logo

ఇక మరిన్ని వైద్య సేవలు

నరసరావుపేటలోని ఏరియా ప్రభుత్వ వైద్యశాల కలెక్టరేట్‌ రోడ్డులోని నూతన భవనంలోకి మార్చేందుకు అధికారులు సన్నాహాలు పూర్తి చేశారు. పాత భవనంలో వసతులు చాలక లింగంగుంట్ల కాలనీలోని జల వనరుల శాఖకు చెందిన స్థలంలో భవనాన్ని నిర్మించారు.

Published : 08 Oct 2022 04:23 IST

ఆధునిక చికిత్సలకు ఏర్పాట్లు

నరసరావుపేట అర్బన్‌, న్యూస్‌టుడే

నరసరావుపేటలో ప్రభుత్వ వైద్యశాల భవనం

నరసరావుపేటలోని ఏరియా ప్రభుత్వ వైద్యశాల కలెక్టరేట్‌ రోడ్డులోని నూతన భవనంలోకి మార్చేందుకు అధికారులు సన్నాహాలు పూర్తి చేశారు. పాత భవనంలో వసతులు చాలక లింగంగుంట్ల కాలనీలోని జల వనరుల శాఖకు చెందిన స్థలంలో భవనాన్ని నిర్మించారు. తాజాగా శాశ్వత ప్రాతిపదికన ఏరియా ప్రభుత్వ వైద్యశాలలోని పలు విభాగాలను నూతన భవనంలోకి తరలించనున్నారు. ఇప్పటికే కలెక్టర్‌ శివశంకర్‌ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, వైద్యాధికారులు పలు మార్లు చర్చించి తరలింపునకు సంబంధించిన ప్రణాళిక తయారు చేసి అమలు చేశారు. వైద్యశాల ప్రారంభం అంశాన్ని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని దృష్టికి అధికారులు తీసుకెళ్లారు. మంత్రి సమయం ఇస్తే ప్రారంభించేందుకు అధికారులు సిద్ధంగా ఉన్నారు.

నూతన భవనంలో ఇవి కూడా..

పల్నాడు రోడ్డులోని ఏరియా ప్రభుత్వ వైద్యశాలలో ఉన్న పలు విభాగాలు నూతన భవనంలోకి తరలించారు. అక్కడ జనరల్‌ మెడిసిన్‌, జనరల్‌ సర్జరీ, అర్థోపెడిక్స్‌, ఆప్తమాలజీ, డెర్మటాలజీ, ఫిజియోథెరపీ, దంత వైద్యం, ఈఎన్‌టీ విభాగాలు నూతన భవనంలో అందుబాటులోకి రానున్నాయి. అత్యవసర వైద్య విభాగంతో పాటు ఎక్స్‌రే, ఫార్మసీ, వసతులు కూడా ఏర్పాటు చేస్తారు. కిడ్నీ బాధితులకు డయాలసిస్‌ కేంద్రాన్ని కూడా అక్కడే ఏర్పాటు చేయనున్నారు. ఇన్‌ షేషెంట్‌లకు 150 పడకలు అందుబాటులోకి తెచ్చారు. శస్త్రచికిత్స చేసేందుకు నాలుగు థియేటర్లు ఏర్పాటు చేశారు. వీటిలో ఒకటి అత్యవసర వైద్యసేవలకు, ఒకటి ఆప్తమాలజీకి, జనరల్‌ సర్జరీకి రెండు కేటాయించారు. దీనికి తోడు రెండు ప్రాణవాయువు ఉత్పత్తి కేంద్రాలను సిద్ధం చేశారు. రెండు ఉత్పత్తి కేంద్రాలు 2000 ఎల్‌పీఎం సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. వైద్యశాల సూపరింటెండెంట్‌ కార్యాలయం, జిల్లా వైద్య విధాన పరిషత్‌ సమన్వయకర్త కార్యాలయం కూడా నూతన భవనంలో ఉంటాయి. పాత భవనంలో ప్రసూతి విభాగం, చిన్న పిల్లల విభాగం, మాతా శిశు సంరక్షణ విభాగం, ఏఆర్‌టీ సెంటర్‌, బ్లడ్‌బ్యాంకు, తదితర సేవలు నిర్వహించనున్నారు.

రూ.20 లక్షలతో సౌకర్యాలు

కొత్త భవనం మరమ్మతులు వసతుల కల్పనకు రూ.20 లక్షలు వ్యయం చేశారు. వైద్యశాల నిధులు రూ.7 లక్షలు, దాతలు అందించిన రూ.లక్ష, పురపాలక సంఘం సహకారంతో కొన్ని పనులు చేయించారు. కొవిడ్‌ సమయంలో కొత్త భవనంలోనే వైద్య సేవలందించిన నేపథ్యంలో మరుగుదొడ్ల మరమ్మతులు, డ్రెయిన్ల నిర్మాణం చేపట్టారు. ప్లోరింగ్‌ సైతం చాలా వరకూ మార్చారు. మార్చురీ, తదితర వసతులకు ప్రతిపాదనలను ఇప్పటికే అధికారులు పంపారు. ఆపరేషన్‌ థియేటర్లకు స్థానిక వైద్యులు ఓటీ లైట్లను రూ.4 లక్షల వ్యయంతో ఏర్పాటు చేశారు.

దాతల సహకారంతో మరిన్ని వసతులు

పల్నాడు జిల్లాకు తలమానికంగా భావించే ఏరియా ప్రభుత్వ వైద్యశాలకు మరిన్ని వసతులు కల్పించేందుకు సంస్థలు ముందుకు వస్తున్నాయి. పవర్‌ గ్రిడ్‌ కార్పొరేషన్‌ వ్యాధి నిర్ధారణలో కీలకమైన సీటి స్కాన్‌ యంత్రాన్ని ఇచ్చేందుకు అంగీకరించింది. దీని కొనుగోలుకు రూ.1.75 కోట్లు అవుతుంది. గ్రిడ్‌ అధికారులు సంసిద్ధత వ్యక్తం చేసి కలెక్టర్‌కు ప్రతిపాదన చేశారు. ఆయన ప్రభుత్వానికి ప్రతిపాదనకు పంపారు. దీంతో సిటీ స్కానింగ్‌ సేవలు అందుబాటులోకి రానున్నాయి. అలాగే ఇండియన్‌ రెడ్‌క్రాస్‌ సంస్థ ప్రతినిధులు కొత్తగా కాంపోనెంట్‌ బ్లడ్‌ బ్యాంకును ఏర్పాటు చేసేందుకు వైద్యాధికారులకు ప్రతిపాదనలు చేశారు. ఇప్పటి వరకూ అవసరమైన వారికి రక్తం ఇచ్చే వారు. కొత్త దానిలో రోగికి అవసరమైన ప్లేట్‌లెట్లు విడిగా ఇచ్చే సౌకర్యం అందుబాటులోకి వస్తుంది. తద్వారా ఒక యూనిట్‌ రక్తం నుంచి ముగ్గురు రోగులకు అవసరమైన కాంపోనెంట్స్‌ అందించేందుకు వీలు కలుగుతుంది. ఇందుకు రెడ్‌క్రాస్‌ సంస్థ రూ.కోటి వ్యయం చేయనుంది.

జిల్లా వైద్యశాలగా ఉన్నతీకరణకు ప్రతిపాదనలు

నరసరావుపేటలోని ఏరియా ప్రభుత్వ వైద్యశాలను జిల్లా వైద్యశాలగా ఉన్నతీకరించాలని కోరుతూ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాం. తద్వారా సూపర్‌స్పెషాలిటీ వైద్యసేవలు అందుబాటులో వస్తాయి. గుండె సంబంధిత వ్యాధులు, న్యూరాలజీకి శస్త్రచికిత్స చేసేందుకు వీలు కలుగుతుంది. ప్రస్తుతం అన్ని విభాగాలకు సంబంధించిన వైద్యులు అందుబాటులో ఉన్నారు. వారంలోగా నూతన భవనంలో వైద్యసేవలు ప్రారంభిస్తాం. - డాక్టర్‌ బీవీ రంగారావు, పల్నాడు జిల్లా వైద్య విధాన పరిషత్‌ సమన్వయకర్త, నరసరావుపేట

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని