logo

ఫోన్‌పే చేయమన్నాడు.. అదృశ్యమయ్యాడు!

అద్దంకి పురపాలక కార్యాలయం వద్ద మంచినీటి కుళాయి రుసుం చెల్లించేందుకు వచ్చిన వృద్ధుడ్ని ఓ ఘరానా దొంగ మోసగించాడు. ఈ సంఘటన గురువారం ఉదయం పురపాలక పన్నుల విభాగం వద్ద జరిగింది.

Published : 19 Apr 2024 05:13 IST

అద్దంకి పురపాలక కార్యాలయం వద్ద వృద్ధుడ్ని మోసగించిన ఆగంతకుడు

అద్దంకి, న్యూస్‌టుడే: అద్దంకి పురపాలక కార్యాలయం వద్ద మంచినీటి కుళాయి రుసుం చెల్లించేందుకు వచ్చిన వృద్ధుడ్ని ఓ ఘరానా దొంగ మోసగించాడు. ఈ సంఘటన గురువారం ఉదయం పురపాలక పన్నుల విభాగం వద్ద జరిగింది. పోలీసులు, బాధితుడి కథనం మేరకు.. ప్రకాశం జిల్లా ముండ్లమూరు మండలం భట్లపల్లి గ్రామానికి చెందిన గంగిశెట్టి సుబ్బారావు అద్దంకి పెరికపాలెంలోని ఇంటి కుళాయి పన్నులు చెల్లించేందుకు వచ్చారు. వివరాలు తెలియక కార్యాలయంలో పనిచేసే పొరుగుసేవల ఉద్యోగిని సంప్రదించారు. ఇంటి పన్ను కోసమని భావించిన ఆయన నేరుగా ఆ రసీదు ఇచ్చారు. తన వద్ద అంత డబ్బులు లేవంటూనే నగదు చెల్లించేందుకు సుబ్బారావు తటపటాయిస్తున్నారు. ఇదంతా గమనిస్తున్న పక్కనే ఉన్న ఓ ఆగంతకుడు వృద్ధుడ్ని నమ్మబలికాడు. తన ఫోన్‌పేకు నగదు జమచేస్తే వెంటనే చెల్లిస్తానని భరోసా కల్పించాడు. దీన్ని నమ్మిన సుబ్బారావు తన కుమారుడి ద్వారా రూ.4,840 ఆగంతకుడి చరవాణికి బదిలీ చేయించారు. అంతే.. సీన్‌ కట్‌ చేస్తే ఆగంతకుడి చరవాణి పనిచేయడం లేదు.. అక్కడి నుంచి అతను అదృశ్యమయ్యాడు. సుబ్బారావు చేసేది లేక ప్రత్యామ్నాయంగా నగదు సమకూర్చుకుని కౌంటర్‌లో చెల్లించారు. తనకు జరిగిన మోసంపై అద్దంకి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఆమేరకు పోలీసులు ఫిర్యాదును ధ్రువీకరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని