logo

చోరీ చేశారని కుటుంబ సభ్యుల మందలింపు..మనస్తాపంతో ఇద్దరి బలవన్మరణం

చోరీ ఘటన ఊరంతా చర్చకు దారి తీసింది. తమ పరువు పోతోందని కుటుంబ సభ్యులు మందలించడంతో మనస్తాపం చెందిన బోడ లక్ష్మయ్య(50), చాపల వెంకట్‌(45) పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డారు. గ్రామస్థులు తెలిపిన వివరాలు.

Published : 09 Dec 2021 02:26 IST

చాపల వెంకట్‌

సంగారెడ్డి అర్బన్‌, న్యూస్‌టుడే: చోరీ ఘటన ఊరంతా చర్చకు దారి తీసింది. తమ పరువు పోతోందని కుటుంబ సభ్యులు మందలించడంతో మనస్తాపం చెందిన బోడ లక్ష్మయ్య(50), చాపల వెంకట్‌(45) పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డారు. గ్రామస్థులు తెలిపిన వివరాలు.. సంగారెడ్డి మండలం గంజిగూడెం గ్రామానికి చెందిన బోడ లక్ష్మయ్య, చాపల వెంకట్‌ కలిసి సోమవారం సంగారెడ్డిలో సైకిల్‌ చోరీ చేశారు. అదే రోజు అర్ధరాత్రి అదే గ్రామంలో గుడాల కుమార్‌కు చెందిన పశువులను అపహరించేందుకు యత్నించారు. కుమార్‌ గమనించి కేకలు వేయడంతో అక్కడి నుంచి ఉడాయించారు. తర్వాత బోడ కృష్ణకు చెందిన స్కూటీని చోరీ చేసి గ్రామ శివారులోని పంట కాల్వలో పడేశారు. చోరీల విషయం తెలుసుకున్న గ్రామస్థులు మంగళవారం సంగారెడ్డి గ్రామీణ ఠాణాకు ఫిర్యాదు చేసేందుకు వెళ్లారు. సాయంత్రం కానిస్టేబుళ్లను గ్రామానికి పంపిస్తామని పోలీసులు సమాధానం ఇవ్వడంతో వెనుదిరిగారు. సాయంత్రం వరకు పోలీసులు విచారణకు రాలేదు. దీంతో గ్రామపెద్దల సమక్షంలో గ్రామంలో పంచాయతీ నిర్వహించారు. బోడ లక్ష్మయ్య, చాపల వెంకట్‌ కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకొని.. నిందితులు ఇద్దరినీ మందలించారు. ‘మీ వల్ల గ్రామంలో మా పరువు పోతోందని’ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ తర్వాత అందరూ అక్కడి నుంచి వెళ్లి పోయారు. దీంతో మనస్తాపం చెందిన లక్ష్మయ్య, వెంకట్‌ సంగారెడ్డిలోని కింది బజార్‌కు వెళ్లారు. అక్కడే మద్యంలో పురుగుల మందు కలుపుకొని తాగారు. రాత్రి అయినా తండ్రి ఇంటికి రాలేదని చాపల వెంకట్‌ తనయుడు గ్రామంలో గాలించాడు. కింది బజార్‌లో ఉన్నట్టు గుర్తించి తండ్రిని ఇంటికి తీసుకెళ్లాడు. పురుగులు మందు తాగిన విషయాన్ని గుర్తించలేదు. తెల్లవారు జామున వెంకట్‌ పరిస్థితి విషమంగా ఉండటంతో కుటుంబీకులు జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ బుధవారం తెల్లవారుజామున మరణించాడు. మరో బాధితుడు బోడ లక్ష్మయ్య సంగారెడ్డిలోని ఓ మద్యం దుకాణం సమీపంలో శవమై ఉన్నట్టు గ్రామస్థులు గుర్తించి.. పోలీసులకు సమాచారం ఇచ్చారు. లక్ష్మయ్య, వెంకట్‌ వ్యక్తిగత కారణాలతో పురుగుల మందు తాగి మరణించారని, చోరీలు, ఇతరత్రా విషయాలు తమ దృష్టికి రాలేదని సంగారెడ్డి పట్టణ సీఐ బైరి రమేశ్‌ పేర్కొన్నారు.

 

 

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని