logo

‘స్పందనలో అధికారులు ఉండాల్సిందే’

జిల్లా స్థాయి అధికారులు ఎన్ని పనులన్నా ప్రతి సోమవారం స్పందన కార్యక్రమంలో పాల్గొనాల్సిందేనని.. ముందస్తు అనుమతి తీసుకోకుండా ఎవరైనా గైర్హాజరయితే వారిపై చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ ఎం.వేణుగోపాల్‌రెడ్డి పేర్కొన్నారు.

Published : 21 Mar 2023 05:45 IST

ప్రజల నుంచి అర్జీలు స్వీకరిస్తున్న కలెక్టర్‌ వేణుగోపాల్‌రెడ్డి

కలెక్టరేట్‌ (గుంటూరు), న్యూస్‌టుడే: జిల్లా స్థాయి అధికారులు ఎన్ని పనులన్నా ప్రతి సోమవారం స్పందన కార్యక్రమంలో పాల్గొనాల్సిందేనని.. ముందస్తు అనుమతి తీసుకోకుండా ఎవరైనా గైర్హాజరయితే వారిపై చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ ఎం.వేణుగోపాల్‌రెడ్డి పేర్కొన్నారు. కలెక్టరేట్‌లోని ఎస్‌.ఆర్‌.శంకరన్‌ హాలులో సోమవారం స్పందన కార్యక్రమం నిర్వహించారు. స్పందన కార్యక్రమం మధ్యలోనే ఓ శాఖ జిల్లా అధికారి వెళ్లిపోవడంపై కలెక్టర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉన్నతాధికారుల సమావేశాలున్నా స్పందనకు రావాల్సిందేనని, ఏదైనా ఉంటే తన దృష్టికి తీసుకురావాలన్నారు. అర్జీలను సక్రమంగా పరిష్కరించాలని సూచించారు. ఏపీ సేవ దరఖాస్తులు నిర్దేశిత గడువు లోపు వెంటనే పరిష్కరించాలని, గడువు దాటితే ప్రతి దరఖాస్తుకు రోజుకు రూ.వంద జరిమానా వేస్తామని కలెక్టర్‌ హెచ్చరించారు. అర్జీల పరిష్కారంపై సంతృప్తి స్థాయి వివరాలను సేకరిస్తున్నందున అర్జీలు హేతుబద్ధంగా పరిష్కరించాలన్నారు. సోమవారం స్పందన కార్యక్రమంలో 136 అర్జీలు నమోదయ్యాయి. కార్యక్రమంలో జిల్లా సంయుక్త కలెక్టర్‌ జి.రాజకుమారి, డీఆర్‌వో కె.చంద్రశేఖర్‌రావు, ప్రత్యేక ఉప కలెక్టర్‌ ఎం.వెంకటశివరామిరెడ్డి, సహాయ కలెక్టర్‌ శివనారాయణశర్మ, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

పీహెచ్‌సీ వైద్యాధికారి అధికార దుర్వినియోగం

తుళ్లూరు పీహెచ్‌సీ వైద్యాధికారి అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారంటూ మండ్రు శ్రీకర్‌ప్రమోద్‌ సోమవారం స్పందనలో వినతిపత్రం అందించారు. స్థానికంగా ఉండాల్సి ఉన్నా వైద్యాధికారి విజయవాడ రూరల్‌ నుంచి రాకపోకలు చేస్తున్నారని, ఎఫ్‌ఆర్‌ఎస్‌ కూడా ఇంటి వద్ద నుంచే వేస్తున్నారని, పీహెచ్‌సీలోని ఉద్యోగులు సైతం అదేవిధంగా హాజరు వేస్తున్నారన్నారు. ఇక్కడే పని చేసిన ఓ ఉద్యోగి గతేడాది జులై, ఆగస్టు నెలల్లో విధులకు గైర్హాజరయ్యారని, అయినా వారు విధుల్లో ఉన్నట్లు రిజిస్టర్‌లో వైట్‌నర్‌తో హాజరు వేస్తూ ప్రభుత్వ నిధులు జీతం రూపంలో దుర్వినియోగం చేస్తున్నారని తెలిపారు. అధికారులు దీనిపై విచారించి తగు చర్యలు తీసుకోవాలని కోరారు.

హమాలీలకు కూలి ఇవ్వాలని వినతి

గుంటూరు నగరం, రూరల్‌, పెదకాకాని, వట్టిచెరుకూరు, మేడికొండూరు, ఫిరంగిపురం, మంగళగిరి మండలాల్లో నిత్యవసర సరకులు అందించే ముఠా కార్మికులకు కూలి ఇవ్వాలని కోరుతూ సోమవారం సీఐటీయూ ఆధ్వర్యంలో స్పందనలో వినతిపత్రం అందించారు. గతంలో డీలర్స్‌ కూలి ఇచ్చేవారని, గత నెలలో ఇవ్వలేదని హమాలీలు వినతిలో పేర్కొన్నారు. ప్రభుత్వమే ఇస్తుందని చెబుతున్నారని, అధికారులు స్పందించి తమకు కూలి ఇప్పించాలని హమాలీలు కోరారు. వినతిపత్రం అందించిన వారిలో సీఐటీయూ నగర ప్రధాన కార్యదర్శి కె.శ్రీనివాసరావు, హమాలీలు ఎ.కోటయ్య, ఎస్‌.రమేష్‌బాబు తదితరులు పాల్గొన్నారు.

కొలకలూరుకు రెగ్యులర్‌ కార్యదర్శిని నియమించాలి

తెనాలి మండలం కొలకలూరు గ్రామానికి రెగ్యులర్‌ పంచాయతీ కార్యదర్శిని నియమించాలని కోరుతూ పంచాయతీ సర్పంచి ప్రీతి, ఉప సర్పంచి, పాలకవర్గ సభ్యులు స్పందన కార్యక్రమంలో వినతిపత్రం అందించారు. రెగ్యులర్‌ సర్వీసులు ప్రతి రోజు నిర్వహించాల్సినవి ఉన్నాయన్నారు. మేజర్‌ పంచాయతీ కొలకలూరుకు తక్షణం రెగ్యులర్‌ కార్యదర్శిని నియమించాలని కోరారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని