logo

అందరి‘కన్నా’ మిన్న అని..

ఉమ్మడి గుంటూరు జిల్లా రాజకీయాల్లో సీనియర్‌ నేత, మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణను సత్తెనపల్లి తెదేపా ఇన్‌ఛార్జిగా ఆ పార్టీ నియమించింది. ఇప్పటివరకు సత్తెనపల్లి నియోజకవర్గంలో నలుగురైదుగురు నేతలు సీటు ఆశిస్తున్న నేపథ్యంలో కన్నాను నియోజకవర్గ ఇన్‌ఛార్జిగా నియమించడంతో సందిగ్ధతకు తెరపడింది.

Updated : 01 Jun 2023 05:05 IST

లక్ష్మీనారాయణకు సత్తెనపల్లి తెదేపా బాధ్యతలు

ఈనాడు, అమరావతి, న్యూస్‌టుడే, సత్తెనపల్లి: ఉమ్మడి గుంటూరు జిల్లా రాజకీయాల్లో సీనియర్‌ నేత, మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణను సత్తెనపల్లి తెదేపా ఇన్‌ఛార్జిగా ఆ పార్టీ నియమించింది. ఇప్పటివరకు సత్తెనపల్లి నియోజకవర్గంలో నలుగురైదుగురు నేతలు సీటు ఆశిస్తున్న నేపథ్యంలో కన్నాను నియోజకవర్గ ఇన్‌ఛార్జిగా నియమించడంతో సందిగ్ధతకు తెరపడింది. తెలుగుదేశం పార్టీ అధిష్ఠానం ఎప్పుడూ తమ కంచుకోటగా చెప్పుకునే సత్తెనపల్లి నియోజకవర్గానికి తొలిసారిగా సార్వత్రిక ఎన్నికలకు ఏడాది ముందే ఇన్‌ఛార్జిని నియమించింది. తెదేపా ఆవిర్భావం తరువాత 1983 నుంచి 2019 వరకు జరిగిన ప్రతి ఎన్నికల్లోనూ చివరి క్షణంలో అభ్యర్థులను ఎంపిక చేసేవారు. ఇందుకు భిన్నంగా కన్నాకు బుధవారం బాధ్యతలు అప్పగించారు.

ఈ ఏడాది ఫిబ్రవరి 23న కన్నా తెదేపా తీర్థం పుచ్చుకున్నారు. కన్నా చేరిక నుంచే ఆయనకు గుంటూరు పశ్చిమ, సత్తెనపల్లి నియోజకవర్గాల్లో ఏదో ఒకటి బాధ్యతలు అప్పగిస్తారనే ప్రచారం పార్టీలో జరిగింది. పార్టీలో చేరినప్పటి నుంచి కన్నా ఉమ్మడి జిల్లాలో తెదేపా నేతలతో కలిసి పర్యటనలు చేస్తున్నారు. సతె్తెనపల్లి నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి సారించారు. తెదేపా కూడా అక్కడ వైకాపా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి అంబటి రాంబాబుకు దీటైన ప్రత్యర్థిని నిలపాలని భావించింది. మాజీ సభాపతి డాక్టర్‌ కోడెల శివప్రసాదరావు మృతి తర్వాత అక్కడ గ్రూపులు ఏర్పడ్డాయి. నేతల మధ్య సయోధ్య లేక పార్టీ కార్యక్రమాలు వేర్వేరుగా నిర్వహిస్తున్నారు. కన్నా నియామకంతో వీటన్నిటికి తెర పడనుందని పార్టీ అధిష్ఠానం భావించి నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు రాష్ట్ర స్థాయిలో కన్నా లక్ష్మీనారాయణకు పార్టీలో ప్రాముఖ్యత పెరుగుతోంది.

కలిసొచ్చిన రెండు మండలాలు...

ఉమ్మడి గుంటూరు జిల్లాలో కాంగ్రెస్‌ ప్రభుత్వంలో సుదీర్ఘకాలం మంత్రిగా పని చేసిన కన్నా పెదకూరపాడు నియోజకవర్గం నుంచి రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. ఆయన పెదకూరపాడు నుంచి నాలుగుసార్లు వరుసగా విజయం సాధించారు. ఆ నియోజకవర్గం పరిధిలోని రాజుపాలెం, నకరికల్లు మండలంలోని కొన్ని గ్రామాలుండేవి. ప్రస్తుతం అ మండలాలు సత్తెనపల్లి నియోజకవర్గంలో ఉండటం ఆయనకు కలిసొచ్చే అంశం. గతంలో ఆయన గెలుపునకు ఈ రెండు మండలాలే కీలకంగా ఉన్నాయి. మరోవైపు సత్తెనపల్లి పట్టణంలో కూడా ఆయనకు అనుచరగణం ఉంది. కాంగ్రెస్‌ పార్టీ తర్వాత భారతీయ జనతా పార్టీలో చేరి రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు. ఈక్రమంలో రెండు పార్టీల స్థానిక నాయకులతో ఆయనకు మంచి పరిచయాలు ఉన్నాయి. దీనికితోడు ప్రస్తుతం అక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి అంబటి రాంబాబుకు చెక్‌ పెట్టాలనే ఉద్దేశంతో అదే సామాజికవర్గానికి చెందిన కన్నాకు పార్టీ అధిష్ఠానం పచ్చజెండా ఊపింది. కన్నా నియామకంతో తెదేపా శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. తెదేపా వ్యూహాత్మకంగా కన్నాను సత్తెనపల్లి ఇన్‌ఛార్జిగా ఎంపిక చేసినట్లు ఆపార్టీ సీనియర్‌ నేతలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. పల్నాడు జిల్లాలోనూ పలు నియోజకవర్గాల్లో కన్నా ప్రభావం ఉంటుందని వారు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే పల్నాడు జిల్లాలో తనకు వ్యక్తిగతంగా పరిచయమున్న పెదకూరపాడు, చిలకలూరిపేట, నరసరావుపేట, వినుకొండ, గురజాల, మాచర్ల నియోజకవర్గాల్లో పర్యటించి పాత మిత్రులను తెదేపాలోకి ఆహ్వానిస్తున్నారు.

సత్తెనపల్లి పార్టీ ఇన్‌ఛార్జిగా ప్రకటించక ముందే ఆయన ఇప్పటికే నియోజకవర్గంలో పలువురు నేతలను వ్యక్తిగతంగా కలిసి మాట్లాడారు. పార్టీ శ్రేణులు, వివిధ వర్గాలతో ఆయన మమేకమయ్యారు. బుధవారం కన్నా నియోజకవర్గంలో సీనియర్‌ నేతలతో మాట్లాడి కలిసి పనిచేద్దామని కోరారు. మరోవైపు పార్టీ అధిష్ఠానం కూడా పలువురు నేతలతో మాట్లాడి కన్నాతో కలిసి అడుగులు వేయాలని ఆదేశించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని