర్తిచేసి ఆపేశారు.. రాళ్లతో నింపేశారు. హార్బర్‌ పూర్తిచేయలేదు. రాళ్లదెబ్బలకు బోట్లు పాడయ్యాయి. ఇద్దరు చనిపోయారు. అయినా ఈ ప్రభుత్వానికి పట్టదు..బాధ్యత లేదు.

  • రాష్ట్రం మొత్తంమీద జన సైనికులకు చెబుతున్నా.. జనసేన బలం ఉన్నచోట కూటమి అభ్యర్థులకు ఓటు బదిలీ జరగాలి.. తెదేపా జనసేన కోసం ఎంత బలంగా నిలబడిందో వర్మ సజీవ సాక్ష్యం. కూటమి అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించుకుందాం..

కాకినాడ జిల్లా ఉప్పాడలో నిర్వహించిన వారాహి విజయభేరి సభలో జనసేనాని


జగన్‌ పరిపాలనను అంతమొందిద్దాం.. పిడికిలి బిగించి మరీ కూటమిని గెలిపించుకుందామని జనసేన అధినేత పిలుపునిచ్చారు. పిఠాపురం నియోజకవర్గం యు.కొత్తపల్లి మండలం ఉప్పాడలో మంగళవారం రాత్రి జరిగిన సభలో ప్రసంగించారు. ‘సమస్యల పరిష్కారానికి మాటిస్తున్నా. నేను ఒక మాట చెప్పానంటే తల ఎగిరిపోవాలి గానీ మాట వెనక్కి తీసుకోను.. తప్పు జరిగితే క్షమించమంటాను. మీరు రాళ్లు విసిరినా నేను స్వీకరిస్తా’నని అన్నారు.

మీ ప్రేమ ఎంత చల్లగా ఉందో..

‘పౌర్ణమి రోజున కొత్తపల్లి ఉప్పాడ మండలంలో ఇంత వేడిలో కూడా మీ ప్రేమ ఎంత చల్లగా ఉందో ఆ వెన్నెలే చెబుతోంది. మీ ప్రేమామృతం మామీద, మా కూటమిపై కురిపిస్తున్నందుకు ధన్యవాదాలు.. నన్ను ప్రేమించే నా పిఠాపురం ప్రజల మధ్యలో లక్ష మంది వరకు వచ్చి నామినేషన్‌ రోజున మద్దతు తెలిపారు. ఎమ్మెల్యేగా చేసి, ప్రజల మన్ననలు పొంది కూటమి ధర్మం ప్రకారం నాకోసం త్యాగం చేసిన వర్మకు కృతజ్ఞతలు’ అని పవన్‌ అన్నారు.

అభివృద్ధి చేయకుండా వదిలేశారు.

‘‘ప్రకృతి సంపద.. ఒకవైపు సముద్ర తీరం..ఇంకోవైపు పచ్చని పొలాలు.. మరోవైపు అభివృద్ధికి కావాల్సినంత సహజవనరులు, కష్టపడ్డామని గుండెలమీద చెయ్యేసుకుని చెప్పే యువత.. అభివృద్ధి లేకుండా ఈ ప్రాంతం ఉండడం నాకు మనస్కరించలేదు. నాకు ఇష్టమైనవి రెండు.. వ్యవసాయం, దైవభక్తి.. అన్ని మతాలమీద గౌరవం ఉంది.. అన్ని ధర్మాలను గౌరవిస్తాను. ’ అని పేర్కొన్నారు.

కోత సమస్యకు పరిష్కారం చూపుతాం..

‘ఉప్పాడ తీరంలో వందేళ్లలో 320 ఎకరాలు కోతకు గురయ్యింది. ఉప్పెన సినిమాలో ఇల్లుకూడా కోతకు గురై సముద్రంలో కలిసిపోయింది. ఇక్కడి కోతను అరికడతాం..సాంకేతిక నిపుణులతో చర్చించి సమస్యకు పరిష్కారం చూపుతాం’ అని పవన్‌ అన్నారు. సమావేశంలో తెదేపా మాజీ ఎమ్మెల్యే ఎస్‌.వి.ఎస్‌.ఎన్‌.వర్మ, కాకినాడ ఎంపీ అభ్యర్థి ఉదయ్‌ శ్రీనివాస్‌, భాజపా ఇన్‌ఛార్జి బుర్రా కృష్ణంరాజు పాల్గొన్నారు.

గురువుల గ్రామానికి ఏం సమాధానం చెబుతారు..?

‘ఈ ప్రభుత్వం డీఎస్సీ నోటిఫికేషన్‌ ఇవ్వలేదు. కొత్తపల్లి ఉప్పాడ మండలంలో నాగులపల్లి గ్రామం ఉంది. ఇక్కడ 200 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు ఉన్నారు. ఇతర శాఖల్లో 50 మంది పనిచేస్తున్నారు. ఇక్కడి యువతీయువకుల కల టీచర్‌ కావడం.. వీరికి ప్రభుత్వం ఏం సమాధానం చెబుతుంద’ని పవన్‌ ప్రశ్నించారు. మేము రాగానే మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల చేస్తామని హామీ ఇచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని