logo

దశ‘దిశ’లా.. ఆక్రందనలే..!

వైకాపా ప్రభుత్వ పదవీకాలం ముగుస్తున్నా ఇప్పటికీ ఆ చట్టానికి కోరలు లేవు. దాన్ని పార్లమెంట్‌ ఆమోదించలేదు. ఉనికిలో లేని చట్టం గురించి పదేపదే ప్రచారం చేసుకోవడం జగన్‌ సర్కార్‌ తీరుగా మారింది.

Published : 19 Apr 2024 06:32 IST

అన్నతోడంటివి.. కొత్త చట్టంతో ఒరిగిందేంటి?
మహిళలపై అఘాయిత్యాలు ఆగలేదే
సంచలన కేసుల్లో నిందితులు పరారీలోనే
ఈనాడు, అమరావతి, న్యూస్‌టుడే, గుంటూరు నేరవార్తలు, మేడికొండూరు

వైకాపా ప్రభుత్వ పదవీకాలం ముగుస్తున్నా ఇప్పటికీ ఆ చట్టానికి కోరలు లేవు. దాన్ని పార్లమెంట్‌ ఆమోదించలేదు. ఉనికిలో లేని చట్టం గురించి పదేపదే ప్రచారం చేసుకోవడం జగన్‌ సర్కార్‌ తీరుగా మారింది. నాలుగేళ్ల కిందట ఈ చట్టం తీసుకొచ్చిన సందర్భంలో సీఎం మొదలు మంత్రులు, ఆ పార్టీ ప్రజాప్రతినిధులు మహిళల రక్షణ కోసం ఈ సరికొత్త చట్టాన్ని తీసుకొచ్చామని గొప్పలకు పోయారు. ఆచరణలో అవి ఉత్తిమాటలేనని తేలిపోయింది. మేడికొండూరు, తాడేపల్లి స్టేషన్ల పరిధిలో చోటుచేసుకున్న అత్యాచార ఘటనల్లో ఇప్పటికీ నిందితులు కొందరు పట్టుబడలేదు. రెండు నెలల్లోపే నిందితుల్ని పట్టుకుని ఛార్జిషీట్‌ వేస్తామన్నారు. సకాలంలో ఛార్జిషీట్‌ వేయడం, శిక్షలు పడేలా చేయడం దేవుడెరుగు అసలు కొన్ని కేసుల్లో దర్యాప్తులే నెలల తరబడి సాగుతున్నాయి. ఈ దుస్థితిలో దిశ ఉంది.


దిశ చట్టం గోడపత్రికలు ఆవిష్కరిస్తున్న సీఎం జగన్‌ (పాతచిత్రం)

మహిళలు, యువతులు, బాలికలపై అఘాయిత్యాలకు పాల్పడాలంటేనే ఎవరైనా భయపడాలి. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం దేశంలోనే తొలిసారిగా ‘దిశ’ చట్టాన్ని తీసుకొచ్చింది. ఫోన్‌లో దిశ యాప్‌ ఉంటే అన్న తోడుగా ఉన్నట్లే. ప్రతి మహిళతో డౌన్‌లోడ్‌ చేయించాలి.

అసెంబ్లీలో, పలు సందర్భాల్లో ముఖ్యమంత్రి జగన్‌ చెప్పిన మాటలివి


2021 సెప్టెంబరు 8 రాత్రి 11గంటలు.. పల్నాడు జిల్లా సత్తెనపల్లి పట్టణానికి చెందిన దంపతులు బంధువుల ఇంట్లో శుభకార్యం కోసం మేడికొండూరు మండలం పాలడుగు వచ్చారు. చీకటి పడడంతో ద్విచక్ర వాహనంపై తిరిగి ఇంటికి బయలుదేరారు. ఊరికి కొద్దిదూరం వచ్చాక రోడ్డుకి అడ్డంగా చెట్టు కొమ్మ పడేసి భార్యాభర్తలను అడ్డగించారు. కత్తులతో బెదిరించి భర్తను చితకబాదారు. బలవంతంగా ఇద్దరినీ పక్కనున్న పొలంలో చెట్టు కిందకు తీసుకెళ్లి నోట్లో గుడ్డలు కుక్కి కాళ్లు, చేతులు కట్టేశారు. మహిళపై వరుసగా నలుగురు సామూహిక అఘాయిత్యానికి పాల్పడ్డారు. బంగారం, నగదు దోచుకుని పరారయ్యారు. బాధితులు తొలుత సత్తెనపల్లి పోలీసులను ఆశ్రయించారు. ఘటన స్థలి తమ పరిధిలోకి రాదని చెప్పడంతో అక్కడి నుంచి మేడికొండూరు స్టేషన్‌కు వెళ్లారు. అప్పుడు కేసు నమోదు చేశారు. ఈ కేసులో మొత్తం నలుగురు నిందితుల్లో రెండో నిందితుడు దాసరి సుంకన్నను ఇప్పటికీ పోలీసులు పట్టుకోలేకపోయారు. అదేమంటే నిందితులు చరవాణి వాడడం లేదని, అందుకే ఆచూకీ తెలియడం లేదని సాకులు చెబుతున్నారు.


2021 జూన్‌ 19.. సీఎం నివాసానికి సమీపంలో జరిగిన సామూహిక లైంగిక దాడి ఘటన అప్పట్లో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమైంది. తాడేపల్లి పరిధిలో సీతానగరం ఘాట్‌లో కాబోయే భర్తతో కలిసి ఆటవిడుపుగా వచ్చిన ఓ యువతిని నిర్బంధించి ఇద్దరు కామాంధులు అత్యాచారం చేశారు. ఆ ఘటన జరిగి సుమారు మూడున్నరేళ్లయినా ఇప్పటికీ వెంకటేశ్వరరెడ్డి అనే నిందితుడిని మాత్రం పట్టుకోలేదు. ఏళ్లు గడుస్తున్నా నిందితుడు ఇంకా పరారీలో ఉన్నాడంటే దిశ స్టేషన్ల పని తీరు ఎంత దారుణంగా తయారైందో ఈ ఉదంతం చెప్పకనే చెబుతోంది.


2022 సెప్టెంబరు.. గుంటూరు గ్రామీణ మండలానికి చెందిన ఓ యువతిని ఓ యువకుడు ప్రేమిస్తున్నానని నమ్మించి కోరిక తీర్చుకున్నాడు. పెళ్లి చేసుకోమని అడిగితే తనపై స్నేహితులతో కలిసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాడంటూ బాధితురాలు తన తల్లితో కలిసి ఓ మహిళా డీఎస్పీని ఆశ్రయించింది. పోలీసు అధికారిణి కనికరించకపోగా నువ్వు తిరుగుబోతువంట అని కుటుంబ సభ్యుల ముందు తిట్టడంతో ఆ యువతి ఆత్మహత్య చేసుకొన్న ఘటన రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది.


‘దిశ’ మారని ఠాణా

మహిళల భద్రత కోసం ప్రత్యేకంగా దిశ పోలీస్‌స్టేషన్లు ఏర్పాటు చేసినట్లు వైకాపా ప్రభుత్వం గొప్పలు చెప్పింది. ఓ డీఎస్పీ సహా సీఐలు, ఎస్సైలు, సిబ్బందిని కేటాయించారు. వారికి ఇతర స్టేషన్‌లకంటే అధిక జీతభత్యం కేటాయించారు. ఇక్కడ మహిళల ఫిర్యాదులపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయడానికి డబ్బులు డిమాండ్‌ చేస్తున్నారని, నగదు తీసుకొని కూడా నిందితులకే పోలీసులు సహకరిస్తున్నారని సాక్షాత్తూ ఎస్పీకే బాధిత మహిళలు ఫిర్యాదు చేస్తూనే ఉన్నారు.


నిరుపయోగంగా వాహనాలు...

దిశ యాప్‌ ఒక్కసారి ఊపితే వెంటనే పోలీసులు వచ్చి రక్షణ, భద్రత కల్పిస్తారంటూ ఊదరకొట్టారు. నేరుగా స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేస్తేనే కేసు నమోదు చేయడం లేదు. ఇక యాప్‌లో సమాచారం ఇస్తే ఎవరు పట్టించుకుంటారని పెద్ద సంఖ్యలో మహిళలు విమర్శిస్తున్నారు. రూ.లక్షలు పెట్టిన కొనుగోలు చేసిన వాహనాలతో తొలుత కొద్దిరోజులు హడావుడి చేశారు. ఆ తరువాత మూలపడేశారనే అపవాదు ఉంది.


మహిళలకు న్యాయం జరగడం లేదు
- ఎల్‌.అరుణకుమారి, అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం జిల్లా కార్యదర్శి

దిశ పోలీస్‌స్టేషన్ల వల్ల ఏ ఒక్క మహిళ తమకు న్యాయం జరిగిందని చెప్పడం లేదు. అక్కడ ఎవరు డబ్బులిస్తే వారికే అధికారులు వత్తాసు పలుకుతారు. ఇటీవల ఓ యువతి దిశలో పట్టించుకోలేదని మా వద్దక వచ్చి ఆవేదన చెందింది. దిశ యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకుని సెల్‌ఫోన్‌ ఊపితే పోలీసులు వచ్చి రక్షిస్తారని హడావుడి చేశారు. 5లక్షల మందితో యాప్‌ డౌన్‌లోడ్‌ చేయించారు.దీని వల్ల ప్రయోజనమేంటి. మహిళలపై అత్యాచారాలు, లైంగిక వేధింపులు ఆగలేదు. కఠిన చట్టాలు తీసుకురావాలి. వాటిని పోలీసులు పారదర్శకంగా అమలు చేయాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు