logo

జగన్‌ను నమ్మకండి: గిడుగు

ఒక్క అవకాశం అంటూ అధికారంలోకి వచ్చి ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చని వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని నమ్మొద్దని కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ అభ్యర్థి గిడుగు రుద్రరాజు పిలుపునిచ్చారు.

Published : 28 Apr 2024 03:53 IST

దేవీచౌక్‌: ఒక్క అవకాశం అంటూ అధికారంలోకి వచ్చి ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చని వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని నమ్మొద్దని కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ అభ్యర్థి గిడుగు రుద్రరాజు పిలుపునిచ్చారు. ప్రజలు వైఎస్‌ఆర్‌ తనయుడిగా అవకాశం ఆయనకు ఇచ్చారన్నారు. నవరత్నాలు అంటూ పెద్దపెద్ద వాగ్దానాలు చేసి చివరకు వాటిని నవమోసాలుగా మార్చారని విమర్శించారు. శనివారం రాజమహేంద్రవరంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పోలవరానికి కాంగ్రెస్‌ హయాంలోనే రూ.5 వేల కోట్లు ఖర్చుచేస్తే దాన్ని ప్రస్తుతం తిరోగమనానికి తీసుకువచ్చారన్నారు. సంపూర్ణ మద్యనిషేధం అనిచెప్పి తన బంధువులు, కావాల్సిన వారికి తయారీ యూనిట్లు ఇచ్చి ఆదాయ వనరుగా మార్చేశారన్నారు. చిన్నచిన్న టీ దుకాణాల్లో కూడా నగదు బదిలీ ఉంటే ప్రభుత్వ మద్యం దుకాణాల్లో మాత్రం డబ్బులు ఇచ్చి కొనుక్కోవాలన్నారు. మెగా డీఎస్సీ అంటూ దగా చేశారన్నారు. జాబ్‌ క్యాలెండర్‌ అమలు చేయలేదని, ఎస్సీ, ఎస్టీలకు చెందిన 27 పథకాలను ఎత్తివేశారని విమర్శించారు. మళ్లీ ఎన్నికల మేనిఫెస్టోతో మోసం చేసేందుకు వస్తున్నారన్నారు. జగన్‌ భాజపాతో చీకటి ఒప్పందం చేసుకున్నారని ఆరోపించారు. రిజర్వేషన్లు తీసివేస్తామని అమిత్‌ షా చెప్పారని, అటువంటప్పుడు భాజపాకు తొత్తుగా వ్యవహరిస్తూ మైనార్టీ, ఎస్సీ, ఎస్టీలకు ఏవిధంగా న్యాయం చేస్తారని ప్రశ్నించారు. రిజర్వేషన్లపై తన వైఖరి ఏమిటో సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. పలువురు నేతలు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని