logo

Omicron: పారామౌంట్‌ కాలనీలో హైఅలర్ట్‌!

టోలిచౌకిలో బుధవారం రెండు ఒమిక్రాన్‌ కేసులు వెలుగుచూడడంతో జీహెచ్‌ఎంసీ, వైద్య ఆరోగ్య శాఖ అప్రత్తమయ్యాయి. అక్కడ హైఅలర్ట్‌ ప్రకటించాయి. అధికారులు రంగంలోకి దిగి బాధితులు ఉంటున్న అపార్ట్‌మెంట్‌లోని అన్ని ప్లాట్లతోపాటు వాటికి అనుసంధానంగా

Updated : 16 Dec 2021 08:21 IST

ఒమిక్రాన్‌ కేసుల నమోదుతో కలకలం
తొలిరోజు 100 మందికి ఆర్టీపీసీఆర్‌ పరీక్షలు

ఈనాడు, హైదరాబాద్‌: టోలిచౌకిలో బుధవారం రెండు ఒమిక్రాన్‌ కేసులు వెలుగుచూడడంతో జీహెచ్‌ఎంసీ, వైద్య ఆరోగ్య శాఖ అప్రత్తమయ్యాయి. అక్కడ హైఅలర్ట్‌ ప్రకటించాయి. అధికారులు రంగంలోకి దిగి బాధితులు ఉంటున్న అపార్ట్‌మెంట్‌లోని అన్ని ప్లాట్లతోపాటు వాటికి అనుసంధానంగా ఉన్న మరికొన్నింటిలో నివాసితుల శాంపిళ్లు సేకరించి ఆర్టీపీసీఆర్‌ పరీక్షలకు పంపారు. ఫలితాలు 24 గంటల్లోపు వచ్చే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. గురువారమూ వైద్య ఆరోగ్య శాఖ నుంచి 10-15 బృందాలు రంగంలోకి దిగనున్నాయి. కాలనీలో మరిన్ని పరీక్షలు చేయనున్నాయి. బుధవారం కాలనీ మొత్తం క్రిమిసంహారక ద్రావణాన్ని పిచికారి చేశారు. బాధితులతో దగ్గరగా మెలిగిన వారిని హోం ఐసోలేషన్‌లో ఉండాలని సూచించారు. నగరంలో 30 సర్కిళ్లలో ప్రత్యేక బృందాలతో సిద్ధంగా ఉన్నామని, ఆరోగ్యశాఖతో సమన్వయం చేసుకుంటూ ద్రావణాన్ని పిచికారి చేస్తున్నామని బల్దియా వెల్లడించింది

ఎక్కడెక్కడ తిరిగారో..: కెన్యా, సోమాలియాకు చెందిన వ్యక్తులకు ఒమిక్రాన్‌ సోకినట్లు బయట పడటంతో ట్రేసింగ్‌, టెస్టింగ్‌, ఐసొలేషన్‌ ప్రక్రియ కీలకంగా మారనుంది. అనారోగ్య సమస్యలకు చికిత్స కోసం వచ్చిన బాధితులు నగరంలోని రెండు కార్పొరేట్‌ ఆసుత్రులకు వెళ్లినట్లు తెలుస్తోంది. ఆసుపత్రుల్లో  ఎవరెవరిని కలిశారు.. ఎన్ని రోజులు గడిపారు.. ఎక్కడెక్కడ తిరిగారు.. అనేది చాలా ముఖ్యం. ఈ వేరియంట్‌ వేగంగా విస్తరిస్తున్న దృష్ట్యా బాధితులతో సన్నిహితంగా మెలిగిన వారిని గుర్తించడం పెద్ద పరీక్షగా మారింది.

కంటెయిన్‌మెంట్‌ జోన్‌ లేకుండా ఎలా: గతంలో గ్రేటర్‌లోని ఏదైనా ఒక ప్రాంతంలో ఎక్కువ కరోనా కేసులు బయట పడితే అక్కడ కంటైన్‌మెంట్‌ జోన్‌లను జీహెచ్‌ఎంసీ ఏర్పాటు చేసింది. 14 రోజులపాటు స్థానిక ప్రజలు బయటకు రాకుండా... బయట నుంచి లోపలకు ఎవరు వెళ్లకుండా చర్యలు తీసుకుంది. ఆ తర్వాత అన్ని ప్రాంతాల్లో కేసులు పెరగడంతో ఎత్తివేసి ఎవరికి వారు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. తాజాగా కొత్త వేరియంట్‌ బయట పడిన నేపథ్యంలో కంటెయిన్‌మెంట్ల ఆవశ్యకతను గుర్తుచేస్తున్నారు.

విదేశీయుల అడ్డా... అద్దెకు ఇళ్లు: టోలిచౌకిలోని పారామౌంట్‌ కాలనీ చాలాకాలం నుంచి విదేశీయులకు అడ్డాగా మారింది. సోమాలియా, నైజీరియా, కెన్యా తదితర ఆఫ్రికా దేశాల నుంచి ఎక్కువ మంది చికిత్సలు,  ఇతర పనులకు వచ్చి ఇక్కడే ఆశ్రయం పొందుతుంటారు. 2-3 నెలలు కుటుంబాలతో ఉంటారు. తాజాగా కెన్యా, సోమాలియా నుంచి వచ్చిన వారిలో ఒమిక్రాన్‌ వేరియంట్‌ ఉందని తేలింది. ఈ రెండు దేశాలు ఒమిక్రాన్‌ ముప్పు దేశాల్లో లేకపోవడం గమనార్హం. 

విదేశాల నుంచి వంద మందికి పైగా రాక
కాటేదాన్‌, న్యూస్‌టుడే: రాజేంద్రనగర్‌, మహేశ్వరం నియోజకవర్గాల్లో ఇటీవల వంద మందికిపైగా విదేశాల నుంచి వచ్చినట్లు తెలుస్తోంది. వీరికి విమానాశ్రయంలో పరీక్షలు చేసినా ఫలితాలు రాకముందే ఇళ్లకు చేరారు. ప్రధానంగా జల్‌పల్లి పురపాలికలోని మైనార్టీల నివాసిత ప్రాంతాలు, సులేమాన్‌నగర్‌, శాస్త్రిపురం డివిజన్‌లతో పాటు బండ్లగూడ పరిసరాల్లో విదేశాల నుంచి వచ్చిన వారు అధికంగా ఉన్నారు.


 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని