logo

కన్నేసి.. కబ్జా చేసి..!

వైకాపా నేతలు అధికారం అండతో అయిదేళ్లు బరితెగించారు. యథేచ్ఛగా పేదల భూములు ఆక్రమించారు. దేవుడి మాన్యాలను వదల్లేదు. ఖాళీ స్థలాలు, ప్రభుత్వ, వాగులు, వంకలు, డొంక రోడ్లు కావేవి కబ్జాకు అనర్హం అన్నట్లు భూదందాలు సాగించారు.

Published : 24 Apr 2024 07:09 IST

అధికారాన్ని అడ్డుపెట్టుకుని రూ. కోట్ల భూములు స్వాహా
వైకాపా నేతల భూ ఆక్రమణలు
న్యూస్‌టుడే, నరసరావుపేటటౌన్‌

వైకాపా నేతలు అధికారం అండతో అయిదేళ్లు బరితెగించారు. యథేచ్ఛగా పేదల భూములు ఆక్రమించారు. దేవుడి మాన్యాలను వదల్లేదు. ఖాళీ స్థలాలు, ప్రభుత్వ, వాగులు, వంకలు, డొంక రోడ్లు కావేవి కబ్జాకు అనర్హం అన్నట్లు భూదందాలు సాగించారు. కొత్త జిల్లాల ఏర్పాటు నేపథ్యంలో జిల్లా కేంద్రంలో భూముల వ్యాపారం వారికి కల్పవృక్షంలా మారింది.ఈ క్రమంలో అక్రమంగా సంపదను పోగేసుకున్నారు.

జిల్లా కేంద్రంలో అధికార పార్టీకి చెందిన ముఖ్య నేత ప్రతి కార్యాలయంలోనూ తన సామాజిక వర్గీయులకు బాధ్యతలు అప్పగించి పర్యవేక్షించారు. అలాగే ఓ సీనియర్‌ దస్తావేజు లేఖరి ఆధ్వర్యంలో భూములను మింగే ప్రణాళిక రూపొందించుకుని అమలు పరిచారు. జెండా కూడా మోయని అనుచరులతో ముఠా ఏర్పాటు చేసుకున్నారు. వారితో భూములు కబ్జా చేయించారు. సొంత సామాజిక వర్గీయులకు చెందిన ప్రైవేటు భూముల్లోకి దళిత నేతలను ఉసిగొల్పి ఆ యజమానులపై అట్రాసిటీ కేసులు నమోదు చేయించారు. అడ్డొచ్చిన వారిని చెరలో వేయించి వేధించారు.
గుంటూరు రోడ్డులోని దళిత కాలనీ పక్కన నాలుగు ఎకరాల చెరువు పోరంబోకులో దళితులు పశువులను మేపుకుంటూ జీవనం సాగిస్తున్నారు. తెదేపా హయాంలో పేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చి కొంతభాగంలో కాలనీ ఏర్పాటు చేశారు. మిగతా ఖాళీ భూమిపై ఆ నేత కన్నేశారు. తన సామాజిక వర్గానికి చెందిన ఓ బిల్డర్‌ని రంగంలోకి దించి, రూ.15 కోట్ల విలువైన చెరువు భూమిని కాజేసేందుకు ప్రణాళిక రూపొందించుకున్నారు. గ్రావెల్‌ మట్టితో మెరక వేసి చదును చేయించారు. ఎన్నికల షెడ్యూలు జారీ చేయకముందే వ్యవహారాన్ని చక్కబెట్టేందుకు అధికార పార్టీకి చెందిన కొంతమంది కార్యకర్తలతో ఆక్రమణ చేయించారు. తమ ఖర్చులతో రేకుల షెడ్లు, స్తంభాలు ఏర్పాటు చేశారు. ఇతరులు రాకుండా వారి ఆధీనంలో ఈ భూమిని ఉంచారు.

ఆక్రమించిన భూమిలో గ్రావెల్‌ మట్టితో చదును

ఉప్పలపాడు వద్ద..

నరసరావుపేట మండలం ఉప్పలపాడు పంచాయతీలో అధికారాన్ని అడ్డుపెట్టుకుని సర్కారు భూములు జగనన్న లేఔట్‌లో కలిపి విక్రయించారు. సాగునీటి కాలువలు, డొంక రోడ్లు, కుంటలు, దేవుడి భూములను సొమ్ము చేసుకుని దింగమింగారు. పట్టణంలో స్థిరాస్తి వ్యాపారులకు వీటిని బలవంతంగా అంటగట్టారు. బెదిరించి వారి నుంచి ముక్కుపిండి వసూలు చేశారు. వీటిని కొనుగోలు చేసిన అమాయకులు భవిష్యత్తులో తమ పరిస్థితి ఏంటని భయాందోళన చెందుతున్నారు.

ఆరామ క్షేత్రం వాటిల్లో పాగా..

చాకిరాలమిట్టలోని శ్రీకృష్ణదేవరాయలు కాపు ఆరామ క్షేత్రం ఎదురు ప్రభుత్వ భూమిని ఆక్రమించేందుకు సదరు నేత పార్టీ కార్యకర్తలను రంగంలోకి దించాడు. స్థానికులు శుభ కార్యానికి మరోక ఊరు వెళ్లిన సమయంలో కాపుల ఆధీనంలోని రూ.1.5కోట్ల విలువైన ఈ స్థలాన్ని చదును చేశారు. అంతలో అక్కడికి చేరుకున్న మహిళలు జేసీబీకి అడ్డుపడ్డారు. ఆక్రమణదారులను తరిమేశారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, పాఠశాలకు మధ్య రజక సామాజిక వర్గానికి చెందిన ప్రభుత్వ భూమికి నకిలీ పత్రాలు రూపొందించారు. వరుస రిజిస్ట్రేషన్లతో లింకు డాక్యుమెంట్లు సృష్టించారు. పాల వ్యాపారిని అడ్డుపెట్టుకుని ఎటువంటి అనుమతులు లేకుండా అక్రమ నిర్మాణాలు చేపట్టారు. అధికార పార్టీ మహిళ నేత కూడా కొంత స్థలాన్ని ఆక్రమించి పాత సామగ్రి దుకాణం నిర్వహిస్తోంది.

చెరువు భూమిని ఆక్రమించి వేసిన స్తంభాలు, రేకుల షెడ్లు

లేఔట్‌లో కలుపుకొన్న వాటి వివరాలు

  • ఎన్నెస్పీ పంట కాలువకు చెందిన 6.15ఎకరాలు,
  • డొంక రోడ్డు 3.50 ఎకరాలు, 
  • కుంట భూమి 0.28 సెంట్లు,  
  • నోషనల్‌ ఖాతాకు చెందిన 14.66 ఎకరాలు,
  • సర్వీసు ఇనాం 16.47 ఎకరాలు,
  • నియోజకవర్గంలో స్థిరాస్తి లేఔట్లలో కాలువ, ప్రభుత్వ భూములుంటే వాటికి మార్కెటÂ ధర ప్రకారం ముఖ్యనేతకు ముడుపులు చెల్లించాలి. లేదంటే ఆ ప్లాట్లకు రిజిస్ట్రేషన్‌ నిలిపేయిస్తారు. గత అయిదేళ్లలో కొన్ని సంఘటనలు మాత్రమే వెలుగుచూశాయి. బయటకు రాకుండా బెదిరించి లాగేసుకున్న నివేశన స్థలాలు కోకొల్లలు. వైకాపా నేతల భూ ఆక్రమణలకు కొందరు పేదలు స్థలాలు పోగొట్టుకుని రోడ్డున పడ్డారు.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని